KTR demands Telangana govt to provide Double Bedroom for poor people | హైదరాబాద్: తెలంగాణలో రాజకీయంగా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ నడుస్తోంది. మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్నందున బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా రాజకీయాలు నడుస్తున్నాయి. వీటిని పక్కనపెడితే తెలంగాణలో మరో హాట్ టాపిక్ హైడ్రా కూల్చివేతలు. తాము ప్రభుత్వ అనుమతులు తీసుకున్నా ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలంటూ తెలంగాణలో కూల్చివేతలు చేపడుతున్నారు. దీనివల్ల ఎంతో మంది పేదలు నిరాశ్రయులు అయ్యారని.. వారిని ప్రభుత్వం ఆదుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు.
వాళ్ల ఇండ్లు కూల్చేశారు.. మీరు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలి
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి పేదల పట్ల నిజంగానే చిత్తశుద్ధి ఉంటే హైడ్రా కూల్చివేతల వల్ల ఆశ్రయం కోల్పోయి.. రోడ్డున పడిన వారికి వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయి పంచడానికి సిద్ధంగా 40 వేల డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్నాయని చెప్పారు. ఆరోగ్య సమస్యలు వస్తాయని తెలిసినా ఆ పేదలు ఏ ఆసరా లేక చెరువుల పక్కన, కాలువల పక్కన నివాసం ఉంటున్నారు. అక్కడ పరిశుభ్రత లేకపోవడంతో దోమలు కుట్టి అనారోగ్యం బారిన పడుతున్నా వాళ్లు వేరే చోటుకు వెళ్లలేని పరిస్థితిలో రేకుల షెడ్యూలో ఉంటున్నారని తెలిపారు. కానీ అలాంటి వారి రేకుల షెడ్డులు, గుడిసెల్ని కూడా హైడ్రా పేరుతో కూల్చివేడయం దారుణమన్నారు.
ఈ ప్రాంతంపై ఎంతో నమ్మకంతో, ఎన్నో ఆశలతో పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చేవారికి నగరంపై నమ్మకం పోతుందన్నారు. ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ హైదరాబాద్ ను ఆగం చేయాలని చూస్తారా అని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి, హైడ్రా కూల్చివేతలతో నిరాశ్రయులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అందించి న్యాయం చేయాలన్నారు. పేదవాళ్లు తెలుసో తెలియక చిన్న షెడ్డు, గుడిసె కట్టుకుంటారు. చట్టప్రకారం వారికి నోటిసులు ఇచ్చి, నచ్చ జెప్పాలి. తప్పు జరిగిందని వారికి వివరించి ఇక్కడ ఖాళీ చేయించి వేరే చోట ఇల్లు ఇస్తామని తరలించాలని సూచించారు.