Telangana Public Service Commission Group 1: ఇవాళ్టి నుంచి తెలంగాణలో గ్రూప్‌ 1 మెయిన్స్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. మధ్యాహ్నం రెండు గంటలకు పరీక్ష ప్రారంభమై ఐదు గంటలకు ముగుస్తుంది. అయితే అభ్యర్థులు మాత్రం ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. చెప్పిన సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా వారిని పరీక్షకు అనుమతించబోమంటున్నారు. 


భారీ బందోబస్తు మధ్య నేటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా గ్రూప్‌ వన్ పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. 27వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 46 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు అధికారులు 563 పోస్టులు కోసం 31,383 మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్ష రాయనున్నారు. 


పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఒక్కో కేంద్రంలో దాదాపు 20 మంది అధికారులు పర్యవేక్షిస్తున్నారు. సీసీ కెమెరాల నిఘాలోనే మొత్తం పరీక్ష కేంద్రంలోని ప్రతి గదీ ఉంటుంది. ఈ సిసి కెమెరాలను టీజీపీఎస్సీ కార్యాలయానికి అనుసంధానించారు. పరీక్షా కేంద్రాల వద్ద ప్రత్యేక మెడిల్‌ సదుపాయం కూడా కల్పించారు. పరీక్ష కేంద్రాలకు చేరుకునేందుకు ప్రత్యేకంగా ఆర్టీసీ బస్‌లను కూడా కేటాయించారు. 


మధ్యాహ్నం 2 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుంది. అయితే 12.30 నుంచి పరీక్ష కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతి ఇస్తారు. దాదాపు గంట పాటు వివిధ తనిఖీలు చేసిన తర్వాత వారిని పరీక్ష హాల్‌లోకి వెళ్లనిస్తారు. 1.30 వరకు అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా రానివ్వరు. మొదటి రోజు చూపించిన హాల్‌టికెట్‌ను మాత్రమే అన్ని పరీక్షలకు ఉపయోగించాల్సి ఉంటుంది. హాల్ టికెట్ మార్చడానికి వీలు లేదు. 


అభ్యర్థులు తీసుకోవాల్సిన మరిన్ని జాగ్రత్తలు 



  • అభ్యర్థులు హాల్‌టికెట్‌తోపాటు ప్రభుత్వ ఇచ్చిన గుర్తింపు కార్డు వెంట తీసుకురావాలి. 

  • బ్లాక్ లేదా, బ్లూ రంగు బాల్‌పాయింట్ పెన్నుతోనే పరీక్షరాయాలి. జెల్‌ పెన్స్‌ ఉపయోగించవద్దు. రెండు మూడు పెన్నులు తెచ్చుకోవడం బెటర్. పెన్నులతోపాటు బొమ్మలు వేయడానికి స్కేల్, పెన్సిల్, ఎరైజర్‌, షార్ప్‌నర్‌ తెచ్చుకోవాలి. 

  • మొదటి రోజు తీసుకొచ్చిన హాల్‌టికెట్‌నే చివరి వరకు ఉపయోగించాలి. మధ్యలో మార్చడానికి వీలు ఉండదు. అందులో ఇన్విజిలేటర్ తోపాటు అభ్యర్థి సంతకాలు చేయాల్సి ఉంటుంది. 

  • అభ్యర్థులకు ఒకే బుక్‌లెట్‌ ఇస్తారు. అందులో మొత్తం ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. అడిషనల్ షీట్స్ ఇవ్వరు. దీన్ని దృష్టిలో పెట్టుకొని అభ్యర్థులు జవాబులు రాసుకోవాలి. ఇంగ్లీష్‌ మినహా మిగతా పరీక్షలకు ఏ భాషలో అయినా సమాధానాలు రాసుకోవచ్చు. అయితే అన్ని పరీక్షలకు ఒకే భాషను ఎంచుకోవాలి.  

  • దివ్యాంగుల కోసం స్క్రైబ్‌ సెలెక్ట్ చేసుకుంటే వారి కోసం ప్రత్యేక పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీళ్లకు అదనంగా గంట సమయాన్ని కేటాయిస్తారు. వీళ్లు తమతో స్క్రైబ్‌కు అనుమతి ఇచ్చిన సర్టిఫికేట్ తీసుకురావాల్సి ఉంటుంది. 


గ్రూప్-1 మెయిన్స్ 2024 ఏ రోజు ఏ పరీక్ష అంటే... 



  1. 21.10.2024: జనరల్ ఇంగ్లిష్ (క్వాలిఫైయింగ్ టెస్ట్) 

  2. 22.10.2024: పేపర్-1 (జనరల్ ఎస్సే)

  3. 23.10.2024: పేపర్-2 (హిస్టరీ, కల్చర్ అండ్ జియోగ్రఫీ)

  4. 24.10.2024: పేపర్-3 (ఇండియన్ సొసైటీ, కానస్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్)

  5. 25.10.2024: పేపర్-4 (ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్)

  6. 26.10.2024: పేపర్-5 (సైన్స్ & టెక్నాలజీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్) 

  7. 27.10.2024: పేపర్-6 (తెలంగాణ ఉద్యమం, రాష్ట్రావతరణ)


సుప్రీంకోర్టులో గ్రూప్‌1పై పిటిషన్లు- నేడు విచారణ


మరోవైపు జీవో 29 వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ గ్రూప్‌ 1 అభ్యర్థులకు అన్యాయం జరిగిందని చెబుతూ ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసింది. దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ అందరికీ వర్తించేలా ఆదేశాలు ఇవ్వాలని ఇప్పుడు జరుగుతున్న పరీక్షలు వాయిదా వేయాలని కోరుతున్నారు. ఓపెన్‌ కేటగిరిలో మెరిట్‌తో అర్హత పొందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులను రిజర్వేషన్‌ కేటగిరిగా పరిగణించడంపై మండిపడుతున్నారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినతీర్పులకు ఈ జీవో 29 వ్యతిరేకమని చెబుతున్నారు. ఈ పిటిషన్‌ను ఇవాళ సుప్రీంకోర్టు విచారించనుంది. ఇప్పటికే ఈ పిటిషన్‌పై హైకోర్టు రెండుసార్లు విచారించింది. రెండు సార్లు కూడా పిటిషన్లను కొట్టేసింది. దీంతో అభ్యర్థులు సుప్రీంకోర్టుకు వెళ్లారు. 


Also Read: త్వరలో అన్ని రంగాల్లో తెలంగాణ నెంబర్ 1, లీడర్లకు 2 లక్షణాలు తప్పక ఉండాలన్న సీఎం రేవంత్ రెడ్డి