పేరుకే వెయిట్‌లాస్‌ బిజినెస్ మేనేజర్‌.. చేసేదంతా పక్కా ఫ్రాడ్‌. ఇదివరకే చిప్ప కూడు తిని వచ్చాడు. అయినా బుద్ది మారలేదు. అదే పాడు పని పదే పదే చేశాడు. చివరకు మరోసారి దొరికిపోయి జైలు ఊచలు లెక్కిస్తున్నాడు. 


చందు అలియాస్ చంద్రశేఖర్... కుకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డు ప్రాంతంలో హెర్బల్ లైఫ్ బిజినెస్ కస్టమర్లకు బాగా పరిచయం ఉన్న పేరు. ఇతను చేసేది వెయిట్‌ లాస్ బిజినెస్‌ మేనేజర్ జాబ్. ఈయనతో పెట్టుకుంటే మాత్రం వాళ్ల ఫ్యామిలీలు మటాష్. అధిక బరువుతో తన వద్దకు వచ్చే కస్టమర్స్‌కు మంచిగా కబుర్లు చెప్పి ముగ్గులోకి దింపుతాడీ ఫ్రాడ్.


బరువు తగ్గాలంటూ వచ్చిన వారి వివరాలు సేకరిస్తాడు ఈ చంద్రశేఖర్. తర్వాత వారికి రకరకాల ఆఫర్ల పేరుతో చాటింగ్ స్టార్ట్ చేస్తాడు. అందులో యాక్టివ్‌గా ఉన్న వారిని, ఒంటరిగా ఉన్న వాళ్లను సెలెక్ట్ చేసుకొని మరింతగా క్లోజ్ అవుతాడు. తర్వాత పర్సనల్ చాటింగ్ స్టార్ట్ చేస్తాడు. 


మహిళల బలహీనతలను అవకాశంగా తీసుకొని అసభ్యంగా ప్రవరిస్తాడు. ముందు చాటింగ్‌తో మొదలయ్యే వ్యవహారం తర్వాత వీడియో కాల్స్ వరకు తర్వాత ప్రైవేటు పార్టీల వరకు వెళ్తుంది. అక్కడితో ఆగిపోకుండా మరింత దారుణంగా ప్రవరిస్తున్నాడని సమాచారం. 


తనతో చాటింగ్ స్క్రీన్ షాట్స్ తీసి బాధితులను బెదిరించడం, బలవంత పెట్టడం పనిగా పెట్టున్నాడు. కొందరి వద్ద డబ్బులు కూడా వసూలు చేశాడని బాధితులు చెబుతున్నారు. 


ఇలా చాలా మందికి మాట మాటలు చెప్పి అవతలి వాళ్ల ఫ్యామిలీల్లో చిచ్చు పెట్టడం ఈ చంద్రశేఖర్ పని. ఇలా చాలా మంది జీవితాలతో ఆడుకున్నాడు. ఇప్పుడు జైల్లో ఉన్నాడు. 


ఈ చంద్రశేఖర్‌కు జైలు కొత్త కాదు. గతంలో ఓసారి కొన్ని రోజుల పాటు జైల్లో ఉండి వచ్చాడు. గతంలో ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించి బుక్‌ అయిపోయాడీ చంద్రశేఖర్. చివరకు ఆ వ్యవహారం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లంది.


ఓ మహిళకు మాయ మాటలు చెప్పిన చంద్రశేఖర్‌... ఆమెతో హెర్బల్‌ లైఫ్ బిజినెస్‌ పెట్టిస్తానంటూ నమ్మబలికాడు. పలు దఫాలుగా ఆమె నుంచి రెండున్నర కోట్ల రూపాయలు వసూలు చేశాడు. ఎప్పటికీ బిజినెస్ పెట్టించకపోవడంతో ఆమె నిలదీసింది. అప్పటికీ వాయిదాలు వేస్తూ మోసం చేసే ప్రయత్నం చేశాడు. చివరకు ఆమెపై దాడికి కూడా యత్నించాడు. 


చంద్రశేఖర్ చేస్తున్న చీటింగ్‌ను ఆలస్యంగా గమనించిన ఆ మహిళ రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఫ్రాడ్ చంద్రశేఖర్ ఆట కట్టించారు. అతనిపై అటెంప్ట్ మర్డర్ కేసు, చీటింగ్ కేసు నమోదు చేశారు. ఈ కేసులో కొద్ది రోజుల పాటు జైల్లో కూడా ఉన్నాడు చంద్రశేఖర్. 


జైలు నుంచి బయటకు వచ్చినా చంద్రశేఖర్ తన బుద్ది మార్చుకోలేదు. మాయమాటలతో మహిళలను మోసాలు చేస్తూనే ఉన్నాడు. దీంతో కొందరు బాధితులు సోషల్ మీడియా తమ గోడు వెళ్లబోసుకున్నారు. మహిళలను ఎలా మోసం చేస్తున్నాడో తెలిసేలా అతడితో జరిగిన చాటింగ్ స్క్రీన్స్ షాట్లు పంచుకుంటున్నారు.