ఆత్మకూరు ఉప ఎన్నికల్లో నామినేషన్లు ఆన్ లైన్ లో స్వీకరించేందుకు అనుమతి ఇస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. దీంతోపాటు ఓటింగ్ విషయంలో కూడా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు అధికారులు. పోస్టల్ బ్యాలెట్ ని ఇంటి వద్దకే పంపించబోతున్నారు. వృద్ధులు, వికలాంగులు, కరోనా బాధితులకోసం ఈ ఏర్పాటు చేస్తున్నారు. ఓటర్ల ఇంటికే అధికారుల బృందం వచ్చి బ్యాలెట్‌ ఇచ్చి... ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేలా సహకరించాలని సూచిస్తుంది. అయితే ఈ ఉప ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ కోసం ముందుగా ఓటర్లు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 


ఈనెల 3లోగా దరఖాస్తు
పోస్టల్‌ బ్యాలెట్ హక్కును సద్వినియోగం చేసుకునే వారు ఈనె 3లోపు స్థానిక బూత్ లెవల్ ఆఫీసర్ (BLO) లకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. BLOలు ఇలా తమకు వచ్చిన దరఖాస్తుల వివరాలను తహశీల్దారుకి తెలియజేయాల్సి ఉంటుంది. పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం 12డి ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సమాచారం BLOల ద్వారా సేకరించి ఉన్నతాధికారులకు తహశీల్దార్లు నివేదించాల్సి ఉంటుంది. 


ఎవరెవరికి..?
ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి జూన్‌ 23న ఉపఎన్నికలు జరుగుతాయి. దీనికోసం పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే వారికి ప్రత్యేక నియమావళిని ఎన్నికల సంఘం విడుదల చేసింది. ప్రస్తుతం కొత్తగా విడుదలైన ఓటర్ల జాబితా ప్రకారం 80ఏళ్లు నిండిన వృద్ధులకు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ వైద్యాధికారి జారీ చేసిన హ్యాండిక్యాప్డ్ సర్టిఫికెట్, లేదా పింఛన్‌ సర్టిఫికెట్, ఓటర్ల జాబితాలో వికలాంగులుగా నమోదు చేసుకున్న వారంతా పోస్టల్ బ్యాలెట్ కి అర్హులు. పోలింగ్‌ సమయంలో కొవిడ్‌-19 కారణంగా ఆసుపత్రిలో లేదా ఐసోలేషన్‌ లో ఉన్న ఓటర్లకు కూడా పోస్టల్ బ్యాలెట్ ఇస్తారు. 


ఓటు ఎలా వేయాలి.. 
మామూలుగా ఎన్నికల విధుల్లో ఉండే ఉద్యోగులకు కూడా పోస్టల్ బ్యాలెట్ ఇస్తారు. సాధారణ ఎన్నికల తేదీకంటే ముందే పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు అలా కాదు.. పోస్టల్ బ్యాలెట్ ని కూడా ఎన్నికల రోజే అర్హులకు ఇస్తారు. పోలింగ్‌ అధికారి, ఇతర ప్రత్యేక బృందం, పోలీసు రక్షణలో పోస్టల్‌ బ్యాలెట్‌ను ఓటరుకు ఇంటి వద్దకు తీసుకెళ్లి ఇస్తారు. అక్కడే పోస్టల్ బ్యాలెట్ పై వారు తమ ఓటు ముద్ర వేయాల్సి ఉంటుంది. ఆ తరవాత ఆ పోస్టల్‌ బ్యాలెట్‌ ను అధికారి తీసుకుని రశీదు ఇస్తారు. ఈ తతంగాన్నంతా వీడియో తీయాల్సి ఉంటుంది. ఆ తర్వాత పోస్టల్ బ్యాలెట్లను కూడా సాధారణ ఈవీఎం లతో కలిపి భద్రపరుస్తారు. ఓట్ల లెక్కింపు రోజు వాటిని తీస్తారు.