హైదరాబాద్: తమ పార్టీలో టికెట్ దక్కని అసంతృప్తులు వేరే పార్టీలకు జంప్ అవుతున్నారు. కాంగ్రెస్ రెండో జాబితాలో టికెట్ దక్కపోవడంతో మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ సమక్షంలో నాగం జనార్దన్ రెడ్డి, విష్ణువర్దన్ రెడ్డి, కరీంనగర్ కాంగ్రెస్ నేత కొత్త జైపాల్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరారు. గులాబీ కండువా కప్పి వారిని పార్టీలోకి స్వాగతించారు. 


బీఆర్ఎస్ లో నేతల చేరికపై సీఎం కేసీఆర్ మాట్లాడారు. 1969 తెలంగాణ ఉద్యమంలో నాగం జనార్దన్ రెడ్డి క్రియాశీలకంగా ఉన్నారు. ఆ తరువాత మలిదశ ఉద్యమంలో పాల్గొన్నారని నాగం సేవల్ని గుర్తుచేశారు. ఉద్యమంలో జైలుకు వెళ్లిన చరిత్ర నాగంది. ఆయన చేరికతో పాలమూరులో పార్టీకి బలం పెరిగిందన్నారు. పాలమూరులో పద్నాలుగుకు 14 సీట్లు గెలవడం ఖాయం అయ్యిందన్నారు. నాగం ఇంటికి త్వరలో నేనే స్వయంగా  వెళ్లి మరోసారి ఆయన వెంట వచ్చిన కార్యకర్తలను కలుసుకుంటానని కేసీఆర్ చెప్పారు.


పీవీఆర్ రాజకీయ భవిష్యత్ నా బాధ్యత: కేసీఆర్
‘పి జనార్దన్ రెడ్డి (పీజేఆర్) నాకు మంచి మిత్రుడు. ఆయన కుమారుడు విష్ణువర్దన్ రెడ్డి నా కుటుంబ సభ్యుడి లాంటివాడు. ఇకనుంచి విష్ణువర్ధన్ రెడ్డి మంచి రాజకీయ భవిష్యత్ కు నాది భాద్యత . ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్, విష్ణు పాత కొత్త అనే తేడా లేకుండా జూబ్లీహిల్స్ లో సమన్వయంతో పని చేసుకోవాలి. తెలంగాణ బ్రహ్మాండమైన పురోగతితో ముందుకు సాగుతోంది. తలసరి ఆదాయం పెరిగింది. 24 గంటల కరెంటు దేశం లో మరెక్కడా లేదు’ అన్నారు కేసీఆర్


తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే ప్రతిపక్షాలు నీచ రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. నిన్న ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిని చంపాలని చూశారని, దేవుడి దయ వల్ల  ప్రభాకర్ రెడ్డి బతికి బయటపడ్డారని చెప్పారు. రాష్ట్రంలో గతంలో ఇలాంటి హత్య రాజకీయాలు, దాడులు జరగలేదన్నారు. హింసాత్మక చర్యలు ఎవరు చేసినా ఉపేక్షించం అన్నారు. ఇలా నేతలపై దాడులు చేస్తున్న వారికి ప్రజలు ఈ ఎన్నికల్లో బుద్ధి చెబుతారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. 


బీఆర్ఎస్ లో చేరుతున్న కాంగ్రెస్ నేతలు!
కాంగ్రెస్ నంచి సీట్లు ఆశించి భంగపడిన నేతలు ఒక్కొక్కరిగా పార్టీని వీడుతున్నారు. అధికార పార్టీ బీఆర్ఎస్ లో చేరుతున్నారు. నిన్న తన అనుచరులతో చర్చించిన తరువాత మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. తనకు జడ్చర్ల లేక మహబూబ్ నగర్ నుంచి సీటు వస్తుందని ఆశించిన ఎర్ర శేఖర్ కు నిరాశే ఎదురైంది. దాంతో జడ్చర్చ మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ ఆదివారం బీఆర్ఎస్ లో చేరారు. తెలంగాణ భవన్లో మంత్రి కేటీఆర్ గులాబీ కండువా కప్పి ఎర్ర శేఖర్ ను బీఆర్ఎస్ లోకి సాదరంగా ఆహ్వానించారు. 


నేడు నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పీజేఆర్ తనయుడు పి విష్ణువర్దన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరారు. కాంగ్రెస్ పార్టీలో టికెట్లు దక్కని నేతలపై బీఆర్ఎస్ ఆకర్షణ మంత్రం ప్రయోగిస్తోంది. మంత్రులు కేటీఆర్, హరీష్ రావు .. కాంగ్రెస్, బీజేపీ అసంతృప్తులను కలిసి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు.