హైదరాబాద్: ధైర్యం, త్యాగాలే నాయకత్వంలో ముఖ్య లక్ష్యణాలు అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘమైన చరిత్ర ఉంది. మహాత్మాగాంధీ, పండిత్ జవహార్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇందిరా గాంధీ, పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ లాంటి వారు గొప్ప ఉదాహరణ అన్నారు. గచ్చిబౌలిలోని ఇండియన్​ స్కూల్​ ఆఫ్​ బిజినెస్​లో ఐఎస్‌బీ లీడర్ షిప్ సమ్మిట్ లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. గొప్ప గొప్ప నేతలు ఎప్పుడూ ధైర్య సాహసాలు ప్రదర్శించడంతో పాటు తమ జీవితాన్ని త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటారన్నారు.  తెలంగాణ ఎకానమీని 1 ట్రిలియన్ ఎకానమీగా, హైదరాబాద్ ఎకానమీని 600 బిలియన్ ఎకానమీగా మార్చుతాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.  


తెలంగాణను అన్ని రంగాల్లో నెంబర్ వన్ గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. యంగ్​ ఇండియా స్కిల్​ యూనివర్సిటీ ద్వారా యువతకు కెరీర్ అవకాశాలు పెంపొందిస్తాం. అంతర్జాతీయ స్థాయిలో క్రీడల్లో రాణించేందుకు స్పోర్ట్స్ యూనివర్సీటీ తీసుకొచ్చి ఒలింపిక్స్ లో రాష్ట్రం నుంచి గోల్డ్ మెడల్స్ రావాలన్నారు. రాష్ట్రాన్ని ఎడ్యుకేషన్​ హబ్​గా మార్చి చూపిస్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 



‘ప్రజలతో నేరుగా కలిసి మాట్లాడే లక్షణం కలిగి ఉండాలి. సిగ్గుపడొద్దు. మీరు ఎక్కడికి వెళ్లినా హైదరాబాద్, తెలంగాణ గురించి మాట్లాడాలి. మనకు పెట్టుబడులు తెచ్చేందుకు కృషిచేయండి. భారత్ లోని నగరాలతో కాదు అంతర్జాతీయ నగరాలతో హైదరాబాద్ పోటీ పడాలి. అయితే కష్టం కావొచ్చు. కానీ అసాధ్యమయితే కాదు. రెండు, మూడేళ్లు హైదరాబాద్ లో తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేయండి. మీకు కావాల్సినంత జీతాలు మేం ఇవ్వకపోవచ్చు. కానీ జీవితంలో మీరు ఎదిగేందుకు మంచి చాలెంజెస్ ఇస్తామని’ ఐఎస్‌బీ లీడర్ షిప్ సమ్మిట్ లో రేవంత్ రెడ్డి ప్రస్తావించారు.