Revanth Tour In America And South Korea: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా ప్రయాణం ప్రారంభమైంది. ఈ ఉదయం ఆయన శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి బయల్దేరి వెళ్లారు. మధ్యాహ్నానికి ఆయన అమెరికా చేరుకుంటారు. దాదాపు పదిరోజుల పాటు అమెరికా, దక్షిణ కొరియా దేశాల్లో జరిగే ఈ టూర్‌లో వివిధ పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ టూర్‌లో సీఎం రేవంత్‌రెడ్డితోపాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు కూడా ఉన్నారు. 
ఈ వేకువజామున 4.35 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు కలిసి అధికారుల బృందంతో అమెరికా, దక్షిణ కొరియా టూర్‌కు వెళ్లారు.  మధ్యాహ్నం మూడు గంటలకు ఈ బృందం న్యూయార్క్‌ చేరుకుంటుంది. ఇవాళ విశ్రాంతి తీసుకున్న తర్వాత నాల్గో తేదీ నుంచి అధికారిక కార్యక్రమాల్లో సీఎం బృందం పాల్గొంటుంది. 


నాల్గో తేదీన మొదట న్యూజెర్సీలో ఉన్న ప్రవాస తెలంగాణ ప్రజలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అవుతారు. వీలున్నంత వరకు రాష్ట్రాభివృద్ధి కోసం ప్రయత్నాలు చేయాలని వారిని కోరనున్నారు. అనంతరే ఐదారు తేదీల్లో వాణిజ్య, వ్యాపార ప్రతినిధులతో న్యూయార్క్‌లో రేవంత్ టీం సమావేశం కానుంది. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించనుంది. ఆరో తేదీ పెప్సికో, హెచ్‌సీఏ ప్రతినిధులతో చర్చలు జరుపుతారు. 


న్యూయార్క్‌ నుంచి వాషింగ్టన్ చేరుకొని అక్కడ వరల్డ్ బ్యాంకు ప్రతినిధులతో భేటీ అవుతారు. ఏడో తేదీన డల్లస్‌లో బిజినెస్‌ సంస్థల ప్రతినిధులతో మరో భేటీ ఉంటుంది. అక్కడ గాంధీ స్మృతి కేంద్రాన్ని సందర్శిస్తారు. తర్వాత రోజు శాన్‌ఫ్రాన్సిస్కోలో యాపిల్‌ ఉత్పాదక బృందం, ట్రైనెట్‌ సీఈవో, ఇతర వ్యాపర సంస్థల ప్రతినిధులు, 9న గూగుల్‌, అమెజాన్‌ సంస్థ ప్రతినిధులతో సమావేశమవుతారు. ఆ రోజు సాయంత్రం తెలంంగాణ ఎన్‌ఆర్‌ఐలతో మాట్లాడనున్నారు.  


అక్కడి నుంచి సీఎం నేరుగా దక్షిణకొరియా చేరుకుంటారు. సియోల్‌లో 12,13 తేదీల్లో ఎల్బీ, శామ్‌సంగ్‌ సహా వివిధ వ్యాపార సంస్థల అధినేతలతో భేటీ అవుతారు. తెలంగాణలో పెట్టుబడులకు అవకాశం ఉన్న పరిస్థితులు వాళ్లకు వివరించనున్నారు. అనంతరం అక్కడ నుంచి బయల్దేరి హైదరాబాద్‌ చేరుకుంటారు. 


సీఎంతో ఆనంద్‌ మహీంద్ర భేటీ


తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో మహీంద్ర గ్రూపు చైర్మన్‌ ఆనంద మహీంద్ర సమావేశమయ్యారు. తెలంగాణలో కొత్తగా ఏర్పాటు చేయబోయే స్కిల్‌ యూనివర్శిటీలో ఆటోమేటివ్‌ విభాగాన్ని తీసుకోనున్నట్టు ఆయన తెలియజేశారు. జూబ్లీహిల్స్‌లో సీఎం నివాసంలో ఈ సమావేశం జరిగింది. రాష్ట్రంలో పెట్టుబడుల విషయంపై కూడా ఇద్దరి మధ్య చర్చలు జరిగాయి.