Telangana Elections 2023 :  తెలంగాణ బీజేపీ ఇప్పటి వరకూ రెండు జాబితాలు ప్రకటించింది. 119 స్థానాలకు గాను 53 మంది అభ్యర్థుల్ని ప్రకటించారు. ఇంకా 66 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించాలి. కానీ కసరత్తు ఏ మేరకు జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు.  ఓ వైపు జనసేనతో పొత్తు వల్ల  కొత్త తలనొప్పులు వచ్చిపడ్డాయి. కూకట్ పల్లి, శేరిలింగంపల్లి సెగ్మెంట్లను ఇవ్వాలని జనసేన కోరుతోంది. ఈ సెగ్మెంట్లను వదులుకోవద్దని బీజేపీ నేతలు పట్టుబట్టుతున్నారు. స్థానిక కమలం నేతల ఆందోళన నిరసన రూపం దాల్చింది. దీంతో బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై తీవ్రస్థాయిలో ఒత్తిడి పెరిగింది.  


కొన్ని చోట్ల బలమైన అభ్యర్థుల పోటీ 


సికింద్రాబాద్ పార్లమెంటరీ సెగ్మెంట్ పరిధిలోని నియోజకవర్గాల టికెట్ల కేటాయింపు స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డికి పెద్ద తలనొప్పిగా మారింది. ఇప్పటికే ఖైరతాబాద్ స్థానాన్ని చింతల రామచంద్రారెడ్డికి కేటాయించారు.  ఒక్కో సెగ్మెంట్ నుంచి ఇద్దరు ముగ్గురు పోటీ పడుతున్నారు.  మెజార్టీ సీట్లు తమకే ఇవ్వాలని బీసీ నేతలు పట్టుబట్టుతున్నారు. కిషన్ రెడ్డి అసెంబ్లీకి పోటీ చేయడం లేదు. దీంతో ఓ కొత్త అభ్యర్థిని ఖరారు చేయాల్సి ఉంది. సీటు కోసం  హైదరాబాద్ బీజేపీ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు గౌతంరావు, మాజీ మంత్రి కృష్ణయాదవ్, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి పోటీ పడుతున్నారు.  గోషామహల్‌లో చాన్స్ ఇవ్వకపోవడంతో జూబ్లీ హిల్స్, ముషీరాబాద్, నాంపల్లిల్లో ఏదో ఒక స్థానాన్ని తనకు కేటాయించాలని విక్రం గౌడ్ కోరుతున్నారు. 


జనసేనకు కేటాయిచే సీట్ల వల్ల మరికొన్ని సమస్యలు


జనసేనతో పొత్తులు పెట్టుకోవాలని బీజేపీ హైకమాండ్ నిర్ణయించింది.  దీంతో జనసేన అధినేత పవన్ తో రెండు సార్లు చర్చలు జరిపారు. ఎన్నిసీట్లు కేటాయిస్తారు.. ఏ ఏ సీట్లు అన్నదానిపై స్పష్టత లేదు.  జనసేన పార్టీకి సెటిలర్ల మద్దతు ఉంటుందన్న ఉద్దేశంతో కూకట్ పల్లి, శేరిలింగంపల్లి స్థానాలను ఎట్టిపరిస్థిలో జనసేనకు ఇవ్వొద్దంటూ ఆందోళనలు మిన్నంటాయి. నాంపల్లి బీజేపీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. శేరిలింగంపల్లి టికెట్ ను రవి యాదవ్ కే ఇవ్వాలని చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పట్టబట్టుతున్నారు. రవియాదవ్ అభ్యర్థిత్వానికి నిజామాబాద్ ఎంపీ అర్వింద్ కూడా మద్దతు పలుకున్నట్టు సమాచారం. మెదక్ జిల్లా నర్సాపూర్ టికెట్ ను మార్చాలని గోపికి కేటాయించాలని కార్యకర్తలు పార్టీ ఆఫీసు వద్ద ఆందోళనకు దిగారు. మురళీయాదవ్ భూకబ్జాదారుడని వారు ఆరోపించారు. 
వేముల వాడ టికెట్ బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి తొలనొప్పిగా మారింది. కరీంనగర్ జెడ్పీ మాజీ చైర్ పర్సన్ తుల ఉమ ఈ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఈటలతోపాటు బీజేపీలో చేరిన ఆమె తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. తాను పార్టీలో చేరిందే వేములవాడ టికెట్ కోసమని ఉమ చెబుతున్నారు. ఇదే సీటుపై మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు కుమారుడు వికాస్ రావు గురి పెట్టారు.  


పోటీ చేయడానికి కొంత మంది సీనియర్ల వెనుకంజ 


ఓ వైపు పోటీ చేయడానికి కొంత మంది పోటీ పడుతూంటే.. కొంత మంది సీనియర్లు మాత్రం టిక్కెట్ ఇస్తామన్నా వద్దంటున్నారు.  మల్కాజ్ గిరి నుంచి పోటీ చేయాలని మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావును పార్టీ అధినాయకత్వం కోరుతోంది. కానీ ఆయన పోటీకి విముఖత వ్యక్తం చేస్తున్నారు. 2018లో ఇక్కడి నుంచి ఆయన పోటీ చేయగా 40,451 ఓట్లు వచ్చాయి. రాంచందర్ రావు సెకండ్ ప్లేస్ లో నిలిచారు. ఇక్కడి నుంచి ఆయనను బరిలోకి దింపితే విజయం సునాయసమని పార్టీ అధినాయకత్వం భావిస్తున్నా.. పోటీకి రాంచందర్ రావు సిద్ధంగా లేరని సమాచారం. మరికొంత మంది సీనియర్ల వెనుకంజ వేస్తున్నారు. దీంతో వారిని ఒప్పించడానికి  ఓ వైపు ప్రయత్నించాల్సి వస్తోంది.


నామినేషన్లు ప్రారంభమైన తర్వాత కూడా కసరత్తు తప్పదు !  


తెలంగాణ ఎన్నికలకు సంబంధించి మూడో తేదీన నోటిఫికేషన్ వస్తుంది. ఆ రోజు నుంచే  నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్ల దాఖలు గడువు పదో తేదీ వరకూ ఉంటుంది. ప్రస్తుత పరిస్థితి చూస్తూంటే చివరి రోజూ  వరకూ కొన్ని సీట్లలో బీజేపీ అగ్రనేతలు హైరానా పడక తప్పదన్న  అభిప్రాయం వినిపిస్తోంది.