3D Printed Temple: ప్రపంచంలోనే తొలిసారిగా 3D ప్రింటెడ్ విధానంలో ఆలయం నిర్మితమవుతోంది. హైదరాబాద్ కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ అప్సుజా ఇన్‌ఫ్రాటెక్ ఈ పనులు చేపట్టింది. సిద్దిపేటలోని చర్విత మెడోస్‌లో ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు. దాదాపు 30 అడుగుల ఎత్తులో 3,800 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు. సింప్లిఫోర్జ్ క్రియేషన్స్ తో కలిసి అప్సుజా ఇన్‌ఫ్రాటెక్ సంస్థ ఈ ఆలయాన్ని నిర్మిస్తోంది. ఇందుకు సంబంధించిన నమూనాలను తాజాగా విడుదల చేశారు.


మూడు గర్భాలయాలు కలిగిన టెంపుల్


ఈ ఆలయంలో మొత్తం మూడు గర్భాలయాలు ఉంటాయి. మోదక్ ఆకారంలో ఉండే గర్భాలయంలో గణేశుడు, దీర్ఘచతురస్రాకార గర్భాలయంలో శివుడు, కమలం ఆకారంలోని గర్భాలయాన్ని పార్వతి దేవి కోసం నిర్మిస్తున్నారు.  సింప్లిఫోర్ట్ క్రియేషన్స్ సంస్థ అంతర్గతంగా అభివృద్ధి చేసిన సిస్టమ్, దేశీయంగా అభివృద్ధి చేసిన మెటీరియల్, సాఫ్ట్ వేర్ తో ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ప్రపంచంలోనే ఇంత భారీ స్థాయిలో ఓ ప్రార్థనా మందిరాన్ని 3D ప్రింటెడ్ గా నిర్మితం కానుండి తొలిసారి. 


సిద్దిపేటలోని చర్విత మెడోస్ లో త్రీడీ ముద్రిత ఆలయం


సిద్దిపేట జిల్లా బూరుగుపల్లిలోని గేటెడ్ విల్లా కమ్యూనిటీ అయిన చర్విత మెడోస్ లో ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు. గతంలో చర్విత మెడోస్ లో భారత దేశపు మొట్టమొదటి త్రీడీ ప్రింటెడ్ బ్రిడ్జ్ ప్రోటోటైప్ ను కూడా ఆవిష్కరించారు. ఆ తర్వాత ఇప్పుడు ఈ త్రీడీ ప్రింటెడ్ ఆలయ ప్రాజెక్టు అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు తీసుకురానుంది. ఈ ఆలయ నిర్మాణం సింప్లిఫోర్జ్ అభివృద్ధి చేసిన రోబోటిక్ ఆర్మ్ సిస్టమ్ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పనుంది. 


సవాళ్లతో కూడిన ఆలయ నిర్మాణం


త్రీడీ ప్రింటెడ్ ఆలయ నిర్మాణంలో నిర్మాణ బృందానికి చాలానే సవాళ్లు ఎదురయ్యాయి. అద్భుతమైన నిర్మాణ శైలి, గోపురాల నిర్మాణంలో త్రీడీ ప్రింటెడ్ పద్ధతిలో పలు సవాళ్లు ఉన్నప్పటికీ.. ప్రత్యేకమైన డిజైన్ పద్ధతులు, కచ్చితమైన అధ్యయనంతో వాటిని అధిగమించినట్లు అప్సుజా ఇన్‌ఫ్రాటెక్ ఎండీ హరికృష్ణ జీడిపల్లి తెలిపారు. శివాలయం, మోదక్ నిర్మాణం పూర్తయ్యాయని, కమలం రూపంలోని గర్భాలయంతో పాటు పొడవైన గోపురాలతో కూడిన రెండో దశ పనులు ప్రస్తుతం నడుస్తున్నట్లు ఆయన వెల్లడించారు. 


గతంలో 2 గంటల్లోనే బ్రిడ్జి కట్టిన సింప్లిఫోర్జ్


ఈ ఏడాది మార్చిలో ఐఐటీ హైదరాబాద్ సహకారంతో సింప్లిఫోర్జ్ క్రియేషన్స్ సంస్థ 3డి ప్రింటెడ్ బ్రిడ్జిని నిర్మించింది. కేవలం 2 గంటల వ్యవధిలో బ్రిడ్జ్ ఆఫ్-సైట్ ప్రింట్ చేసి సిద్దిపేటలోని చర్విత మెడోస్ లో అసెంబుల్ చేశారు. దీనిని ఐఐటీ హైదరాబాద్ సివిల్ ఇంజినీరింగ్ విభాగ ప్రొఫెసర్ కెవిఎల్ సుబ్రహ్మణ్యంతో కలిసి ఈ ఘనత సాధించారు. ఫారమ్ ఆప్టిమైజేషన్ ను అనుసరించి ఈ బ్రిడ్జ్ ను నిర్మించారు. మెటీరియల్ ఫాలోస్ ఫోర్స్ అనే పద్ధతిని వాడారు. ఇందుకోసం ఎక్స్‌ట్రూషన్ సాఫ్ట్ వేర్ సిస్టమ్ ను అభివృద్ధి చేసింది సింప్లిఫోర్జ్. ఇండస్ట్రీయల్ రోబోటిక్ ఆర్మ్ 3డి ప్రింటర్ ను ఉపయోగించి ఈ బ్రిడ్జిని నిర్మించారు. ఈ విధానంలో నిర్మాణాలను తక్కువ వ్యవధిలో పూర్తి చేయవచ్చని అప్పడు ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం తెలిపారు.ఈ టెక్నాలజీ నిర్మాణ రంగంలో అనూహ్య మార్పులు తీసుకొస్తుందన్నారు.