KCR Speech in Telangana Formation Day 2022 కేంద్ర ప్రభుత్వం నియంతలా వ్యవహరిస్తోందని, నిరంకుశ పోకడలు మరింతగా పెరిగిపోయాయని ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శలు చేశారు. నేడు (జూన్ 2) తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లోని పబ్లిక్ గార్డెన్స్‌లో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా వేడుకలు నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించి వేడుకలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఇందులో ఈ 8 ఏళ్లలో తెలంగాణ ప్రభుత్వం సాధించిన ప్రగతి వివరాలతో పాటు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంపై వ్యవహరిస్తున్న తీరుపైన మాట్లాడారు.
‘‘75 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం తర్వాత దేశంలో ప్రజాస్వామ్యం పరిణతిని పొంది అధికారాల వికేంద్రీకరణ జరగకపోగా, నిరంకుశ పోకడలు పెరిగి అధికారాలు మరింత కేంద్రీకృతమవుతున్నాయి. దేశాన్ని పాలించిన అన్ని ప్రభుత్వాలూ రాష్ట్ర జాబితాలోని వివిధ అంశాలను క్రమంగా ఉమ్మడి జాబితాలోకి లాగేసుకున్నాయి. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ‘‘బలమైన కేంద్రం - బలహీనమైన రాష్ట్రాలు’’ అనే కుట్రపూరితమైన, పనికిమాలిన సిద్ధాంతాన్ని ప్రాతిపదికగా చేసుకొంది. అందుకే ఈ ప్రభుత్వ హయాంలో రాష్ట్రాల హక్కుల హననం పరాకాష్ఠకు చేరుకుంది.
కూర్చున్న కొమ్మను నరుక్కుంటోంది
కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఆర్ధికంగా బలహీనపరిచే కుతంత్రాలకు పాల్పడుతున్నది. కేంద్రం విధించే పన్నుల నుంచి రాజ్యాంగ విహితంగా రాష్ట్రాలకు రావల్సిన వాటాను ఎగ్గొట్టేందుకు ప్రస్తుత కేంద్రప్రభుత్వం పన్నులను సెస్సుల రూపంలోకి మార్చి వసూలు చేస్తుంది. రాష్ట్రాల వాటాగా రావాల్సిన లక్షలాది కోట్ల రూపాయలను కేంద్రం నిస్సిగ్గుగా హరిస్తున్న విషయం తెలిసిందే
ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తున్న తెలంగాణ వంటి రాష్ట్రాలకు కేంద్రం వైఖరి గుదిబండలా తయారయింది. కేంద్రం వెంటనే పునరాలోచించాలని రాష్ట్రాలపై విధిస్తున్న ఆర్థిక ఆంక్షలను వెంటనే ఎత్తివేయాలని, రాష్ట్రాల హక్కుల హననాన్ని ఇకనుంచైనా మానుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను.’’ అని కేసీఆర్ డిమాండ్ చేశారు.
ఐటీ ఎగుమతుల్లో అగ్రగామి తెలంగాణ
అతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ అగ్రగామిగా నిలిచింది. పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేయడానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన టి.ఎస్. ఐపాస్ చట్టం, నిరంతర విద్యుత్తు, నీటి సరఫరా, శాంతిభద్రతలు, సుస్థిర ప్రభుత్వం, పారిశ్రామికవేత్తలకు అందిస్తున్న ప్రోత్సాహంతో పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. పారిశ్రామిక రంగంలో ఈ 8 ఏళ్ళలో మొత్తం 2 లక్షల 32 వేల 111 కోట్ల రూపాయల పెట్టుబడులు తరలివచ్చాయి. 16 లక్షల 48 వేల 956 ఉద్యోగాల కల్పన జరిగింది.
ఐటీ రంగంలో తెలంగాణ ముందుకు దూసుకుపోతోంది. 1500 కు పైగా పెద్ద, చిన్న ఐ.టి పరిశ్రమలు నేడు హైదరాబాద్ లో కొలువై ఉన్నాయి. ప్రపంచ దిగ్గజాలైన మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్, ఐ.బి.ఎం, కాగ్నిజెంట్, అమేజాన్, ఒరాకిల్ వంటి అనేక సంస్థలు హైదరాబాద్ నుంచి తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. తెలంగాణ ఐ.టిరంగ ఎగుమతుల విలువ 1 లక్షా 83 వేల 569 కోట్ల రూపాయలు కావడం గమనార్హం. ఐ.టి రంగంలో మనం సాధించిన అభివృద్ధి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. ఈ ఎనిమిదేళ్ళలో ఐటి రంగంలో నూతనంగా 7 లక్షల 78 వేల 121 ఉద్యోగాల కల్పన జరిగింది. పారిశ్రామిక, ఐటీ రంగాలలో కలిపి 24 లక్షలకు పైగా ఉద్యోగాల కల్పన జరిగింది.’’ అని కేసీఆర్ ప్రసంగించారు.