Kalvakuntla Kavitha fires on Revanth Reddy: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదిలాబాద్ పర్యటనలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన్ను పెద్దన్న అని సంబోధించడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. పెద్దన్న అని సంభోదించిన రేవంత్ వ్యాఖ్యలను కవిత తప్పుబట్టారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వని ప్రధాని మోదీని రేవంత్ పెద్దన్న ఎలా మాట్లాడతారో చెప్పాలని అన్నారు. ఈ విషయంపై ఎమ్మెల్సీ కవిత సోమవారం మీడియాతో మాట్లాడారు.
ఆదిలాబాద్ సభలో ప్రధాని మోదీని రేవంత్ రెడ్డి పెద్దన్న అని సంభోదించడం చూస్తే.. బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటే అని అర్థం అవుతోందని అన్నారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు ఒక్క రూపాయి కూడా మోదీ ఇవ్వలేదని గుర్తు చేశారు. గత పదేళ్లుగా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా.. ప్రధాని మోదీ రాష్ట్రానికి ఏమీ చేయలేదని విమర్శించారు. అలాంటిది ప్రధాని మోదీ పెద్దన్న ఎలా అవుతాడని కవిత నిలదీశారు. అంతేకాకుండా రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ హాయాంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో మహిళలకు తీవ్రంగా అన్యాయం జరుగుతోందని అన్నారు. ప్రభుత్వం కొత్తగా జీవో నంబర్ - 3ను తీసుకొచ్చిందని.. ఈ జీవోను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని కవిత డిమాండ్ చేశారు. దీనికి నిరసనగా మార్చి 8వ తేదీన మహిళా దినోత్సవం రోజున ధర్నా చౌక్‌లో నల్ల రిబ్బన్లతో ధర్నాలో పాల్గొంటామని కవిత హెచ్చరించారు. ప్రభుత్వం స్పందించకపోతే నిరసన కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. మహిళలకు, అభ్యర్థులకు కాంగ్రెస్ ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తోందని.. 33 శాతం రావాల్సిన రిజర్వేషన్ పూర్తిగా వెనక్కి పోయిందని కవిత గుర్తు చేశారు. రోస్టర్ విధానం వల్ల ఎక్కువ మంది మహిళలకు ఉద్యోగాలు రాకుండా పోయే ప్రమాదం ఉందని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.