HYDRA Demolition News | హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవాలని కొందరు ప్రచారం చేస్తున్నారని, అనుమతులు లేని బిల్డింగ్ కట్టిన వారు మాత్రమే హైడ్రాకు భయపడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి శనివారం వ్యాఖ్యానించారు. తమ వ్యవస్థపై సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై హైడ్రా స్పందించింది. చట్టబద్ధంగా అనుమతులు తీసుకున్న వెంచర్ల విషయంలో ఎలాంటి భయాలు అక్కర్లేదని హైడ్రా స్పష్టం చేసింది. చెల్లుబాటయ్యే అనుమతులు ఉన్న వారి నిర్మాణాలను కూల్చివేసే ప్రసక్తే లేదని హైడ్రా పేర్కొంది. ప్రభుత్వం ఇచ్చిన అనుమతి పేపర్లు ఉంటే అధికారులను సంప్రదించాలని సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చిన వీడియోను హైడ్రా తమ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.
రియల్ ఎస్టేట్‌కు సీఎం రేవంత్ రెడ్డి భరోసా..
చార్మినార్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. రియల్ ఎస్టేట్‌కు భరోసా కల్పించేలా హామీ ఇచ్చారు. చెరువులు, నాలాల సమీపంలోని నిర్మాణాలతో పాటు ఆ ప్రాంతంలో చట్ట ప్రకారం అనుమతులు తీసుకుని నిర్మించిన కట్టడాలను హైడ్రా కూల్చివేస్తుందని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు, హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ అభివృద్ధిని అడ్డుకునేందుకు చేస్తున్న చిల్లర ప్రయత్నాలు అవి అంటూ మండిపడ్డారు. అనుమతి తీసుకుని చట్టప్రకారం నిర్మించిన కట్టడాలను హైడ్రా కూల్చివేయడం లేదని, వాటి జోలికి హైడ్రా రాదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కబ్జా చేసి కట్టుకున్నోళ్లు, చెరువులు, నాలాల వద్ద పర్మిషన్ లేకుండా ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో నిర్మించుకన్న వాళ్లే హైడ్రాకు భయపడుతున్నారని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆర్థిక ఉగ్రవాదుల భరతం పడతామన్న రేవంత్ రెడ్డి
నాలాల వద్ద, చెరువుల వద్ద ఆస్తులు ఉన్న అందరూ భయపడాల్సిన అవసరం లేదని.. పర్మిషన్ ఉన్నవారు అధికారులకు చట్టప్రకారం తాము తీసుకున్న అనుమతి పత్రాలను చూపించాలన్న వ్యాఖ్యలపై హైడ్రా స్పందించింది. మీ వద్దకు ఎవరైనా వస్తే చట్ట ప్రకారం అనుమతి ఉన్న వారిని ప్రభుత్వం కాపాడుతుందని రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆదేశాలను పాటిస్తామని హైడ్రా తమ పోస్టులో పేర్కొంది. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవాలని, ఆర్థిక వ్యవస్థను నాశనం చేయాలని భావిస్తున్న కొందరు ఆర్థిక ఉగ్రవాదుల భరతం పడుతుందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించిన వీడియోను హైడ్రా ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.
తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది మూసీ బ్యూటిఫికేషన్ కాదని, మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు అని సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ మంత్రులు పలుమార్లు చెప్పారు. అయితే మూసీ పేరుతో రూ.1.5 కోట్ల స్కామ్ చేసి ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు దోచిపెడుతున్నారని బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు ఆరోపిస్తున్నారు.