Telangana Elections 2023 :   భారత రాష్ట్ర సమితి ఎంపీ, దుబ్బాక నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై రాజు అనే వ్యక్తి కత్తితో దాడి చేయడం సంచలనంగా మారింది. మొదట కారులో గజ్వేల్ ఆస్పత్రికి ఆ తర్వాత సికింద్రాబాద్ యశోదాకు తరలించారు. దాడి చేసిన వ్యక్తి కాంగ్రెస్ నుంచి బీజేపీకి వెళ్లిన వ్యక్తి అని మంత్రి మల్లారెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్ కండువా వేసుకున్న ఫోటోను  ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్ రేవంత్ రెడ్డిపై ఆరోపణలు చేశారు. కానీ ఆ ఫోటోలో ఉన్నది దాడి చేసిన వ్యక్తి కాదని..  తానేననిఓ వ్యక్తి మీడియాకు  మొరపెట్టుకున్నారు. మంత్రి హరీష్ రావు రాజకీయ కుట్ర ఉందన్నారు. సీఎం కేసీఆర్ మరింత ముందుకు వెళ్లి తమను ఎదుర్కోలేక దాడులు చేస్తున్నరని.. ప్రజలంతా  తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ నేతల స్పందనతో ఇది రాజకీయం అయిపోయింది. 


నక్సల్స్ ప్రభావం తగ్గాక హింస లేని ఎన్నికలు 


తెలంగాణలో నక్సలిజం ప్రభావం తగ్గిన తర్వాత సమస్యాత్మక నియోజకవర్గాలు తగ్గిపోయాయి. అటవీ ప్రాంతంలో ఉండే నియోజకవర్గాల్లో త్వరగా పోలింగ్ ముగిస్తున్నారు కానీ.. భారీ- బలగాల మధ్య రెండో విడత పోలింగ్ పెట్టాల్సిన పరిస్థితి కనిపించడం లేదు. అలాగే ఫ్యాక్షన్ ప్రభావిత నియోజకవర్గాలు లేదా.. రాజకీయ హత్యలు చేసుకునే నియోజకవర్గాలు కూడా లేవు. అంటే తెలంగామ ప్రశాంతమైన రాష్ట్రం. ఎన్నికలు చెదురుమదురు ఘటనలు తప్ప ప్రశాంతంగా జరిగిపోయే రాష్ట్రం. ఎన్నికల ప్రచారంలో గతంలో రాజకీయ ప్రత్యర్థులు దాడులు చేసుకున్న సందర్భాలు కూడా తక్కువే. అయితే హఠాత్తుగా ఇప్పుడు ఓ అభ్యర్థిపై కత్తితో  దాడి చేయడం సంచలనంగా మారింది. ఆ వెంటనే  బీఆర్ఎస్ రాజకీయ ఆరోపణలు చేయడంతో రాజకీయం అయిపోయింది. 


పూర్తి  వివరాలు చెప్పని పోలీసులు 


ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పై దాడి విషయంలో పోలీసులు నిందితుడి ఉద్దేశం ఏమిటో చెప్పలేదు. కానీ దాడి తర్వాత ఆ వ్యక్తిని  ఎంపీ అనుచరులు తీవ్రంగా కొట్టడంతో ప్రాణాపాయ స్థితిలో పడ్డాయి. అతన్ని కూడా ఆస్పత్రికి తరలించారు. ఆ వ్యక్తి  బ్యాక్ గ్రౌండ్ ను పోలీసులు పరిశీలించారు. పాత కేసుల గురించి స్పష్టత లేదు. కానీ తొమ్మిది మీడియా సంస్థల నుంచి పొందిన ఐడీ కార్డులు ఉన్నాయని చెబుతున్నారు. అలాగే మీడియా ప్రతినిధి పేరుతో రాజకీయ నాయకులతో దగ్గరకు వెళ్లి దిగిన ఫోటోలు ఉన్నాయి.  బీజేపీ నేతలతో దిగిన ఫోటోలు ఉన్నాయి. కాంగ్రెస్ నేత వీహెచ్‌తో దిగిన ఫోటోలు ఉన్నాయని  చెబుతున్నారు. అతను ఫలానా పార్టీకి చెందిన వాడని కానీ.. కుట్రతో చేశారని కానీపోలీసులు ఇంకా ఎలాంటి వివరాలు ప్రకటించలేదు. 


బీజేపీ, కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ వరుస విమర్శలు 


అయితే కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి ఘటన జరిగిన వెంటనే బీఆర్ఎస్ నేతలు రాజకీయ పరమైన ఆరోపణలు  చేశారు. ఇది ఎన్నికల సీజన్ కాబట్టి అది సహజమేనని అనుకుంటున్నారు. దుబ్బాక నుంచి బీజేపీ తరపున పోటీ చేస్తున్న రఘునందన్ రావు తనపై కొంత మంది విమర్శలు  చేయడంపై మండిపడ్డారు. పోలీసులు నిష్ఫాక్షిక విచారణ చేయాలన్నారు. బట్ట కాల్చి మీద వేస్తున్నారని  మండిపడ్డారు. అదే సమయంలో కేటీఆర్ కాంగ్రెస్ కండువాతో ఉన్న ఫోటోను చూపించి  రేవంత్ రెడ్డిపై చేసిన ఆరోపణల్ని .. ఆ ఫోటోలో వ్యక్తి ఖండించాడు. దాడి చేసిన వ్యక్తి కేటీఆర్ చూపించిన వ్యక్తి వేర్వేరని ఆ వ్యక్తి  వీడియో  రిలీజ్ చేశారు. 


 





 


సీఎం జగన్‌పై కోడికత్తితో దాడి ఘటనను గుర్తు చేసిందన్న సోషల్ మీడియా


ఈ దాడి ఘటన,  అనంతరం జరిగిన పరిణామాలు, రాజకీయాలు ఏపీలో 2019  ఎన్నికలకు ముందు  అప్పటి ప్రతిపక్ష నేత జగన్‌పై విశాఖ విమానాశ్రయంలో కోడికత్తితో  జరిగిన దాడి కేసు జ్ఞప్తికి తెస్తుందని సోషల్ మీడియాలో ఎక్కువ  మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జగన్ పై దాడి ఘటనలో నిజాలేమిటో కోర్టులో ఇంకా తేలలేదు. నిందితుడు ఇంకా జైల్లో ఉన్నాడు. కానీ కుట్ర లేదని ఎన్ఐఏ కోర్టుకు తెలిపింది. అయితే లోతైన విచారణ కావాలని సీఎం జగన్ హైకోర్టుకు వెళ్లారు. ప్రస్తుతానికి కింది కోర్టులో దీనిపై విచారణ ఆగింది. అయితే ఈ ఘటనపై దాడి  జరిగినప్పటి నుండి ఇప్పటి  వరకూ రాజకీయం జరుగుతూనే  ఉంది. ఇది వైఎస్ జగన్ పై అప్పటి అధికారపక్షం అయిన టీడీపీ చేసిన హత్యాయత్నమని వైసీపీ.. సానుభూతి కోసం ఐ ప్యాక్ తో కలిసి జగన్ మోహన్ రెడ్డి ఆడిన నాటకం అని వైసీపీ ఆరోపణలు చేసుకుంటూనే ఉన్నాయి. ఎ పార్టీ సానుభూతిపరులు ఆయా పార్టీల వాదన నిజమని నమ్ముతున్నారు. కోర్టుల్లో  మాత్రం తేలడంలేదు.