Double Bed Room house in Telangana | హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఇండ్లు లేని పేదలకు శుభవార్త చెప్పింది. తొలివిడతలో ప్రతి నియోజకవర్గానికి 4 వేల ఇళ్లు ఇస్తామని ఇటీవల తెలంగాణ గృహ నిర్మాణ, రెవెన్యూ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇటీవల చెప్పారు. తాజాగా మరోసారి మాట్లాడుతూ ఈ నెలాఖరుకే ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ చేపడతామని శుభవార్త అందించారు. ఈ దీపావళి నాటికి రాష్ట్ర వ్యా్ప్తంగా 3,500-4,000 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అర్హులైన పేదలకు పంపిణీ చేస్తామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.
వచ్చే నాలుగేళ్లలో పేదలకు 20 లక్షల ఇండ్లు
హైదరాబాద్‌లోని గోషామహల్ నియోజకవర్గానికి కేటాయించిన 144 మంది డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులకు పట్టాల పంపిణీ కార్యక్రమం హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించారు. నియోజకవర్గానికి సంబంధించిన వారికి రాంపల్లిలో కాంగ్రెస్ ప్రభుత్వం డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు (Indiramma Houses) కేటాయించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఏ పార్టీ అనేది చూడకుండా, కులం, మతం పట్టించుకోకుండా అర్హులైన ప్రతి పేదవాడికి తమ ప్రభుత్వం ఇల్లు కట్టించి ఇస్తుందన్నారు. కాంగ్రెస్ వచ్చే నాలుగేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించి పేదలకు ఇవ్వనున్నట్లు ఈ సందర్భంగా పొంగులేటి ప్రకటించారు.
పేదల కన్నీళ్లు తుడిచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. కానీ ప్రతిపక్ష బీఆర్ఎస్ మాత్రం సర్కార్ కాళ్లలో కట్టెలు పెట్టి అడ్డం పడుతోందని, ఇది వారికి సరికాదన్నారు. ఎప్పుడో చేప్టటాల్సిన మూసీ నది ప్రక్షాళనకు సర్కారు కృషి చేస్తుంటే, అభివృద్ధికి సహకరించాల్సిన ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మాత్రం విష ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. పేద ప్రజలకు మంచి జీవితాలు అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆ మేరకు తాము అడుగులు వేస్తోంటే బీఆర్ఎస్ నేతలు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.
గోషామహల్ లో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న హైదరాబాద్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా ఇబ్బంది పెట్టి, ప్రతి పనిని అడ్డుకునే కుట్ర జరుగుతోందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చుతామని, ఆరు గ్యారంటీలను ఒక్కొక్కటిగా అన్నీ అమలు చేస్తున్న తమ ప్రభుత్వానిది అన్నారు. తన నియోజకవర్గ ప్రజలు రాంపల్లికి వెళ్తుంటే బాధగా ఉందన్నారు బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. అయితే వారి సొంతిళ్ల కల సాకారం అవుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు.
ర్యాండమైజేషన్ ప్రక్రియ ద్వారా ఇళ్ల కేటాయింపులు
గోషామహల్ నియోజకవర్గం నుంచి 144 మంది ఇల్లు లేని అర్హులైన పేదలకు ఎవరి ప్రమేయం లేకుండా ర్యాండమైజేషన్ ప్రక్రియ ద్వారా ఇళ్లను కేటాయించామని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి చెప్పారు. గతంలో లాటరీ పద్ధతిలో లబ్ధిదారుల ఇళ్ల కేటాయింపులు జరిగేవి. దాంతో తమకు అన్యాయం జరిగిందని, ఎవరికి ఇవ్వాలని భావించారో వారికి మాత్రమే ఇండ్లు ఇచ్చారని అనుమానులు వ్యక్తం చేసేవారు. కానీ వాటిని అధిగమించేందుకు కొత్త సాఫ్ట్‌వేర్‌ను రూపొందించి లబ్దిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించి, ఇండ్ల పట్టాలు పంపిణీ చేసినట్లు కలెక్టర్ అనుదీప్ వివరించారు. లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ గణేశ్, ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, రహమత్ బేగ్ తదితరులు పాల్గొన్నారు.