ఎన్నికల వేళ వెరైటీ ప్రచారాలు
... ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు పడే పాట్లు కామెనే. కానీ ఇప్పుడు జరిగింది మాత్రం ఇంకాస్త కొత్తగా ఉంది. అధికార పార్టీ అవినీతిని..  ఈజీగా ప్రజల్లోకి తీసుకెళ్తోంది ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ. అందుకు వినూత్న రీతిని ఎంచుకుంది. అదే కాళేశ్వరం ఏటీఎం. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఈ ఏటీఎంలు  కనిపిస్తున్నాయి. ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నారు. చిన్న.. పెద్ద అంతా ఆ ఏటీఎం మిషన్ల దగ్గర క్యూ కడుతున్నారు. 


తెలంగాణ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్‌ పార్టీ.. కొత్త ఆలోచనలతో ముందుకెళ్తోంది. ప్రసంగాలతో ప్రభుత్వ అవినీతి ఎండగట్టడంతో పాటు... తమ వాదనను  ప్రజల్లోకి సులువుగా తీసుకెళ్లే మార్గాలను ఎంచుకుంటోంది. ముఖ్యంగా.. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని వాదిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ... ఈ దిశగా వినూత్న రీతిలో  ప్రచారం ప్రారంభించింది. కాళేశ్వరం ఏటీఎంను ఆవిష్కరించింది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కాళేశ్వరం పేరుతో ఏటీఎం మిషన్లను ఏర్పాటు చేసింది. ఆ ఏటీఎం మిషన్లపై  కాళేశ్వరం కరప్షన్ రావు KCR అంటూ ఫొటోలు అతికించింది. ఈ శతాబ్దపు అతిపెద్ద స్కాం కాళేశ్వరం అంటూ ఆ ఏటీఎంపై కొటేషన్లు కూడా పెట్టింది. 


అంతేకాదు... ఆ ఏటీఎం మిషన్ల నుంచి లక్ష కోట్ల రూపాయల నోటు వచ్చేలా ఏర్పాటు చేసింది కాంగ్రెస్‌ పార్టీ. దీని ద్వారా...  కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష  కోట్ల రూపాయలను ఎలా దుర్వినియోగం చేసిందో ప్రజలకు తెలియజేస్తున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. లక్ష రూపాలయ డూప్లికేట్‌ నోటు వెనుక... సీఎం కేసీఆర్‌ ఫొటో ముద్రించి..  కాళేశ్వరం కరప్షన్ రావు అంటూ పేరు పెట్టారు. ఈ నోటుపై కారు గుర్తును కూడా ముద్రించారు. ఏటీఎం నుండి లక్ష కోట్ల రూపాయల నోటు బయటికి రావడం ప్రజల దృష్టిని  ఆకర్షిస్తోంది. 


హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఈ కాళేశ్వరం ఏటీఎంలను ఏర్పాటు చేసింది కాంగ్రెస్‌ పార్టీ. కొన్ని చోట్ల ఈ ఏటీఎంలపై సీఎం కేసీఆర్‌తోపాటు మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు,  ఎంపీ సంతోష్ ఫొటోలు కూడా ముద్రించారు. ఏటీఎంలు వెరైటీగా కనిపించడంతో ప్రజలు గుమికూడుతున్నారు. అక్కడికి వచ్చిన వారందరికీ కాళేశ్వరం ఏటీఎంలో నుంచి  నుంచిలక్ష రూపాయల నోటు తీసిచ్చి... ప్రాజెక్టు పేరుతో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇంత పెద్ద అవినీతి చేసిందని వివరిస్తున్నారు కాంగ్రెస్‌ కార్యకర్తలు.


కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల రూపాయల అవినీతి జరిగిందని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. ఇటీవల మేడిగడ్డ బ్యారేజీ దగ్గర పిల్లర్లు కుంగిపోయాయి. ప్రాజెక్టు కట్టిన నాలుగు సంవత్సరాలకే పిల్లర్లు కుంగిపోవడంపై కాంగ్రెస్‌ విమర్శలను మరింత తీవ్రం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టును ఏటీఎంగా మార్చుకుని కేసీఆర్ కుటుంబ సభ్యులు లక్ష కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేతలతోపాటు జాతీయ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే.. ప్రతిపక్షా ఆరోపణలు బీఆర్‌ఎస్‌ పార్టీ మొదటి నుంచి ఖండిస్తోంది. బ్యారేజ్‌లో సాంకేతిక సమస్యతో వస్తే విపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయని మండిపడుతోంది. ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొడుతోంది కేసీఆర్‌ సర్కార్‌.