Telangana Budget: తెలంగాణ బడ్జెట్ 2025-26ను శాసన సభలో ప్రవేశ పెట్టిన ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క నిరుద్యోగులకు తీపి కబురు అందించారు. రాజీవ్ యువ వికాసం పథకం కోసం ఆరు వేల కోట్లు కేటాయించినట్లు ప్రకటించారు. ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ యువతకు ఉపాధి కల్పించే ఈ పథకం ద్వారా 5 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఇది ఒకటి. ఇప్పటికే ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకునేందుకు ప్రత్యేకంగా వైబ్‌సైట్‌ను రూపొందించి అన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తోంది.


అంగన్ వాడీ పోస్టుల భర్తీ
మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉండే అంగన్వాడీ పోస్టుల భర్తీ త్వరలో చేపట్టనున్నట్లు ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క ఈ బడ్జెట్‌లో ప్రకటించారు. త్వరలో 14,236 అంగన్వాడీ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చాక ఉద్యోగాల భర్తీకి అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు భట్టి విక్రమార్క. అంగన్ వాడీ పోస్టుల భర్తీ వల్ల పలు నిరుద్యోగ మహిళలకు ఉపాధి కలుగుతుందని చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిరుద్యోగ శాతం 22.9 నుంచి 18.1 శాతానికి తగ్గించగలిగామని చెప్పారు. త్వరలోనే ఆయా శాఖల ద్వారా ఇచ్చే వేర్వేరు నోటిఫికేషన్ల ద్వారా 57,946 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారు.


ముచ్చెర్లలో యంగ్ ఇండియా టెక్నికల్ యూనివర్సిటీ
యువతను టెక్నికల్‌గా తీర్చిదిద్దేందుకు ముచ్చెర్లలో యంగ్ ఇండియా టెక్నికల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి భట్టి తెలిపారు. ఏఐ సిటీని 200 ఎకరాల్లో ఏర్పాటు చేసి ప్రత్యేక హబ్‌గా ప్రభుత్వం గుర్తించి అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. తద్వారా హైదరాబాద్ ఏఐ హబ్‌గా మారే అవకాశం ఉందని ఆకాంక్షించారు.