Telangana CM Revanth Reddy Make Big Statement at Police Commemoration Programme: కోట్ల మంది ప్రజలు హాయిగా నిద్రపోతున్నారంటే అందుకు పోలీసులే కారణమన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏ రాష్ట్రమైనా అభివృద్ధి పథంలో దూసుకెళ్లాలంటే శాంతి భద్రతలు కీలకమైన అంశమని గుర్తు చేశారు. శాంతిభద్రతలు లేని ప్రాంతంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకురారని గుర్తు చేశారు. తెలంగాణలో పోలీసులు అవసరమైతే తమ ప్రాణాలైనా వదులుతున్నారు కాని శాంతి భద్రతల్లో రాజీ పడటం లేదని అభినందించారు.
పోలీసు అమరుల కుటుంబాలకు ఇచ్చే పరిహారం పెంపు
హైదరాబాద్‌లోని గోషామహల్ స్టేడియంలో నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి... కీలక ప్రకటన చేశారు. అమరులైన పోలీసుల కుటుంబాలను ప్రభుత్వాలు ఆదుకుంటాయనే విశ్వాసాన్ని కల్పిస్తున్నామన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు వదిలిన అధికారులను గుర్తు చేసుకోవడం స్ఫూర్తిదాయకమని తెలిపారు. అందుకే ఇప్పటి వరకు అమరులకు ఇస్తున్న పరిహారం పెంచుతున్నట్టు వెల్లడించారు. కానిస్టేబుల్, ఏఎస్సై అమరుడైతే... ఆ వ్యక్తి కుటుంబాని కోటి రూపాయల పరిహారం ఇస్తామని రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఎస్సై, సీఐ కుటుంబాలకు కోటి 25 లక్షల రూపాయలు, డీఎస్పీ, ఏఎస్పీ కుటుంబాలకు కోటి 50 లక్షలు రూపాయలు, ఎస్పీ, ఐపీఎస్ కుటుంబాలకు 2 కోట్ల రూపాయల పరిహారం ఇస్తామని పేర్కొన్నారు. .
పోలీసుల పిల్లల కోసం ప్రత్యేక స్కూల్
పోలీసులు ఆత్మగౌరవంతో తలెత్తుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు రేవంత్ రెడ్డి. అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌ని 50 ఎకరాల్లో ప్రారంభించబోతున్నామని హామీ ఇచ్చారు. విద్యతోపాటు స్సోర్ట్స్, గేమ్స్‌ను ఇందులో ప్రవేశపెడతామన్నారు. పోలీసు పిల్లల భవిష్యత్తుకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఒక్క శాతం కూడా తప్పు జరగకుండా పోలీసులు సమన్వయంతో వ్యవహారించాలన్నారు. పోలీసులు సహనం కోల్పోకుండా ఓపికతో పనిచేయాలని హితవుపలికారు. సీనియర్ ఐపిఎస్ అధికారి రాజీవ్ రతన్ చనిపోతే ఆయన కుమారుడికి నిబంధనలు సడలించి గ్రేడ్ టు మున్సిపల్ కమిషనర్‌గా అవకాశం ఇచ్చామని గుర్తు చేశారు.
దేశానికే ఆదర్శం
కె ఎస్ వ్యాస్, పరదేశి నాయుడు, ఉమేష్ చంద్ర, కృష్ణ ప్రసాద్ లాంటి వందల మంది విధి నిర్వహణలో అమరులై స్ఫూర్తిగా నిలిచారని అన్నారు రేవంత్. అలాంటి వారందరికీ ఘనమైన నివాళులు అర్పిస్తున్నట్టు వెల్లడించారు. నేరగాళ్లు ఇప్పుడు సరికొత్త పద్దతుల్లో వస్తున్నారని... వారి ఎదుర్కోవడంలో కూడా తెలంగాణ పోలీస్ ఆదర్శంగా నిలిచిందన్నారు. ఎస్ఐబీ, గ్రేహౌండ్స్ లాంటి సంస్థలను ఏర్పాటు చేసి దేశానికే ఆదర్శంగా నిలిచామని కితాబు ఇచ్చారు. సమాజంలో వచ్చే మార్పులను పోలీసులు నిశితంగా గమనించాలని సూచించారు రేవంత్. సైబర్ క్రైమ్స్‌లో చదువుకున్న వారే ఎక్కువగా మోసం చేస్తున్నారు, క్షణికమైన వాటి కోసం ఈ వలలో పడుతున్నారని తెలిపారు. సైబర్ క్రైమ్స్ కట్టడిలో తెలంగాణ పోలీసుల కృషిని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అభినందించారని గుర్తు చేశారు.
