జగ్గారెడ్డి వివాదం టీకప్పులో తుపాను అంటూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెబుతున్నా అంత ఈజీగా సమసిపోయేటట్టు కనిపించడం లేదు. రాజీనామాపై వెనక్కి తగ్గేదే లేదంటున్న జగ్గారెడ్డి ఏకంగా పార్టీ అధినేత్ర సోనియాగాంధీ, రాహుల్ గాంధీకి లేఖలు రాశారు.
మూడు పేజీల లేఖలో చాలా అంశాలు ప్రస్తావించారు జగ్గారెడ్డి. తనకు పార్టీపై, గాంధీ కుటుంబంపై చాలా గౌరవం ఉందన్నారు. ఇకపై కాంగ్రెస్ గుంపులో ఉండబోనని త్వరలో పార్టీ పదవికి , కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తానని తేల్చి చెప్పారు.
కాంగ్రెస్‌లో సడెన్‌గా వచ్చి లాబీయింగ్ చేసి పీసీసీ కావొచ్చని ఇన్‌డైరెక్టర్‌గా రేవంత్‌పై సెటైర్లు వేశారు జగ్గారెడ్డి. సొంత పార్టీలోనే కుట్రపూరితంగా కోవర్టుగా ముద్రవేస్తున్నారని లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. .
ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే కోవర్ట్ అని కొందరు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని జగ్గారెడ్డి మండిపడ్డారు. గతంలో పార్టీలో వివాదాలు ఉన్న హుందాగా ఉండేది.. కానీ ఇప్పుడు ఆ హుందాతనం లేదని విమర్శించారు.
కాంగ్రెస్ లో జరుగుతున్న అవమానాలు భరించలేకనే రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు జగ్గారెడ్డి. ఇకపై స్వతంత్రంగా ప్రజలకు సేవ చేస్తానని స్పష్టం చేశారు.
తెలంగాణ కాంగ్రెస్‌లో కోవర్టులెవరో గుర్తించాలని అధిష్ఠానానికి సూచించారు జగ్గారెడ్డి. 2017లో రాహుల్ గాంధీ సభ పెట్టేందుకు ఎవరూ ఇంట్రస్ట్ చూపించకుంటే తానే సొంత డబ్బు పెట్టుకొని సభ నిర్వహించానని గుర్తించారు. ఆ సభ నుంచే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలపడుతూ వస్తోందన్నారు. పార్టీ కోసం కష్టపడింది తాను కోవర్టా?... సభను నిర్వహించకుండా మౌనంగా ఉన్న నేతల కోవర్టులా అంటూ ప్రశ్నించారు జగ్గారెడ్డి.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ నుంచి ఎవరూ అభ్యర్థులు పెట్టుకంటే తాను మెదక్ జిల్లా నుంచి అబ్యర్దిని పెట్టాననిర జగ్గారెడ్డి తెలిపారు. కోట్లు ఖర్చు పెట్టి పార్టీకి ఒక్క ఓటు తగ్గకుండా పార్టీ పరువు నిలిపానని లేఖలో పేర్కన్నారు. పార్టీ సీనియర్లు ఎవరూ కనీసం అభ్యర్థిని పెట్టకుండా మౌనంగా ఉన్నారని ఆరోపించారు. ఎవరు కోవర్టులని నిలదీశారు. అభ్యర్థిని పెట్టిన వాళ్లా పెట్టనవాళ్లా అని అడిగారు.
హుజురాబాద్ ఉపఎన్నికల్లో 40 వేల కాంగ్రెస్ ఓట్లను మూడువేల ఓట్లకు పరిమితం చేసిన వాళ్ళు కోవర్టులా...? తానా అంటూ ప్రశ్నంచారు జగ్గారెడ్డి. గాంధీ కుటుంబంపై బీజేపీ అనుచిత వ్యాఖ్యలు చేస్తే ముందు ఖండించింది తానేనన్నారు. మరి పార్టీలో పదవులు అనుభవిస్తున్నవాళ్ళు ఎందుకు స్పందించకుండా మౌనంగా ఉన్నారని జగ్గారెడ్డి అడిగారు. వాళ్లు కోవర్టులో ?
లేక తానో అధిష్ఠానం గుర్తించాలన్నారు.
లేఖ విడుదల సందర్భంగా మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి, కీలక వ‌్యాఖ్యలు చేశారు. తాను స్వతంత్రంగా పని చేసేందుకు వీలుగా రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. త్వరలోనే తనపై అసత్యప్రచారం చేసిన వాళ్ల బండారం బయటపెడతానన్నారు జగ్గారెడ్డి.