Telangana Budget 2025 | తెలంగాణ ప్రభుత్వం వార్షిక బడ్జెట్ 2025-26 ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క రోడ్డు, భవనాల శాఖ ( ఆర్ అండ్ బీ)కి సంబంధించి ఖర్చులు, చేయనున్న అభివృద్ధిపై శాసనసభలో వెల్లడించారు. హైబ్రిడ్ అన్యూటీ మోడల్ (HAM) ద్వారా రహదారుల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మోడల్ ప్రకారం 40 శాతం ప్రభుత్వ నిధులతో, 60 శాతం ప్రైవేట్ డెవలపర్ల పెట్టుబడితో రహదారులను అభివృద్ధి చేస్తాం. HAM మోడల్లో 2028 వరకు 17,000 కిలోమీటర్ల గ్రామీణ రహదారులను సుమారు 28,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు. రోడ్డు, భవనాల శాఖకు ఈ బడ్జెట్ లో 5,907 కోట్ల రూపాయలు ప్రతిపాదించారు.


పరిపాలనా అనుమతులు మంజూరు


ఆయన ఇంకా మాట్లాడుతూ.. ‘తెలంగాణ ప్రభుత్వం కొత్తగా 769.35 కి.మీ. పొడవైన రహదారుల నిర్మాణానికి 3 వేల 7 వందల ఇరవై ఐదు కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయల (3,725.22 కోట్లు) మేరకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. వీటిలో 55 కిలోమీటర్ల పొడవు కలిగిన రహదారులు, 9 వంతెనల నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల అనుసంధానానికి వీలుగా, ప్రతి పంచాయితీకి బి.టి రోడ్డు ఉండేలా రోడ్ల నిర్మాణం చేపట్టాం. గ్రామీణ ప్రాంతాలలో పాడైపోయిన రహదారుల మరమ్మత్తులు పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. 12 జిల్లా కేంద్రాల్లో కోర్టు భవన సముదాయాల నిర్మాణానికి 972 కోట్ల రూపాయలతో పాలనపరమైన అనుమతులను మంజూరు చేశాం.


మామునూర్ ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి కేంద్రం అనుమతులు


తెలంగాణ ప్రభుత్వ విశేష కృషి వల్ల ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్న వరంగల్ జిల్లా మామునూర్ ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఇప్పటికే, దీనికి కావల్సిన 253 ఎకరాల భూ సేకరణకు నిధులు మంజూరు చేశాం. హైదరాబాద్ నగరానికి నలువైపుల జాతీయ రహదారి నెట్ వర్క్ లో ఉన్న లోటును పూడ్చడానికి రీజనల్ రింగు రోడ్డు (Hyderabad Regional Ring Road) ప్రణాళిక రూపొందించబడింది. ఈ రహదారిని ఎక్స్ ప్రెస్ వే ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని, మొదటగా నాలుగు లేన్లగా నిర్మించి భవిష్యత్తులో ట్రాఫిక్ కి అనుగుణంగా ఎనిమిది లేన్లకు విస్తరిస్తాం. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో ఉత్తర భాగ భూసేకరణ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమయ్యింది. దక్షిణ భాగానికి సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు తయారీకి NHAI కన్సల్టెంట్ లను నియమించింది. ఈ ప్రాజెక్టును తెలంగాణ అభివృద్ధికి గేమ్ చేంజర్ గా ప్రభుత్వం పరిగణిస్తుంది.