Loan Waiver: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ కోసం బుధవారం మరో వెయ్యి కోట్ల రూపాయలను విడుదల చేసింది. రూ.1.20 లక్షల రుణాలు ఉన్న రైతుల ఖాతాల్లో రూ.99,999 చొప్పున బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. రుణ మాఫీ పథకంలో మొత్తం 29.61 లక్షల మంది రైతులు ఉండగా.. ఇప్పటి వరకు 21.35 లక్షల మందికి రూ.11,812 కోట్ల రుణాలు మాఫీ అయ్యాయి. ఇంకా 8.26 లక్షల మంది ఉండగా.. వారి రుణాలు మాఫీ కావడానికి మరో రూ. 8 వేల కోట్ల మేరకు విడుదల కావాల్సి ఉంది. రుణమాఫీ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 19 వేల కోట్లు వెచ్చించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.


దీంతో రుణమాఫీ ప్రక్రియ మరింత వేగం కానుంది. రెండో విడత రుణమాఫీని ఆగస్టు 3 నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెలిసిందే. మొత్తం 29.61 లక్షల మంది రైతులకు సంబంధించిన రూ. 19 వేల కోట్ల రుణాలు మాఫీ చేయాలని కేసీఆర్ ఇప్పటికే నిర్ణయించారు. ఆగస్టు 15వ తేదీన ఒకే రోజు రూ. 5,809 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. దీంతో 9 లక్షల మంది రైతులకు రుణాల నుంచి విముక్తి కల్పించింది. ఇప్పటి వరకు 1.20 లక్షల రుణాలు తీసుకున్న రైతులకు సంబంధించి రూ.99,999 రుణాన్ని మాపీ చేయగా.. రాబోయే రోజుల్లో రూ. లక్షల రుణం తీసుకున్న రైతుల రుణాలు కూడా మాఫీ చేయనుంది.


రాష్ట్ర ప్రభుత్వం మొదట 2014 మార్చి 31 వరకు ఉన్న రూ. లక్షల వరకు వ్యవసాయ రుణాలను రద్దు చేస్తూ నాలుగు విడతల్లో 35,31,913 మంది రైతులకు రూ.16,144.10 కోట్ల రుణాలు మాఫీ చేసింది. రెండో విడతలో భాగంగా.. 2014 ఏప్రిల్ 1వ తేదీ నుంచి 2018 డిసెంబర్ 11 నాటికి రూ. లక్షల లోపు అప్పులు తీసుకున్న 42.56 లక్షల మంది రైతులకు రూ.28,930 కోట్ల రుణాలకు అసలు, వడ్డీ కలిపి కుటుంబానికి రూ.లక్ష చొప్పున మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో మొదటి దఫాలో రూ.25వేల లోపు ఉన్న రుణాలు రద్దు చేసింది. రెండో దఫాలు రూ.50 వేలలోపు ఉన్న రుణాలు రద్దు చేసింది. తాజాగా రూ.50 వేల నుంచి రూ. లక్షల వరకు ఉన్న రుణాల మాఫీ కోసం తాజాగా రూ.19 వేల కోట్లను విడుదల చేయనుంది. ఆగస్టు 3వ తేదీ నుంచి రుణమాఫీ పున: ప్రారంభమైన విషయం తెలిసిందే. రైతుబంధు తరహాలో విడతల వారీగా కొనసాగిస్తూ నెల పదిహేనురోజుల్లో, సెప్టెంబర్ వరకు, రైతు రుణ మాఫీ కార్యక్రమాన్ని సంపూర్ణంగా పూర్తి చేయాలని ఇప్పటికే సీఎం కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.