CM KCR On Dalit Bandhu: దళితులకు ప్రయోజనం చేకూర్చేందుకు సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకం దళితబంధు. ప్రతిష్టాత్మకంగా నాలుగు నియోజకవర్గాల్లో దళితబంధు పథకాన్ని అమలు చేసేందుకు కొన్ని నెలల కిందట ప్రభుత్వం ప్రకటన చేసింది. ఈ పథకం అమలుపై తెలంగాణ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది నియోజకవర్గానికి 1500 మంది చొప్పున దళితబంధు పథకం లబ్ధిదారులను ఎంపిక చేసే ప్రక్రియను కొనసాగించాలని అధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు. ఎంపిక ప్రక్రియ పూర్తయిన తర్వాత దశల వారీగా దళితబంధు పథకాన్ని అమలు చేయాలన్నారు. దళితబంధు పథకం అమలులో మరింత వేగం పెంచాలని సీఎం అధికారులను ఆదేశించారు.


రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఆయా జిల్లాల మంత్రులు, ప్రజాప్రతినిధులు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనాలని సీఎం కేసీఆర్ సూచించారు. రాష్ట్రం సాధించిన ప్రగతిని తెలియజేస్తూ ప్రసంగాలు ఉండాలన్నారు. ఈ ప్రసంగాలను కలెక్టర్లు నిర్దిష్టమైన సమగ్ర సమాచారంతో తయారుచేయాలన్నారు. వేసవి ఎండల నేపథ్యంలో ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు ఉదయం 9 గం.లకు ప్రారంభించి, త్వరగా ముగించాలన్నారు. సాయంత్రం పూట జిల్లా కేంద్రాల్లో మరియు హైదరాబాద్ రవీంద్ర భారతిలో కవి సమ్మేళనం కార్యక్రమాలను నిర్వహించాలని సీఎం సూచించారు.






తెలంగాణ కేంద్రంగా కవితలను తీసుకురావాల్సిందిగా కవులను, రచయితలను ఆహ్వానించాలని అన్నారు. ఎప్పటి మాదిరిగానే హైదరాబాద్ లోని పబ్లిక్ గార్డెన్ లో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలను నిర్వహించాలని సీఎం అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 20 నుంచి ప్రారంభంకానున్న పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల అమలుకు చేపట్టాల్సిన కార్యాచరణతో పాటు, వరి ధాన్యం సేకరణ మరియు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల నిర్వహణకు సంబంధించి ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. అనంతరం దళితబంధు పథకం అమలుకు సంబంధించి సీఎంవో ఓ పప్రకటన విడుదల చేసింది.