Revanth Reddy On Prajavani: బీఆర్ఎస్ హయాంలో ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్ లలో గ్రీవెన్స్ డే నిర్వహించేవారు. కాంగ్రెస్ వచ్చాక ప్రజావాణి పేరుతో అర్జీలు స్వీకరిస్తున్నారు. తొలినాళ్లలో ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భారీ ప్రచారం కల్పించారు. ఆ తర్వాత జిల్లా కలెక్టరేట్లలో యథావిధిగా ఈ కార్యక్రమం జరుగుతోంది. గ్రీవెన్స్ డే పేరు మారింది కానీ, ప్రజావాణి వల్ల ఉపయోగం ఎంతుందనేది ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. అందుకే దీనిపై ఫోకస్ చేసిన ప్రభుత్వం మరింత పకడ్బంధీగా నిర్వహించేందుకు సిద్ధమైంది. కేవలం కలెక్టరేట్‌లకు పరిమితం చేయకుండా మండల స్థాయిలో కూడా అర్జీలు స్వీకరించేలా చర్యలు చేపడుతోంది.
అన్ని సమస్యలు జిల్లా కేంద్రాలకు చేరడంతో సమస్యల పరిష్కారం త్వరగా కావడం లేదు. ప్రజల్లో దీనిపై నెగిటివిటీ రాకుండా ఉండేందుకు ప్రభుత్వం మండల స్థాయి సమస్యల పరిష్కారం కోసం అక్కడే ప్రజావాణి పెట్టేలా కార్యకరణ సిద్ధం చేసింది ఆ దిశగానే అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
జిల్లా కేంద్రాలకు వచ్చి ప్రజావాణిలో సమస్యలు చెప్పుకునే బాధితులు.. అవే సమస్యలను మండల కేంద్రాల్లో అందజేయాలని సూచిస్తున్నారు ఉన్నతాధికారులు. మండల కేంద్రాల్లో కొన్ని సమస్యలకు సత్వర పరిష్కారం లభిస్తుందని, ఎమ్మార్వో ఆఫీసుల్లో అర్జీలు ఇవ్వాలని చెబుతున్నారు. మండల స్థాయిలో ఫిర్యాదులను పరిష్కరించగలిగితే జిల్లా స్థాయిలో ఇతర సమస్యలపై దృష్టి పెట్టేందుకు వీలు కలుగుతుందని అంటున్నారు.
మండల స్థాయిలో ప్రతి సోమవారం ఉదయం 10.30 గంటలకు ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించేలా కార్యాచరణ సిద్ధం చేశారు అధికారులు. ఈ ప్రజావాణి కార్యక్రమానికి మండల స్థాయి అధికారులు, గ్రామపంచాయతీ కార్యదర్శులు హాజరవుతారు. ప్రజావాణి కార్యక్రమంలో బాధితులు ఇచ్చే దరఖాస్తులను స్వీకరించేందుకు ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని అధికారులు ఆదేశించారు. ప్రతి ఫిర్యాదును పరిశీలించి వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని, మండల స్థాయిలో పరిష్కారం కాని వాటిని జిల్లా స్థాయికి పంపించాలన్నారు. అయితే ఆ విషయం ఫిర్యాదుదారుడికి స్పష్టంగా చెప్పాలన్నారు. సాధ్యమైనంత వరకు ఫిర్యాదులను మండల స్థాయిలో పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నారు. మండల స్థాయిలో ఫిర్యాదు చేసిన 15 రోజుల తరువాత కూడా సమస్య పరిష్కారం కాకపోతే.. బాధితులు జిల్లా కేంద్రానికి రావాలని చెబుతున్నారు. జిల్లా స్థాయిలో నిర్వహించే ప్రజావాణికి వచ్చి వారి సమస్య పరిష్కారానికి సంబంధించిన అప్ డేట్ తెలుసుకోవాలని చెబుతున్నారు.
Also Read: స్వచ్ఛందంగా తప్పుకోండి, లేదంటే కఠిన చర్యలు- మరో కీలక నిర్ణయం దిశగా సీఎం చంద్రబాబు అడుగులు
పెండింగ్ సమస్యల పరిష్కారానికి కూడా ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. ఇప్పటికే పలుమార్లు ప్రజావాణికి వచ్చినా పరిష్కారం కాని సమస్యలపై ప్రత్యేక దృష్టిపెడతారు. ఇక ప్రజావాణి విషయంలో కాంగ్రెస్ భారీ అంచనాలు పెట్టుకున్నా ఆ స్థాయిలో ఈ కార్యక్రమం సక్సెస్ అయిందని చెప్పలేమంటున్నారు ప్రజలు. గత బీఆర్ఎస్ హయాంలో అర్జీలు తీసుకున్నట్టే ఇప్పుడు కూడా ఫిర్యాదుదారులనుంచి దరఖాస్తులు తీసుకుంటున్నారు. వీలైనంత త్వరగా వాటిని పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇస్తున్నారు.
కొత్త రేషన్ కార్డుల పంపిణీ, ఇతర పథకాలకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలు కూడా జరగాల్సి ఉంది. సిక్స్ గ్యారెంటీస్ అమలుకు కొత్త రేషన్ కార్డులతో ప్రభుత్వం లింకు పెట్టింది. దీంతో కొత్త రేషన్ కార్డుల కోసం తెలంగాణలో చాలా మంది ఎదురు చూస్తున్నారు. కొత్తవి వచ్చినా, పాత వాటిలో అనర్హులకు కోత పెట్టాలని కూడా ప్రభుత్వం ఆలోచిస్తోంది. తద్వారా పథకాలు అనర్హులకు అందకుండా చెక్ పెట్టవచ్చని ఆలోచిస్తోంది.
Also Read: బంగాళాఖాతంలో అల్పపీడనం ఎఫెక్ట్ - ఏపీ, తెలంగాణలో ఆ జిల్లాల్లో వర్షాలు - IMD ఆరెంజ్ అలర్ట్