Revanth Reddy Meets Jana Reddy: వచ్చే సాధారణ ఎన్నికల్లో తాను నల్గొండ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి సిద్ధమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానా రెడ్డి వెల్లడించారు. పార్టీ ఆదేశిస్తే తాను పోటీ చేస్తానని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 15 ఏళ్లు మంత్రిగా ఉన్నానని గుర్తు చేసుకున్నారు. తన కుమారుడు జైవీర్‌కు పదవి ఇవ్వాలని అడగలేదని అన్నారు. ప్రస్తుతం జైవీర్ ఎమ్మెల్యేగా ఉన్నాడని.. ఆయన ఇంకా జూనియర్‌ కాబట్టి.. ఇప్పుడే పదవులు అడగలేమని చెప్పారు. ఈ సమయంలో తన కుమారుడికి పదవులు ఇవ్వడం కూడా సమంజసం కాదని జానారెడ్డి అభిప్రాయపడ్డారు. సోమవారం (డిసెంబర్ 11) కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి కె.జానా రెడ్డిని సీఎం రేవంత్‌ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం రేవంత్ రెడ్డిని జానా రెడ్డి శాలువాతో సత్కరించారు. దాదాపు గంటసేపు వీరిద్దరూ వివిధ అంశాలపై చర్చించుకున్నారు. ఆ తర్వాత మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కూడా జానా రెడ్డి ఇంటికి వెళ్లి కలిశారు. 


రేవంత్ రెడ్డి కలిసిన తర్వాత జానా రెడ్డి మీడియాతో మాట్లాడారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి అందరూ సహకరించాలని కోరారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చి ప్రజాభిమానం సొంతం చేసుకోవాలని సీఎం రేవంత్‌ రెడ్డికి తాను సూచించానని చెప్పారు. సీఎం, మంత్రులు ఐకమత్యంతో పని చేయాలని వారికి సూచించినట్లు వివరించారు. మాజీ సీఎం కేసీఆర్‌కు గాయం కావడం బాధాకరం అని.. తాను ఆయన్ను పరామర్శించానని చెప్పారు. కేసీఆర్‌ త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు. ప్రతిపక్ష నాయకుడిగా ఆయన తన సూచనలు ఇవ్వాలని అన్నారు.