బీజేపీపై పోరుబాట పట్టిన తెలంగాణ సీఎం కేసీఆర్ రేపు మహారాష్ట్ర ముఖ్యమంత్రితో మంతనాలు జరపనున్నారు. ఉద్దవ్‌  ఠాక్రే ఆహ్వానం మేరకు ముంబయి వెళ్తున్నారు. 


రాష్ట్రాల హక్కులు హరించేలా బీజేపీ నేతృత్వంలోని కేంద్రం ప్రభుత్వం  విధానాలు ఉన్నాయని విమర్శిస్తూ వస్తున్నారు కేసీఆర్. అలాంటి అభిప్రాయంతో ఉన్న వాళ్లను ఏకం చేసి కేంద్రంపై తిరుగుబాటు చేయాలని భావిస్తున్నారు. 






గత వారం ప్రధానమంత్రి మోదీని, కేంద్ర ప్రభుత్వాని తీవ్ర స్థాయిలో విమర్శించారు. దీనికి స్పందించిన కొన్ని పార్టీల అధినేతలు, రాష్ట్రాల సీఎంకు కేసీఆర్‌కు ఫోన్ చేసి అభినందించారు. కేంద్రంతో చేసే పోరాటంతో కలిసి వస్తామని హామీ ఇచ్చారు. 


అలా మద్దతు తెలిపిన వారిలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే కూడా ఉన్నారు. ఆయన స్వయంగా ఫోన్ చేసి సరైన టైంలో గళం విప్పారని కితాబిచ్చారు. ముంబయి రావాలని సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించారు. భవిష్యత్ కార్యచరణపై చర్చిద్దామని తెలిపారు. 






ఉద్దవ్ ఠాక్రే ఆహ్వానం మేరకు సీఎం కేసీఆర్ రేపు ముంబయి వెళ్తారు. ఉదయం 11 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరుతారు. మధ్యాహ్నానానికి ముంబయి చేరుకుంటారు. బాంద్రా కుర్లాలోని ఉద్దవ్‌ నివాసానికి వెళ్లి అక్కడ ఆయనతో సమావేశమవుతారు. 


జాతీయ రాజకీయాలు, దేశవ్యాప్త పరిస్థితులు, కేంద్రం రాష్ట్రాలమధ్య సంబంధాలు, భవిష్యత్ కార్యచరణపై ఇద్దరు సీఎం చర్చిస్తారు. రెండు రాష్ట్రాలకు సంబంధించిన కొన్ని సమస్యలు కూడా ప్రస్తావనకు వచ్చే ఛాన్స్ ఉంది.


సీఎం కేసీఆర్‌ వెంట ఒకరిద్దరు మంత్రులు, ఎంపీలు, టీఆర్‌ఎస్‌ నేతలు వెళ్తారని ప్రచారంలో ఉంది. ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ను కూడా సీఎం కేసీఆర్‌ కలిసే  అవకాశం ఉందని తెలంగాణ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.