నిమ్స్‌లో కొత్తగా నిర్మించబోయే బ్లాక్‌కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్‌లో ఏర్పాటు చేసిన ఈ బ్లాక్‌కు దశాబ్ధి బ్లాక్ అని పేరు పెట్టారు. ఈ బ్లాక్ ఏర్పాటుతో నిమ్స్‌లో మరో 2000 పడకలు అందుబాటులోకి రానున్నాయి. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రితోపాటు ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొన్నారు. 


శంకుస్థాపన చేసిన తర్వాత మాట్లాడిన సీఎం కేసీఆర్‌... వైద్యానికి మానవ జీవితానికి విడిపోని బంధం ఉందన్నారు. మానవజాతి ఉన్నంత కాలం వైద్యులు అవసరం ఉంటుందని అభిప్రాయపడ్డారు. అలాంటి వైద్యరంగానిి తెలంగాణలో మహర్దశ వచ్చిందని పేర్కొన్నారు. ఆరోగ్యశాఖ అత్యంత కీలకమైనదిగా భావించి బడ్జెట్‌లో కేటాయింపులు చేస్తున్నట్టు తెలిపాారు. 2014లో రూ.2001 కోట్లు కేటాయిస్తే ఈ ఏడాది రూ.12,367 కోట్లకు చేరిందని గుర్తు చేశారు. 


ప్రస్తుతం 550 టన్నుల ఆక్సిజన్‌ను సొంతంగా ఉత్పత్తి చేసుకుంటున్నామని కేసీఆర్‌ చెప్పారు. రాబోయే రోజుల్లో కరోనాను మించిన వైరస్‌లు వస్తాయని వైద్యు నిపుణులు హెచ్చరిస్తున్నారని అందుకు తగ్గట్టుగానే సిద్ధం కావాలన్నారు. వైద్యరంగం బలంగా ఉన్న చోట తక్కువ ప్రాణ నష్టం జరుగుతోందని అందుకే వైద్యానికి తెలంగాణ అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. 


ప్రజలు ఆరోగ్య సమస్యల బారిన పడకుండా ఆరోగ్యం తెలంగాణ సాధనలో భాగంగా న్యూట్రిషన్ కిట్లు ఇస్తున్నట్టు చెప్పారు కేసీఆర్. పిల్లల నుంచి జాగ్రత్తలు తీసుకుంటే భవిష్యత్ బాగుంటుందన్న ఉద్దేశంతో ఈ పథకానికి శ్రీకారం చుట్టామన్నారు. గతంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 30 శాతమే డెలివరీలు జరిగేవని... ఇప్పుడు అది 70 శాతానికి పెరిగిందని కితాబు ఇచ్చారు. 


33 ఎకరాల్లో మూడు బ్లాక్‌లతో బిల్డింగ్‌


మొత్తం 33 ఎకరాల్లో నిమ్స్‌ విస్తరణ పనులు చేపట్టారు. భవిష్యత్తులో పెరుగనున్న రద్దీ, విస్తృతం కానున్న స్పెషాలిటీలను దృష్టిలో పెట్టుకొని విస్తరణ పనులు జరగనున్నాయి. మూడు బ్లాకులు ఈ కొత్త దశాబ్ధి భవనం నిర్మించనున్నారు. 8 అంతస్థుల్లో ఓపీ బ్లాక్‌, ఎమర్జెన్సీ సేవలకు 8 అంతస్థుల బ్లాక్, ఇన్‌పేషంట్ల కోసం 13 అంతస్థులతో బ్లాక్‌ సిద్ధం చేయనున్నారు. 


కొత్త భవనంలో 30 ఆపరేషన్‌ థియేటర్లు ఉంటాయని తెలుస్తోంది. 2 వేల పడకి కూగా ఆక్సిజన్‌ సరఫరా ఉంటుంది. ఇందులో 1,200 ఆక్సిజన్‌ బెడ్లు, 500 ఐసీయూ బెడ్లు ఉంటాయి. ప్రత్యేక గది కావాలనుకునే రోగుల కోసం కొత్తగా 300 పేయింగ్‌ రూమ్స్‌ కేటాయిస్తారు. ప్రస్తుతం 30 విభాగాలు ఉండగా.. విస్తరణతో వీటి సంఖ్య 35 కానుంది. 



నిమ్స్‌కు కేసీఆర్ ప్రభుత్వం 2014-15లో 185 కోట్లు కేటాయించారు. తర్వాత 2022లో 242 కోట్ల రూపాయల నిధులు ఇచ్చారు. ప్రస్తుత ఏడాది రూ.290 కోట్లు కేటాయించారు. 2014 నాటికి నిమ్స్‌లో 900 పడకలు మాత్రమే ఉండేవి. తర్వాత ఆ సంఖ్యను ప్రభుత్వం 1489కి పెంచింది. ఇప్పుడు మరో 2000 పడకల నిర్మాణానికి పనులు ప్రారంభం అయ్యాయి. 2014 నాటికి 111 మంది మాత్రమే టీచింగ్ స్టాప్ ఉండే వాళ్లు. గతేడాది మరో 150ని నియమించారు. ఇప్పుడు అక్కడ బోధనా సిబ్బంది 264కు చేరింది. రెసిడెంట్‌ డాక్టర్ల కేటాయింపును కూడా పెంచారు. ప్రస్తుతం 169 మందిని కేటాయిస్తున్నారు. 


2014 -2021 మధ్య నిమ్స్‌లో 90 కోట్ల రూపాయల విలువైన పరికరాలను కొనుగోలు చేశారు. 2022లో మరో రూ.153 కోట్ల పరికరాల కోసం ఆర్డర్ ఇచ్చారు. 2014తో పోల్చితే ఓపీ 26%, ఐపీ 91% పెరిగాయని ప్రభుత్వ రికార్డులు చెబుతున్నాయి. నిమ్స్‌ ఆరోగ్యశ్రీ కింద లక్షన్నర మంది లబ్ధిపొం దారు.