T-24 Ticket Price Hike: భాగ్యనగరం సిటీ బస్సుల్లో 24 గంటల పాటు ప్రయాణించడానికి వెసులుబాటు కల్పించే టీ-24 టికెట్ ప్రస్తుత ధరల్ని పెంచుతూ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. సాధారణ ప్రయాణికులకు ఈ టికెట్ ధరను రూ.90 నుంచి రూ.100కి పెంచింది. సీనియర్ సిటిజెన్లు(పురుషులు, మహిళలు, 12 ఏళ్ల పైబడిన బాలికలు)కు రూ.80 ఉండగా.. దాన్ని 90 రూపాయలకు పెంచింది. ఈ మేరకు ఆర్టీసీ ఈడీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ధరలు జూన్ 10 నుంచి జులై 31వ తేదీ వరకు అమల్లో ఉంటాయని ఉత్తర్వుల్లో వెల్లడించింది. గతంలో టీ-24 టికెట్ సాధారణ ప్రయాణికులకు రూ.100 ఉండగా.. ఏప్రిల్ 26న రూ.90కి తగ్గించింది. సీనియర్ సిటిజన్లకు రూ.80కి అందించింది. తాజాగా పాత ధరల్ని పునరుద్ధరించింది.


ఇటీవలే ధరలు తగ్గించిన ఆర్టీసీ


తెలంగాణ ఆర్టీసీ ఇీవలే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రయాణించే మహిళల ఆర్థిక భారం తగ్గించేందుకు వారికి టీ-24 టికెట్ ను రూ.80కే అందించాలని నిర్ణయించింది. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్‌ బస్సుల్లో 24 గంటల పాటు ప్రయాణించే ఈ టికెట్ ధరను సాధారణ ప్రయాణికులకు రూ.90గా, సీనియర్ సిటిజెన్లకు రూ.80గా ఇటీవల టీఎస్ఆర్టీసీ యాజమాన్యం తగ్గించింది. మహిళా ప్రయాణికులకు రూ.10 తగ్గించి రూ.80కే అందించాలని నిర్ణయించింది. ఈ కొత్త టికెట్ ధరను మే 9వ తేదీ నుంచే అందుబాటులోకి తీసుకువచ్చింది. సిటీ పరిధిలో తిరిగే ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లోని కండక్టర్ల వద్ద ఈ టికెట్లు అందుబాటులో ఉంటాయి. గ్రేటర్ హైదరాబాద్ లో అందుబాటులోకి తీసుకువచ్చిన ఈ టీ-24 టికెట్ కు అనూహ్య స్పందన వస్తోందని టీఎస్ఆర్టీసీ ఛైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ రెడ్డి, ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. సిటీ బస్సుల్లో 24 గంటల పాటు ప్రయాణించే ఆ టికెట్ ధరను రూ.100 నుంచి రూ.90కి ఇటీవలే తగ్గించింది. కొత్తగా సీనియర్ సిటిజన్లకు రూ.80కే అందిస్తోంది. 


అయితే ఈ ధరలు తగ్గించినప్పటి నుంచి టీ-24 టికెట్ ను కొనుగోలు చేసే వారి సంఖ్య పెరిగిపోయిందట. ధర తగ్గింపు తర్వాత ప్రతి రోజు సగటున 40 వేల వరకు టీ-24 టికెట్లు అమ్ముడు అవుతున్నాయట. గతంలో రోజుకు 25 వేల మాత్రమే ఉండే ఆ సంఖ్య గణనీయంగా పెరిగింది. మహిళా ప్రయాణికులకు మరింత దగ్గర అయ్యేందుకు రూ.80కే టీ-24 టికెట్ ఇవ్వాలని సంస్థ నిర్ణించింది. అలాగే మహిళలు, సీనియర్ సిటిజెన్ల కోసం టీ-6 టికెట్ ను ఇటీవలే ప్రారంభించామని, రూ.50కి ఆ టికెట్ కొనుగోలు చేస్తే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వారు ప్రయాణించవచ్చని చెప్పారు. కానీ తాజాగా మరోసారి ఈ టికెట్ ధరలను పెంచారు. 


ఆర్టీసీ ఈడీ కార్యాలయాల తరలింపు 


ఎంబీబీఎస్ లో ఉన్న హైదరాబాద్ జోన్ ఈడీ ఆఫీస్ ను కాచిగూడలోని కమ్యూనిటీ ఎమినిటీస్ కేంద్రానికి, సిటీ బస్సులకు సంబంధించి జూబ్లీ బస్ స్టేషన్ లో ఉన్న గ్రేటర్ ఈడీ కార్యాలయాన్ని మిధానిలోని కమ్యూనిటీ ఎమినిటీస్ సెంటర్ కు మార్చనున్నారు. ఎండీ సజ్జనార్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాన కార్యాలయం బస్ భవన్ ఈడీ ఆదేశాలు జారీ చేశారు.