Telangana CM Revanth Reddy | హైదరాబాద్: హైదరాబాద్‌లో ఆక్రమిత చెరువులు, నాలాల వద్ద అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తోంది. మరోవైపు మూసీ పరివాహక ప్రాంతాల పరిధిలో నివసించే అర్హులైన పేదల వివరాలను సేకరించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అర్హులైన పేదలు రోడ్డున పడకూడదని, అలాంటి వారికి డబుల్ బెడ్రూమ్ లేదా ఇతర ప్రత్యామ్నాయం చూపించాలని సూచించారు. చెరువుల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్‌ (Command Control Center)తో అనుసంధానం చేయాలని సూచించారు. 


సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమావేశం


హైడ్రా చేపడుతున్న కార్యక్రమాలు, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు, మెట్రో రైలు విస్తరణ వంటి అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం నాడు ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులకు రేవంత్ రెడ్డి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. చెరువుల వద్ద భూములు ఆక్రమణకు గురికాకుండా చూడటంలో భాగంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానం చేయాలన్నారు.  ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న చెరువుల పరిరక్షణ ఒక బాధ్యతగా చేపట్టాలని.. చెరువులు, నాలాలు ఆక్రమణలకు గురికాకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఓఆర్ఆర్ (Hyderabad RRR) లోపల ఉన్న చెరువులు, కుంటలు, జలశయాలు అన్నింటికీ ఎఫ్టీఎల్ (FTL), బఫర్ జోన్లను గుర్తించడంతో పాటు ప్రతీ చెరువు, నాలాల ఆక్రమణల వివరాలతో పూర్తి స్థాయి నివేదికను తయారు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. 


దసరాలోపు మెట్రో రూటుపై డీపీఆర్ సిద్ధం చేయాలి


శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీ (Future City)కి మెట్రో మార్గానికి సంబంధించి పూర్తి స్థాయి నివేదికను రూపొందించాలని అధికారులకు సీఎం సూచించారు. ఓల్డ్ సిటీ మెట్రో (Hyderabad Old City Metro) విస్తరణ పనులను వేగంగా చేపట్టాలన్నారు. మెట్రో రైలు మార్గాలకు సంబంధించిన భూ సేకరణ సహా ఏమైనా ఇతర అడ్డంకులుంటే అధికారులు వాటిపై స్పెషల్ ఫోకస్ చేసి వాటిని పరిష్కరించాలని సూచించారు. ఈ దసరా పండుగలోపు మెట్రో రైలు విస్తరణ రూట్‌పై పూర్తిస్థాయి డీపీఆర్‌ను సిద్ధం చేసి కేంద్రానికి సమర్పించాలని అధికారులతో సీఎం రేవంత్ అన్నారు.


Also Read: KTR News: ఆ హైడ్రా బాధితులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలి, ప్రభుత్వానికి కేటీఆర్ డిమాండ్