Revanth Reddy Comments in LB Stadium: 25 ఎకరాల్లో 150 కోట్లతో ఎస్సీ, ఎస్టీ మైనారిటీ స్కూళ్లను ఒకే క్యాంపస్ లో ఒకే యూనివర్సిటీలో రూపొందించే ఏర్పాటు చేస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ నమూనా క్యాంపస్ ను ప్రయోగాత్మకంగా కొడంగల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వం 6 వేల పాఠశాలలను మూసేసిందని విమర్శించారు. గురుకులాలు పెట్టినప్పటికీ అందులో మౌలిక వసతులు లేవని అన్నారు. గత ప్రభుత్వ కేబినెట్ లోని మంత్రులు ఎవరినీ కలిసే వాళ్లు కాదని అన్నారు. ఎల్‌బీ స్టేడియంలో నియామ‌క ప‌త్రాలు అందించే కార్య‌క్ర‌మంలో ముఖ్య‌మంత్రి పాల్గొని ప్రసంగించారు. 


ఎవరికి నష్టం కలిగించకుండా ఉండేలా ఉద్యోగ నియామకాలు చేపట్టామని అన్నారు. గత ప్రభుత్వం ఇందుకు విరుద్ధంగా ఉందని గుర్తు చేశారు. ‘‘ఉద్యోగ నియామ‌క ప‌త్రాలు అందుకొని తెలంగాణ భ‌విష్య‌త్‌ను, విద్యార్థి లోకాన్ని తీర్చిదిద్ద‌డానికి వ‌చ్చిన‌ వారంద‌రికి మ‌న‌స్ఫూర్తిగా అభినంద‌న‌లు. ఎల్‌బీ స్టేడియం చ‌రిత్ర‌లో శాశ్వ‌తంగా నిలిచిపోతుంది. ఇదే ఎల్బీ స్టేడియం 2004లో నాడు కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్పాటు చేసి రైతుల‌కు ఉచిత క‌రెంటు, రైతుల‌పై ఉన్న అక్ర‌మ కేసులు, విద్యుత్ బ‌కాయిలు ర‌ద్దు చేస్తూ మొద‌టి సంత‌కం చేసి మ‌న ప్రాంతంలో రైతును రాజును చేస్తూ పునాది ప‌డ్డ‌ది ఈ ఎల్‌బీ స్టేడియంలోనే.


2023, డిసెంబ‌రు 7 తేదీన కాంగ్రెస్ అధ్య‌క్షుడు మ‌ల్లికార్జున ఖ‌ర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే స‌మ‌క్షంలో మ‌రోసారి కాంగ్రెస్ ప్ర‌జా ప్ర‌భుత్వం ఏర్ప‌డింది. ఇదే స్టేడియంలో అభ‌య‌హ‌స్తం పేరిట ఆరు గ్యారెంటీల అమ‌లుకు ఇదే స్టేడియంలో సంత‌కం చేశాం. మూడు నెల‌ల కాలంలోనే ఈ స్టేడియంలోనే 30 వేల మందికి ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పించే సంత‌కాలు పెట్టాం. తెలంగాణ ఉద్య‌మంలో యువ‌త ముందుండి పోరాడింది.. కొంద‌రు ఆత్మ‌బ‌లిదానాలు చేసుకొని అమ‌రులై తెలంగాణ సాధించారు. మా ఆత్మ బ‌లిదానాల‌తో త‌మ భ‌విష్య‌త్ త‌రాల‌కు ఉద్యోగాలు వ‌స్తాయ‌ని న‌మ్మారు.


ఆ బ‌లిదానాల‌తో సాధించిన తెలంగాణ‌లో నాటి ప్ర‌భుత్వం వారి స్ఫూర్తిని ప‌ని చేయాల్సింది పోయి.. వాళ్ల లాభార్జ‌న‌, వారి ధ‌న‌దాహం తీర్చుకోవ‌డానికే ప‌ని చేశారు. ఫాంహౌస్ మ‌త్తులో వారు ఉండి ల‌క్ష‌లాది యువ‌కుల ఆకాంక్ష‌లను నెర‌వేర్చ‌డంలో వారు విఫ‌ల‌మ‌య్యారు. త‌ల్లిదండ్రులు గ్రామాల్లో రూపాయి రూపాయి కూడ‌బెట్టి మిమ్మ‌ల్ని కోచింగ్ సెంట‌ర్ల‌కు పంపితే నాడు ఎప్పుడు నోటిఫికేష‌న్ వ‌స్తుందో తెలియ‌దు.. ప్ర‌శ్నాప‌త్రాలు జిరాక్స్ సెంట‌ర్ల‌లో దొరికేవి. నిరుద్యోగ యువ‌త ముందుకు వ‌చ్చి తండ్రి, కొడుకు, అల్లుడు, కుమార్తెల ఉద్యోగాలు ఊడ‌గొట్ట‌డంతోనే మేం అధికారంలోకి నియామ‌కాలు చేప‌డుతున్నాం. విద్యపై పెట్టే ఖ‌ర్చు ఖ‌ర్చు కాదు.. పెట్టుబ‌డి.. భ‌విష్య‌త్ త‌రాల‌కు ఉప‌యోగ‌ప‌డే ఇంధనం’’ అని రేవంత్ రెడ్డి మాట్లాడారు.