ఢిల్లీలోని వ‌సంత్ విహార్‌లో కొత్తగా నిర్మించిన బీఆర్ఎస్(BRS ) కార్యాలయాన్ని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌(KCR) ప్రారంభించారు. అంతకంటే ముందు అక్కడ జరిగిన పూజ,యాగంలో కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాల్గొన్నారు. త‌ర్వాత శిలాఫ‌లకాన్ని ఆవిష్కరించారు. కరెక్ట్‌గా ఒంటిగంట ఐదు నిమిషాలకు రిబన్ కట్ చేసి భవనంలోకి ప్రవేశించారు. 






ఓపెనింగ్ తర్వాత తన ఛాంబర్‌లోకి వెళ్లి కూర్చున్నారు. అక్కడకు చేరుకున్న పార్టీ నేతలు, మంత్రులు, ఇతర శ్రేణులు ఒక్కొక్కరిగా వచ్చి సీఎంకు శుభాకాంక్షలు చెప్పారు. ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. తర్వాత మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులతో సీఎం తొలి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 


బీఆర్‌ఎస్ ఆఫీస్‌ ప్రారంభోత్సవం సందర్భంగా ఢిల్లీలోని వసంతర్ విహార్‌లో సందడి వాతావరణం నెలకొంది. ఆ ప్రాంతమంతా గులాబీమయమైంది. ఈ ఆఫీస్‌ నిర్మాణానికి 2021 సెప్టెంబర్‌లో సీఎం భూమి పూజ చేశారు. 11 వేల చదరపు అడుగుల స్థలంలో మొత్తం నాలుగు అంతస్తుల్లో ఈ భవనాన్ని నిర్మించారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో క్యాంటీన్, రిసెప్షన్ ఉంటుంది. దాని కింద గ్రౌండ్‌లో మీడియా హాల్‌, సర్వెంట్ క్వార్టర్స్ ఏర్పాటు చేశారు. మొదటి ఫ్లోర్‌లో పార్టీ అధ్యక్షుడు ఆఫీస్‌ ఉంటుంది. పక్కనే కాన్ఫరెన్స్ హాలు ఉంటుంది. రెండు, మూడో అంతస్తులో ఇరవై గదులు ఉంటాయి. వాటిలో పార్టీ ప్రెసిడెంట్‌ సూట్‌, వర్కింగ్ ప్రెసిడెంట్ సూట్‌ ఉన్నాయి. మిగతా 18 అతిథుల కోసం కేటాయిస్తారు. ఈ భవనం కోసం 8.64 కోట్లు ఖర్చు పెట్టారు. 


ఇదో ప్రౌడ్ మూమెంట్‌: కవిత


దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం ప్రతి ఒక్క గులాబీ సైనికుడికి గర్వకారణమని అన్నారు ఎమ్మెల్సీ కవిత. సీఎం కేసీఆర్ దూరదృష్టి, పట్టుదల, నిబద్ధత బీఆర్ఎస్ పార్టీని ఉన్నత స్థానానికి తీసుకెళ్లాయని ఆకాంక్ష వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా ప్రారంభమైన టిఆర్ఎస్ పార్టీ అనేక రాజకీయ ఒడిదుడుకులను తట్టుకొని, ప్రతి ఒక్క పౌరుడి మద్దతుతో లక్ష్యాన్ని సాధించిందన్నారు ఎమ్మెల్సీ కవిత.


సీఎం కేసీఆర్ నిబద్ధతను మెచ్చి ప్రత్యేక తెలంగాణకు 39 రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చాయని గుర్తు చేశారు. సీఎం కెసిఆర్ రాజనీతిజ్ఞతతో ఏర్పడిన తెలంగాణ ఈరోజు అభివృద్ధిలో దూసుకెళ్తుందని... 9 మంది లోక్‌సభ ఎంపీలతో, ఏడుగురు రాజ్యసభ ఎంపీలతో, 105 మంది ఎమ్మెల్యేలతో టిఆర్ఎస్ పార్టీ జాతీయస్థాయిలో కీలక పార్టీగా ఎదిగిందన్నారు. ట్విట్ట్ వేదిగా ఆమె తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.