1969 నుంచి 2014 వరకు తొలి, మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఆద్యంతం ఊపిరినిపోసింది..పాట. ఆట-పాటలేని తెలంగాణ ఉద్యమాన్ని ఊహించలేము. దిల్లీ స్థాయిలో తెలంగాణ వాదాన్ని రాజకీయ పార్టీలు వినిపిస్తుంటే.. గల్లీల్లో , అక్షరం ముక్క తెల్వని అవ్వ, తాతలకు కూడా తెలంగాణ అవసరాన్ని అర్థం చేసుకునేలా చేసింది..ఈ పాట. ఓ పెద్దమనిషి అన్నాడు.. తెలంగాణలో ఉద్యమం ఉత్సవం ఒకేసారి జరుగుతోంది. తెలంగాణ సాంస్కృతిక ఉత్సవం జరుగుందని చెప్పారు. అది నిజమే. ఆ జానపదంలో అంత పవర్ ఉండబట్టే... ప్రతి వాడిని కదిలించింది.. జై కొట్టు తెలంగాణ అనిపించింది. అలా.. ఉద్యమానికి ఊపిరిలు ఊదిన మెయిన్ సాంగ్స్ ఏంటో చూద్దాం..!


గద్దర్ గర్జన 


ఫస్ట్ చెప్పుకోవాల్సింది గద్దర్ గురించి..! విప్లవ గీతాలతో తెలంగాణను అనునిత్యం చైతన్యనపరుస్తునే ఉన్నారు. ఐతే..మలిదశ ఉద్యమంలో ఈయన నుంచి జాలు వారిన రెండు పాటలు ఉద్యమాన్ని ఊర్రూతలు ఊగించింది. అందులో ఫస్ట్..అమ్మా తెలంగాణమా.. ఆకలి కేకలగానమా అంటూ... ఈ గడ్డ పడుతున్న బాధను యావత్ ప్రపంచానికి చాటి చెప్పారు.


ఇక రెండవది..


జై తెలంగాణ మూవీలో పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా అంటూ ఊరువాడను ఏకం చేశారు. కాక మీదున్న ఆగ్నికి వాయువు తోడైనట్లు..ఉద్యమకారులకు  పాట తోడై.. ఉవ్వెత్తున ఎగిసిపడింది..ఉద్యమం. నెక్ట్స్ గొరోటి వెంకన్న..! ఈ జనరేషన్ మెచ్చిన  గొప్ప వాగ్గేయకారుడు. కాలికి గజ్జెకట్టి..ఊరువాడ తిరిగుతూ తెలంగాణ వాదాన్ని గొంతెత్తిన మట్టిమనిషి ఆయన. ఆయన రాసిన పాటలన్నీ అద్భుతం. అందులో కొన్ని ఇప్పుడు చూద్దాం. ఫస్ట్.. పల్లె కన్నీరు పెడుతుందో అంటూ తెలంగాణ పల్లె గోసను వినిపించారు..


జిల్లెలమ్మ జిట్ట.. సూపర్‌ హిట్


ఏ ఆఫీసు మెట్లెక్కిన జిల్లెలమ్మ జిట్ట..వారు ఎదురుంగానే కూసుంటారు జిల్లెలమ్మ జిట్ట అంటూ... తెలంగాణ ఉద్యోగాలు ఆంధ్రోళ్లు ఎట్ల కొల్లగోడుతున్నారో చూపించారు. ఇక..గూడ అంజయ్య రాసిన పాట... రసమయి బాల కిషన్ నోట పడి.. ఉద్యమాన్ని ఎరుపెక్కించింది ఓ పాట. అదే....! ఓరి రాజిగా ఎత్తురా తెలంగాణ జెండా అంటూ రసమయి బాలకిషన్ ఊరూరా..ధూం ధాం కార్యక్రమాలు నిర్వహించారు. కొంతమంది కళాకారుల్ని వెంటపెట్టుకుని ఊర్లోకి పోయి..సాయంత్రం పూట పాటల రూపంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర అవశ్యకతను తెలపడంలో రసమయి కీలక పాత్ర పోషించారు..