డ్రగ్స్ కంట్రోల్‌పై ఫోకస్
తెలంగాణలో గత పదేళ్లలో గంజాయి, హెరాయిన్, కొకైన్ లాంటి డ్రగ్స్ వినియోగం బాగా పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు రేవంత్. పక్క రాష్ట్రాల నుంచి గంజాయిని తీసుకువస్తున్నారని తెలిపారు. తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో ఏర్పాటు చేసి నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. నార్కోటిక్ బ్యూరోకు కావాల్సిన అన్ని సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తుందని భరోసా ఇచ్చారు సీఎం.
ట్రాఫిక్ నియంత్రణకు ఏఐ వాడకం
హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉందన్నారు సీఎం. ట్రాఫిక్ నియంత్రణలో ఆర్టీఫిషియల్ ఇంటలిజెన్స్‌ను ఉపయోగించాలన్నారు. భావోద్వేగం, ఉన్మాదంతో కొందరు మందిరాలపై దాడి చేయడం ద్వారా అలజడులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు తెలివైన వారని ఇలాంటి వాటిపై అప్రమత్తంగా ఉంటారన్నారు. ముత్యాలమ్మ గుడి ఘటన ఆందోళనకరమన్న రేవంత్... వెంటనే నేరస్తులను అరెస్టు చేసి ఎవరినీ ఉపేక్షించమనే సంకేతాలు ఇచ్చామన్నారు.
నేరాలకు పాల్పడే వారిని తామే శిక్షించాలని కొందరు ప్రయత్నిస్తున్నారని రేవంత్ విమర్శించారు. నేరాలకు పాల్పడే వారిని శిక్షించడానికి పోలీసులు సిద్ధంగా ఉన్నారని ఎవరూ భయపడొద్దని భరోసా ఇచ్చారు. మొహర్రం, బక్రీద్, క్రిస్మస్, వినాయకచవితి, హనుమాన్ జయంతి వంటి ఉత్సవాల సమయంలో మౌలిక సదుపాయాలు లేకపోయినా పోలీసులు బాధ్యతలు నిర్వహిస్తున్నారని కితాబు ఇచ్చారు. జీతం కోసమే పోలీసులు ఉద్యోగాలు చేయడం లేదని... శాంతిభద్రతలు బాధ్యతగా భావించి పని చేస్తున్నారని ప్రశంసించారు.
బాధితులకే ఫ్రెండ్లీ, నేరస్తులకు కాదు
ఇటీవల జరిగిన పోలీస్ నియామకంలో ఉన్నత విద్య అభ్యసించిన వారు కానిస్టేబుల్, ఎస్.ఐలుగా చేరారని గుర్తు చేశారు. గొప్ప లక్ష్యం కోసం యువత పోలీస్ జాబ్స్‌లో చేరుతున్నారని అభినందించారు. శాంతిభద్రతలు కాపాడటంలో పోలీసుల కృషిని ప్రజలు గుర్తించాలని సూచించారు. క్రిమినల్స్‌తో ఫ్రెండ్లీ పోలీస్ ఉండొద్దన్న ఆయన కఠినంగా ఉండాలి హితవుపలికారు. బాధితులతోనే ఫ్రెండ్లీగా ఉండాలన్నారు.
పోలీసులపైన తనకు ప్రత్యేక అభిమానం ఉందన్నారు రేవంత్. ఆత్మగౌరవంతో బతుకుదామని... పోలీసులు గొప్పగా మాట్లాడుకునేలా పనిచేయాలని.. ఛీత్కరించుకునే పనులు జోలికి వెళ్లొద్దని సూచించారు. ఉన్నతాధికారులు పోలీస్ సిబ్బందికి మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. పోలీసుల గౌరవాన్ని పెంచేలా చర్యలు ఉండాలన్న రేవంత్.. ఇతరులకు ఖాకీలు ఆదర్శంగా ఉండాలని అభిప్రాయపడ్డారు.
Also Read: తెలంగాణ వాహనదారులకు అలర్ట్ - అలా చేస్తే లైసెన్స్ రద్దు