ఆత్మకూరు ఉప ఎన్నికల్లో అసలైన కోలాహలం గురువారం నుంచి మొదలు కాబోతోంది. మేకపాటి విక్రమ్ రెడ్డి అధికార పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసేందుకు రెడీ అవుతున్నారు. సీఎం జగన్ స్వయంగా విక్రమ్ రెడ్డికి బీ ఫామ్ ఇచ్చి ఆల్ ది బెస్ట్ చెప్పారు. తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో విక్రమ్ రెడ్డికి సీఎం బీ ఫామ్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా మంత్రి   కాకాణి గోవర్ధన్ రెడ్డి, మరో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. 




అట్టహాసంగా ఏర్పాట్లు.. 
మేకపాటి విక్రమ్ రెడ్డి నామినేషన్ ఏర్పాట్లు అట్టహాసంగా జరుగుతున్నాయి. జూన్ 2వ తేది ఉదయం 9 గంటలకు ఆత్మకూరులోని అభయాంజనేయస్వామి ఆలయంలో ప్రత్యే క పూజలు నిర్వహిస్తారు విక్రమ్ రెడ్డి. అనంతరం నెల్లూరుపాలెం సెంటర్ మీదుగా బీఎస్ఆర్ సెంటర్ చేరుకుని అక్కడి నుండి ఆర్డీఓ కార్యాలయానికి వెళ్తారు. అక్కడ నామినేషన్ దాఖలు చేస్తారు. ఈ కార్యక్రమానికి జిల్లా నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు హాజరవుతారు. 


చేరికలతో సందడి.. 
ఈనెల 23న ఆత్మకూరు ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటి వరకు ప్రధాన పార్టీల అభ్యర్థులెవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు. తొలిసారిగా వైసీపీ తరపున విక్రమ్ రెడ్డి నామినేషన్ వేయబోతున్నారు. బీజేపీ పోటీలో ఉంటామని చెప్పినా ఇప్పటి వరకు అభ్యర్థిని ఖరారు చేయలేదు. ఇక టీడీపీ కూడా పోటీ విషయంలో ఎలాంటి ప్రకటన చేయలేదు. టీడీపీ ఈ ఎన్నికలనుంచి తప్పుకుంటున్నట్టు అయినా ప్రకటన చేస్తుందని అనుకున్నారు కానీ అది కూడా చేయలేదు. జనసేన  పోటీలో ఉంటుందా, లేక బద్వేలు ఉప ఎన్నికల్లో లాగా తాను మాత్రం పోటీనుంచి తప్పుకుంటుందా అనేది తేలాల్సి ఉంది. 


ఏర్పాట్లు పూర్తి చేస్తున్న ఈసీ 


ఈనెల 23న ఆత్మకూరులో ఉప ఎన్నిక జరుగుతుంది. 26న ఫలితాలు విడుదలవుతాయి. ఈనెల 28 వరకు ఎన్నికల కోడ్ జిల్లాలో అమలులో ఉంటుంది. నెల్లూరు జిల్లా మొత్తం ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. ఈ ఉప ఎన్నికల్లో 2,13,330 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అందుకు అన్ని సదుపాయాలు, పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేస్తున్నారు. 279 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఎన్నికలు నిర్వహిస్తారు. వృద్ధులు, వికలాంగులు, కరోనా వ్యాధి గ్రస్తులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నారు. 



ఆత్మకూరు  ఉప ఎన్నికల షెడ్యూల్ 


నామినేషన్ల ప్రారంభం  మే 30, 2022


నామినేషన్ల చివరి తేదీ  జూన్ 6, 2022


ఎన్నికల తేదీ    23 జూన్, 2022


కౌంటింగ్, ఫలితాల ప్రకటన  26 జూన్, 2022