తెలంగాణలో మరిన్ని అంబులెన్స్‌లు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. వాటిని సీఎం కేసీఆర్ జెండా ఊపి నెక్లస్ రోడ్డులోప్రారంభించారు. వీటిలో రెగ్యులర్ అంబులెన్స్‌లు 204 ఉంటే... అమ్మఒడి వాహనాలు 228 ఉన్నాయి.
తెలంగాణ ఏర్పడినప్పుడు 75 లక్ష జనాభాకు ఒక అంబులెన్స్ అందుబాటులో ఉండేదని ఇప్పుడు దాన్ని 75వేలకు తగ్గించినట్టు ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. అంటే ప్రస్తుతం తెలంగాణలో 75 మంది జనాభాకు ఒక అంబులెన్స్ అందుబాటు ఉందన్నారు. 2014 లో 321 అంబులెన్స్‌లు అందుబాటులో ఉంటే ఇప్పుడు దాని సంఖ్యను 455కు పెంచినట్‌టు తెలిపారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పుడు రెస్పాన్స్ టైం 30 నిమిషాలు అంటే... ఫోన్ చేసిన తర్వాత 108 అంబులెన్స్ కాల్ చేసిన స్థలానికి చేరుకున్న టైం అన్నమాట. ఇప్పుుడు దాన్ని 15 నిముషాలకు తీసుకొచ్చినట్టు లెక్కలు వివరిస్తోంది.
ఇవాళ ప్రారంభించిన ప్రత్యేక ఎమర్జెన్సీ 108 అంబులెన్సుల్లో ఆధునిక వసతులు కల్పించినట్టు చెబుతున్నారు. అడ్వాన్సుడ్ లైఫ్ సపోర్ట్ (ALS) ఉంటుందంటున్నారు. 2014లో ఇలాంటి వి ఒక్కటి కూడా లేవని ఇప్పుడు జిల్లాకు ఒకటి ఉందన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నవజాత శిశువుల కోసం ప్రత్యేకంగా 10 అంబులెన్సులు అందుబాటులోకి తీసుకొచ్చినట్టు చెబుతోంది ప్రభుత్వం. గతంలో ఇలాంటివి ఉండేవి కావన్నారు. ఇప్పుడు జిల్లాకు ఒకటి చొప్పున ఉన్నాయన్నారు.
గర్భిణీలను ఆసుపత్రికి తీసుకెళ్లడానికి ప్రత్యేకంగా అంబులెన్స్‌లు తీసుకొచ్చింది ప్రభుత్వం వాటికి అమ్మఒడి 102 అని పేరు పెట్టి ప్రజలకు సేవలు అందిస్తోంది. తెలంగాణ ఏర్పడ్డప్పుడు ఇలాంటివి ఉండేవి కావని నేతలు గుర్తు చేస్తున్నారు. కెసిఆర్ కిట్‌లో భాగంగా 300 వాహనాలు అందుబాటులోకి తీసుకొచ్చినట్టు చెబుతున్నారు. రోజుకు నాలుగు వేల మంది గర్భిణీలకు సేవలు అందిస్తున్నట్టు లెక్క చూపిస్తున్నారు. ఇప్పటి వరకు 30 లక్షల గర్భిణీ స్త్రీలకు అందించారు.
ఆసుపత్రిలో చనిపోయిన వారిని ఇంటికి తీసుకెళ్లేందుకు, లేదా శ్మశానవాటికకు తీసుకెళ్లడానికి కూడా ప్రత్యేక వెహికల్స్‌ను సిద్ధం చేసింది ప్రభుత్వం. వాటికి పరమపద వాహనాలు అని పేరు పెట్టారు. తెలంగాణ ఏర్పడే నాటికి ఇవి లేవని ఇప్పుడు తీసుకొచ్చినట్టు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రజలకు అందుబాటులో 50 వాహనాలు అందుబాటులో ఉన్నాయి. ఇవి రోజుకు 35 డెత్ కేసుల్లో సేవలు అందిస్తున్నాయి. ఇప్పటివరకు 74 వేల డెత్ కేసుల్లో సేవలు అందించాయి.
అందుకే వీటి సంఖ్య మరింత పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇవాళ సీఎం చేతులు మీదుగా 446 వాహనాలు అందుబాటులోకి తీసుకొచ్చింది. వాటిలో 108 (ఎమర్జెన్సీ) వాహనాలు 204, 102అమ్మఒడి వాహనాలు 228, పరమపద వాహనాలు- 34 ఉన్నాయి.
అంబులెన్స్‌ల పనితీరుపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఎక్కడి నుంచి ఎక్కడకు వెళ్తున్నాయి. ఎలా పని చేస్తున్నాయనే విషయాలు తెలుసుకునేందుకు GPS & MDT వ్యవస్థ మానిటర్ చేస్తోందని వివరిస్తున్నారు.
ఇప్పటి వరకు ఉన్న అంబులెన్స్‌లు ప్రతి రోజు 2 వేల ఎమర్జెన్సీ కేసులకు సేవలు అందిస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటి వరకు 44 లక్షల 60 వేల మందికి సేవలు అందించారని తెలిపారు.
కరోనా కాదు దాని తాత వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా తెలంగాణ వైద్యరంగం ఉందన్నారు మంత్రి హరీష్‌రావు. నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రులు ఏర్పాటు చేసేలా సీఎం కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్, నాలుగు టీమ్స్, వరంగల్ హెల్త్ సిటీ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో 50 వేల పడకలు అందుబాటులోకి వచ్చాయన్నారు.