Shirisha Murder Case: తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేపిన వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాళ్లాపూర్ గ్రామానికి చెందిన 19 ఏళ్ల శిరీష మృతి కేసును పోలీసులు ఛేదించారు. ఇంట్లో జరిగిన గొడవనే హత్యకు కారణం అని పోలీసులు తేల్చారు. మద్యం మత్తులో శిరీష బావ, అతని ఇద్దరు స్నేహితుల సాయంతో హత్య చేసినట్లు గుర్తించారు. శిరీష చనిపోయినప్పటి నుంచి గ్రామస్థులంతా అది హత్యేనని చెప్పగా.. పోలీసులు శిరీష ఆత్మహత్య చేసుకుని ఉంటుందని భావించారు. కానీ చివరకు అసలు నిజం వెలుగులోకి వచ్చింది. మూడ్రోజులుగా శిరీష బావ అనిల్ నోరు మెదపడం లేదు. ఈక్రమంలోనే పోలీసులు అనిల్ కాల్ డేటాను పరిశీలించి.. విచారణ చేపట్టారు. శిరీష ఫోన్ స్విచ్ఛాఫ్ అయినప్పటి నుంచి అనిల్ ఎక్కువగా మాట్లాడిన అతడి ఇద్దరి స్నేహితులను అదుపులోకి తీసుకొని విచారించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
అసలేం జరిగిందంటే?
శిరీష చెప్పిన మాట వినడం లేదని.. ఎప్పుడూ ఫోన్ చూస్తూనే ఉంటుందని శిరీషతో అనిల్ గొడవ పడ్డాడు. అయితే బావతో వాదించడం ఇష్టం లేని ఆమె.. మరో గదిలోకి వెళ్లి ఆత్మహత్యాయత్నం చేసుకోబోయింది. వెంటనే అనిల్ గది తలుపులు పగులగొట్టి ఆమెను బయటకు తీసుకొచ్చాడు. అనంతరం అతను పరిగి వెళ్లిపోయాడు. తీవ్ర మనస్థాపానికి గురైన శిరీష బయటకు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. శిరీష ఇంట్లో నుంచి వెళ్లిపోయిన విషయాన్ని ఆమె తమ్ముడు.. అనిల్ కు ఫోన్ చేసి చెప్పాడు. అప్పటికే తన మిత్రులతో కలిసి అనిల్ ఫుల్లుగా మద్యం సేవించాడు. మరో బీర్ తీసుకొని స్నేహితుడితో కలిసి కాళ్లాపూర్ బయలుదేరాడు. గ్రామ శివారులో ఉన్న మైసమ్మ గుడి దగ్గర అతనికి శిరీష కనిపించింది. ఆగ్రహంతో శిరీషపై అనిల్ చేయి చేసుకున్నాడు. అక్కడే ఉన్న కుంటవైపు లాక్కెళ్లి వెంట తెచ్చుకున్న బీరు బాటిల్ ను పగులగొట్టిన అనిల్ స్నేహితుడు.. శిరీష కళ్లలో గుచ్చినట్లు సమాచారం.
బాటిల్ గుచ్చడంతో అయిన గాయాలకు శిరీష కన్నీరుమున్నీరుగా విలపించింది. తనను వదిలేయమంటూ ఎంతగానో వేడుకుంది. మద్యం మత్తులో ఉన్న ఆ క్రూరులు.. మోకాళ్ల లోతు ఉన్న నీటి కుంటలో పడేశారు. ఆపై అనిల్ సహా అతని ఇద్దరు స్నేహితులు శిరీష చనిపోయే వరకూ ఆమెపైనే నిల్చున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. అయితే శిరీష చనిపోయినట్లు నిర్ధారించుకున్న తర్వాత నిందితులు అక్కడి ఆనవాళ్లను మాయం చేశారు. కుంటలో పడేసి ఇంటికి వెళ్లిపోయారు.
ఆమె కనిపించడం లేదని వెతుకుతున్నట్లుగా నాటకం ఆడడం ప్రారంభించారు. ఆపై పోలీసులకు ఫిర్యాదు చేయడం.. ఈ కథంతా జరగడం అందరికీ తెలిసిందే. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి విషయాలను పోలీసులు వెల్లడించలేదు. పోలీసుల కస్టడీలోని ఇద్దరు నిందితులూ ఉన్నట్లు సమాచారం. మరికొన్ని గంటల్లో ఇందుకు సంబంధించిన పూర్తి విషయాలు వెలుగులోకి వస్తాయి.
ఆరోజు ఏమైందంటే?
వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాళ్లాపూర్ గ్రామానికి చెందిన 19 ఏళ్ల శిరీష.. శనివారం (జూన్ 10) రోజు రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ఎంతసేపు అవుతున్నా ఆమె ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాల్లో గాలించారు. తెలిసిన స్నేహితులు, బంధువులు అందరికీ ఫోన్ లు చేశారు. ఎక్కడా ఆమె ఆచూకీ లభ్యం కాలేదు. అయితే ఆదివారం రోజు ఉదయం గ్రామ సమీపంలోని నీటి కుంటలో శిరీష శవమై తేలింది. విషయం గుర్తించిన స్థానికులు.. కుటుంబ సభ్యులకు, పోలీసులకు తెలిపారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు.. మృతదేహాన్ని బయటకు తీశారు. అయితే శిరీష మృతదేహంపై రక్తపు మరకలు ఉండడంతో ఆమెను ఎవరో హత్య చేసినట్లు భావించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా.. ఆమెది దారుణమైన హత్య అని తేలింది.