వివిధ ప్రభుత్వ శాఖల్లో పేరుకుపోయిన అవినీతిని రూపు మాపేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే దిశ యాప్‌తో సంచలనం సృష్టించిన ప్రభుత్వం మరో అవినీతిపై కూడా అదేస్థాయిలో పోరాటానికి సిద్ధపడింది. దీనికి అనుగుణంగానే ఏసీబీ 14400 పేరుతో యాప్‌ను రూపొందించి ప్రజల ముందుకు తీసుకొచ్చింది.
అవినీతి నిర్మూలనకు ఏసీబీ తీసుకొచ్చిన సరికొత్త యాప్‌ను క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ప్రారంభించారు. స్పందనపై సమీక్షలో భాగంగా యాప్ స్టార్ట్ చేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఎక్కడా అవినీతి ఉండకూడదనే మాటే చెబుతున్నామని.. ఆ దిశగానే కీలక నిర్ణయాలు తీసుకున్నామన్నారు సీఎం జగన్.
చరిత్రలో ఎప్పుడూలేని విధంగా, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రూ.1.41లక్షల కోట్ల మొత్తాన్ని లాంటి అవినీతి లేకుండా, పక్షపాతం లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి అత్యంత పారదర్శకంగా పంపామన్నారు జగన్. ఎక్కడైనా, ఎవరైనా కూడా.. కలెక్టరేట్ అయినా, ఆర్డీఓ కార్యాలయం అయినా, సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసు అయినా, మండల కార్యాలయం అయినా, పోలీస్‌స్టేషన్ అయినా, వాలంటీర్, సచివాలయం, 108, 104 సర్వీసులు అయినా.. ఎవరైనా ఎక్కడైనా కూడా లంచం అడిగే పరిస్థితి ఉండకూడదన్నారు. అలా ఎవరైనా లంచం అని అడిగితే తమ చేతుల్లోని ఫోన్‌లోకి ఏసీబీ 14400 యాప్‌ను డౌన్లోడ్ చేసి... బటన్ ప్రెస్‌చేసి సమాచారం ఇవ్వాలని చెప్పారు. వీడియో ద్వారా కాని, ఆడియో ద్వారా కాని సంభాషణను రికార్డు చేస్తే ఆ డేటా నేరుగా ఏసీబీకి చేరుతుందన్నారు.
అవినీతిని నిరోధించడానికి మరో విప్లవాత్మకమైన మార్పును తీసుకు వస్తున్నామన్నారు సీఎం జగన్. ఏసీబీ నేరుగా సీఎంఓకు నివేదిస్తుందన్నారు. ప్రతి కలెక్టర్, ఎస్పీకి అవినీతి నిరోధంలో బాధ్యత ఉందన్నారు. అవినీతిపై ఎలాంటి ఫిర్యాదు వచ్చినా వెంటనే స్పందించి అంకిత భావంతో అవినీతిని ఏరిపారేయాల్సిన అవసరం ఉందన్నారు. మన స్థాయిలో అనుకుంటే.. 50శాతం అవినీతి అంతం అవుతుందని అభిప్రాయపడ్డారు. మిగిలిన స్థాయిలో కూడా అవినీతిని ఏరిపారేయాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. అవినీతి లేని పాలన అందించడం అందరి కర్తవ్యం కావాలని తెలిపారు. ఎవరైనా పట్టుబడితే కచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
యాప్ ఎలా పనిచేస్తుందంటే?
పౌరులు నేరుగా ఫిర్యాదు చేసే అవకాశం ఈ యాప్ కల్పిస్తుంది. గూగుల్ ప్లే స్టోర్‌లో ఉన్న యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
యాప్ డౌన్లోడ్ చేయగానే మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ రిజిస్టర్ చేయగానే వినియోగానికి యాప్ సిద్ధమవుతుంది.
యాప్‌లో 2 కీలక ఫీచర్లు ఉన్నాయి. యాప్‌ద్వారా అవినీతి వ్యవహారానికి సంబంధించిన ఆడియో, వీడియో, ఫొటోలను నేరుగా లైవ్ రిపోర్ట్ ఫీచర్‌ను వాడుకుని అక్కడికక్కడే ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. లాడ్జ్ కంప్లైంట్ ఫీచర్ ద్వారా అవినీతి వ్యవహారానికి సంబంధించి.. ఫిర్యాదుకు తన దగ్గరున్న డాక్యుమెంట్లను, వీడియో, ఆడియో, ఫొటో ఆధారాలను ఏసీబీకి పంపించ వచ్చు. ఫిర్యాదు రిజిస్టర్ చేయగానే మొబైల్ ఫోన్‌కు రిఫరెన్స్ నంబరు వస్తుంది. త్వరలో ఐఓఎస్ వెర్షన్‌లోనూ యాప్‌ను సిద్ధంచేస్తోంది ఏసీబీ.