మెట్రో ట్రైన్, కేబుల్ బ్రిడ్జ్, ఫ్లైఓవర్లు, అండర్‌ పాస్‌లతో ఉన్న హైదరాబాద్‌లో మరో అద్భుతమైన కట్టడం ఆకట్టుకోనుంది. డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్‌ను నిర్మించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ప్యారడైజ్ నుంచి కండ్లకోయ జంక్షన్ వరకు, అటు జింఖానా గ్రౌండ్ నుంచి తూంకుంట వరకు ఈ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్లు రానున్నాయి. చెరో 18కిలోమీటర్లు మేర ఈ కట్టడాలు ఆకట్టుకోనున్నాయి. 


ఈ ప్రాజెక్టులకు 150.414 ఎకరాల రక్షణ స్థలం అవసరం కానుంది. దీంతో కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం సమాచారం పంపించింది. ఈ భూమికి బదులు వరే ప్రాంతంలో 500 ఎకరాలు ఇచ్చేందుకు సిద్ధమని చెప్పడంతో రక్షణ శాఖ కూడా ఓకే  చెప్పినట్టు తెలుస్తోంది. అందుకే మంత్రివర్గ సమావేశం అనంతరం కేటీఆర్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. రెండు స్కైవేల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్టు పేర్కొన్నారు. ఈ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్లకు సంబంధించిన డీపీఆర్‌ కూడా సిద్ధం చేశారు.  


ఈ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్‌ను ఒకే పిల్లర్‌పై నిర్మించనున్నారు. ఇలాంటి ప్రయోగానికి గతంలో నాగపూర్ వేదిక అయింది. అక్కడ సుమారు 38 కిలోమీటర్ల ఈ తరహా నిర్మాణం చేపట్టారు. ఇప్పుడు అదే స్టైల్‌లో హైదరాబాద్‌లో ఫ్లైఓవర్‌లు రానున్నాయి. ఈ డబులవ్ డెక్కర్ ఫ్లైఓవర్‌లో కింద, మధ్యలో నార్మల్‌ వెహికల్స్‌ నడిస్తే పైన మెట్రో రైలు నడిచేలా ప్లాన్ చేస్తున్నారు. 


ఈ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్‌తో ఖర్చు తక్కువ అవుతుందని... అదే టైంలో ఆస్తుల సేకరణ కూడా భారీగా తగ్గిపోనుంది. ఒకే పిల్లర్‌పై ఫ్లైఓవర్ నిర్మాణం పర్యాటక ప్రదేశంగా కూడా మారుతుందని అంటున్నారు. ఔటర్ రింగ్‌రోడ్‌వైపు వెళ్లే వాళ్లకు వచ్చే వాళ్లకు ఇది సౌకర్యవంతంగా ఉంటుందని చెబుతున్నారు.