గాంధీభవన్ లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా జాతీయ జెండాను వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఎగరవేశారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డితో పాటు పార్టీ సీనియర్ నేత వీహెచ్ హుషారుగా పాల్గొన్నారు. ఉత్సాహంతో స్టెప్పులు వేస్తూ, డప్పు వాయిస్తూ వీహెచ్ కనిపించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ఇంచార్జి మానిక్కమ్ ఠాగూర్, ఏఐసీసీ కార్యదర్శులు బోసు రాజు, శ్రీనివాస్ కృష్ణన్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి, వర్కింగ్ ప్రసిడెంట్స్ మహేష్ కుమార్ గౌడ్,  గీతారెడ్డి, అంజన్ కుమార్  యాదవ్, మహేశ్వర్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, వీహెచ్ తదితరులు పాల్గొన్నారు.



అన్నదాతల ఆత్మహత్యలు లేని.. బిడ్డలకు ఉద్యోగ, ఉపాధికి కొదువలేని.. నిరుద్యోగుల ఆత్మబలిదానాలు లేని.. సోనియమ్మ కలలుగన్న సామాజిక తెలంగాణ ఏర్పాడాలన్నదే నా స్వప్నం. స్వరాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు’’ అని టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్ పర్సన్ మధు యాస్కి గౌడ్ ట్వీట్ చేశారు.


టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ రాష్ట్రం పొందిన రోజు ఘనంగా జరుపుకుంటున్నాం. సోనియాగాంధీ మనకు ఇచ్చిన కానుక తెలంగాణ రాష్ట్రం. ఇందిరాగాంధీ చేయలేని సాహసం సోనియా గాంధీ చేశారు. సాధించుకున్న తెలంగాణ ఇదా? సోనియాగాంధీ కోరుకున్న తెలంగాణ బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీలు మహిళలు బంగారు మయం అవుతుందని భావించారు. కేసీఆర్ కుటుంబం ఆయన తెబేరిదారులు ఎమ్మెల్యేలు ఎంపీలు బంగారం అయ్యారు. 1200 మంది బలిదానాలు చేసుకున్నారు. 400 మందికి మాత్రమే సహాయం చేసారు. మీ కేబినెట్ లో అందరు తెలంగాణ ద్రోహులే. 


తెలంగాణ 4 లక్షల కోట్ల అప్పులో కూరుకుపోయింది. స్వాతంత్ర్య ఉద్యమంలో బీజేపీ పాత్ర లేదు. తెలంగాణపై కూడా అంతగా లేదు. తల్లిని చంపి బిడ్డను బతికించారని మోదీ పార్లమెంట్ అన్నారు. బలహీన వర్గాల తెలంగాణను తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. గడిలో బంది అయిన తెలంగాణను విడిపించుకుందాం. రానున్న రోజుల్లో అధికార మార్పిడి తప్పదు.’’ అని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.


అమెరికా పర్యటనలో రేవంత్ రెడ్డి
ఇక రేవంత్ రెడ్డి ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లిన నేపథ్యంలో ఆయన ఈ వేడుకలకు హాజరు కాలేదు. ట్విటర్‌లో ఓ వీడియోను విడుదల చేశారు. తెలంగాణ ప్రజలకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ వల్లనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైందని అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు గానూ రాజకీయంగా ఎంత నష్టం ఎదురైనా వెనకాడకుండా ఆ నాడు సోనియా గాంధీ రాష్ట్ర ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. రాష్ట్రం ఏర్పడి 8 సంవత్సరాలు పూర్తయిందని అన్నారు. అయినా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రజలు ఎంతగానో నష్టపోతున్నారని అన్నారు. రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రభుత్వం నుంచి వీరికి ఎలాంటి సాయం అందడం లేదని అన్నారు. కేసీఆర్ పైన ఎలాంటి విశ్వాసం పెట్టుకొని ప్రజలు అవకాశం ఇచ్చారో అది నిలబెట్టుకోవడం లేదని అన్నారు. ఈ రాష్ట్రానికి కేసీఆర్ పాలన అవసరమా అని ప్రశ్నించారు. గులాబీ తెగులు వదిలించాలని పిలుపునిచ్చారు.