మెదక్‌ ఎంపీ, దుబ్బాక బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిపై దాడి కలకలం రేపుతోంది. గటాని రాజు అనే వ్యక్తి ఎంపీపై కత్తితో దాడిచేశాడని ప్రచారం జరుగుతోంది.  ఇంతకీ గటాని రాజు ఎవరు? ఎందుకు ఎంపీపై హత్యాయత్నం చేశాడన్నది చర్చనీయాంశంగా మారింది. 


గటాని రాజు. యూట్యూబ్‌ చానళ్లలో పనిచేస్తున్నాడు. విలేకరి ముసుగులో పలు దందాలకు పాల్పడేవాడన్న ఆయనపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే... ఆయనకు  ఎంపీ కొత్తప్రభాకర్‌రెడ్డిని చంపాలన్నంత కక్ష ఎందుకు అన్నదే ప్రజలకు అంతుబట్టడంలేదు.  కాంగ్రెస్‌, బీజేపీ.. తమను రాజకీయంగా ఎదుర్కోలేక దాడులకు  తెగబడుతున్నాయని బీఆర్‌ఎస్‌ ఆరోపిస్తోంది. గటాని రాజు కాంగ్రెస్‌ కార్యకర్త అని... ఇటీవలే బీజేపీలో చేరాడని బీఆర్‌ఎస్‌ నేతలు చెప్తున్నారు. అయితే గటని రాజు తమ  కార్యకర్త కాదని.. బీజేపీ పార్టీకి చెందిన వాడని కాంగ్రెస్‌ వాదిస్తోంది. ఇక బీజేపీ విషయానికి వస్తే... ఎంపీపై దాడితో తమకు సంబంధం లేదని వాదించారు దుబ్బాక ఎమ్మెల్యే  రఘునందనరావు. గటాని రాజు కాంగ్రెస్‌ నేతలతో ఉన్న ఫొటోలను చూపించి... ఆయన కాంగ్రెస్‌ కర్యకర్తే అని స్పష్టం చేశారు. ఇంతకీ నిందితుడు గటాని రాజు ఎందుకు దాడి  చేశాడు..? ఎవరైనా చెప్తే దాడి చేశాడా..? లేక.. ఇంకేదైనా కారణం ఉందా అన్నది తేలాల్సి ఉంది.


మిరుదొడ్డి మండలం చెప్యాలకు చెందిన గటాని రాజుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కలప రవాణా చేసే వాహనాలను ఆపడం.. డబ్బులు వసూలు చేయడం వంటివి  చేసేవాడని సమాచారం. అంతేకాదు కల్లు డిపోలు, షాపుల యజమానుల నుంచి కూడా డబ్బులు వసూలు చేసేవాడట. గటాని రాజు దౌర్జన్యాలు భరించలేక.. స్థానిక  వ్యాపారులు అతనిపై దాడి కూడా చేసినట్టు తెలుస్తోంది. అయితే.. ఎంపీ కొత్తప్రభాకర్‌రెడ్డికి, గటాని రాజు మధ్య ఉన్న పంచాయతీ ఏంటి..? ఎంపీని హత్య చేయాలన్నంత కక్ష  ఎందుకు అన్నదే అంతుపట్టడంలేదు చాలా మంది.


ఇంటి స్థలం, దళితబంధు కోసం గటాని రాజు.... ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి దగ్గరకు వెళ్లినట్టు తెస్తోంది. ఇటీవల మిరుదొడ్డి మండల విలేకరులకు చెప్యాల క్రాస్‌రోడ్డులో ఇళ్ల స్థలాలు  కేటాయించారు. అందులో తనకూ స్థలం కేటాయించాలని రాజు కోరగా.. ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిని అడగాలని అధికారులు సూచించారట. దీంతో రాజు చాలాసార్లు ఎంపీ దగ్గరకు  వెళ్లి ఇంటి స్థలం కోసం అడిగాడని స్థానికులు చెప్తున్నారు. అయితే.. ఎన్నికల కోడ్‌ ఉన్నందున ఇప్పుడు సాధ్యం కాదని ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి చెప్పి పంపారట. దీంతో రాజు  కక్ష కట్టి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అంతేకాదు... దళితబంధు కూడా ఇవ్వలేదన్న కోపం కూడా రాజుకు ఉందట. కావాలనే తనకు పథకాలు అందకుండా చేస్తున్నారన్న  కోపం ఉన్న గటాని రాజు.. ఎంపీ కొత్తప్రభాకర్‌రెడ్డిపై కక్ష పెంచుకుని దాడి చేసి ఉండొచ్చని భావిస్తున్నారు.


నిన్న ఎన్నికల ప్రచారంలో ఉన్న ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై దాడి జరగడంతో.. వెంటనే యశోద ఆస్పత్రిలో చేర్పించారు. మూడు గంటల పాటు ఆయనకు సర్జరీ చేశారు యశోద ఆస్పత్రి వైద్యులు. గాయం చిన్నదే అయినా తీవ్రత ఎక్కువగా ఉందని... కొత్త ప్రభాకర్‌రెడ్డి కోలుకోవడానికి సమయం పడుతుందని స్పష్టం చేశారు. నిన్న యశోద ఆస్పత్రికి వెళ్లి కొత్త ప్రభాకర్‌రెడ్డిని పరామర్శించారు సీఎం కేసీఆర్‌.