విద్యార్థి శక్తి వివరించే పాట


అభినయ్ శ్రీనివాస్ ఓ చక్కని పాట రాశాని. ఉస్మానియా క్యాంపస్.. ఉద్యమానికి వెన్నుదన్నుగా ఎలా నిలిచింది. ఉద్యమంలో విద్యార్థిశక్తి ఏంటో ఒక్క పాట ద్వారా నిరూపించారు. ఉస్మానియా క్యాంపస్ లో ఉదయించిన కిరణమా అంటూ.. ఉద్యమాన్ని ముందుకు కదిలించారు.. ఇక ప్రత్యేక తెలంగాణ కోసం అసువులు బాసిన వారికోసం దరువు ఎల్లన్న రాసిన వీరులారా వందనం విద్యార్థి... అమరులరా వందనం అతిపెద్ద నివాళిగా చెప్పొచ్చు.. ప్రముఖ రచయిత నందిని సిద్దా రెడ్డి రాసిన నాగేటి సాల్లాల నా తెలంగాణ  పాట... తెలంగాణ సంస్కృతి గొప్పదనాన్ని తెలియజేశారు..


అందే శ్రీ రాసిన తెలంగాణ గీతం


జయ,జయ జయహే తెలంగాణ అంటూ  అందే శ్రీ రాసిండు ఓపాట. తెలంగాణం మెుత్తం ఉంటుంది ఆ పాటలో. అందుకే దానిని తెలంగాణ రాష్ట్ర గేయంగా గుర్తించారు.. పల్లె పల్లెనా పల్లెర్లు మెలిశాయి నా పాలమూరులోనా అంటూ కూర దేవేందర్ రాసిన పాట... నాటి పల్లె దీనస్థితిని వివరించింది. జయరాజ్ రాసిన వానమ్మా వానమ్మ... తెలంగాణ నీటి గోసను కళ్లకు కడుతుంది. గోదావరి , కృష్ణజలాలు రావు. బోరు బావులు ఎండిపోతాయి. ఇక వ్యవసాయం అంటే వానా రావాల్సిందే. అలా..తెలంగాణ రైతు పడే కష్టం వివరించారు.


కంటనీరు పెట్టించిన మిట్టపల్లి సురేందర్


తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు బలిదానాలు తీసుకుంటుంటే..ఆ బిడ్డల్ని కన్న తల్లులు పడే బాధను మిట్టపల్లి సురేందర్ అద్భుతంగా రచించారు. రాతిబొమ్మల్లోనా కొలువైనా శివుడా అంటూ బిడ్డలు కోల్పోయిన తల్లులకు కన్నీరు తెప్పించారు. ఉద్యమ నేత కేసీఆర్ కూడా పలు పాటలు రాశారు. చూడు చూడు నల్గగొండ.. గుండె నిండా ఫ్లోరైడ్ బండాయయయ అంటూ ఉమ్మడి నల్గొండ జిల్లా నీటి కష్టాలను ప్రస్తావించారు. జై బోలో తెలంగాణలో కూడా ఒకటి రెండు పాటలు కూడా రాశారు.


వీళ్లు రచనలు చేస్తే.. దానిని గొంతెత్తి పాడి ఉద్యమాన్ని జనాల్లోకి తీసుకెళ్లారు..గాయకులు. అందులో ఓ సాయి చంద్, నేర్నాల కిషోర్, అంతడప్పుల నాగరాజు, మధుప్రియా, తేలు విజయ, పల్లె నర్సింహ్మా, నిస్సార్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో. ఇప్పుడు చెప్పుకున్నవి కొన్నే. ఉద్యమంలో ఒకసారి తొంగిచూస్తే.. ఇలాంటి వేల పాటలు కనిపిస్తాయి. ఉద్యమాలు సాధారణంగా మేధావి వర్గం, చదువుకున్న వారు, ఉద్యోగులు, విద్యార్థులు ఇలా కొన్ని వర్గాలకే పరిమిత అవుతుంటాయి. కానీ , తెలంగాణ ఉద్యమం మాత్రం పసిపిల్లాడి దగ్గరి నుంచి ముసలోడి వరకు.. మేధావుల దగ్గరి నుంచి వేలి ముద్ర వరకు వెళ్లిదంటే దానికి కారణం.. ఈ పాటలే అనడంలో ఎలాంటి సందేహం లేదు.