Telangana Budget 2025 | హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. రైతులకు పంట కోసం ఆర్థిక సాయం చేయడానికి బడ్జెట్ ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ పనిముట్లను కొనుగోలు చేసేందుకు పెట్టుబడి సాయం కోసం బడ్జెట్ లో కేటాయింపులు చేసింది. రైతులకు పంట పెట్టుబడి సాయం కోసం రైతు భరోసా పథకానికిగానూ పద్దెనిమిది వేల కోట్ల (రూ.18,000 కోట్లు) రూపాయలు తెలంగాణ వార్షిక బడ్జెట్ 2025-26లో కేటాయించారు. డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) వచ్చే వార్షిక సంవత్సరానికిగానూ తెలంగాణ బడ్జెట్ (TS Budget 2025)ను శాసనసభలో ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రవేశపెడుతున్న తొలి పూర్తి స్థాయి బడ్జెట్ కావడంతో అంచనాలు పెరిగిపోయాయి.


రైతులకు ఎకరానికి రూ.12 వేలు


రైతులకు గత ప్రభుత్వం ఏడాదికి రూ.10 వేలు పంట పెట్టుబడి సాయం ఇచ్చేంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పెట్టుబడి సాయాన్ని ఎకరానికి రూ.12 వేలకు పెంచి అమలు చేస్తోంది. ఖరీఫ్ సీజన్ కు రూ.6 వేలు, రబీ సీజన్లో పంట పెట్టుబడి సాయం రూ.6 వేల చొప్పున ఏడాదికి రెండు సార్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. తెలంగాణ వార్షిక బడ్జెట్ 2025-26 మొత్తం వ్యయం 3,04,965 కోట్లు కాగా, రెవెన్యూ వ్యయం 2,26,982 , మూలధన వ్యయం రూ. 36,504 కోట్లు అని భట్టి విక్రమార్క బడ్జెట్ లో ప్రతిపాదించారు. 


జనవరిలో పథకాలు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం


కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 26 తేదీన 4 పథకాలను ప్రవేశపెట్టింది. రేషన్ కార్డుల మంజూరు, ఇందిరమ్మ ఇండ్ల పథకం, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, తెలంగాణ రైతు భరోసా పథకాలను ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం కింద రైతులకు రెండు విడతలుగా ఏడాదికి ఒక్కో సాగు చేసే ఎకరానికి 12 వేల రూపాయల పంట పెట్టుబడి సాయం అందుతుంది. సాగుకి యోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసా ఇస్తామని, ప్రజాధనం దుర్వినియోగం కాకుండా, అవకతవకలకు అడ్డుకట్ట వేస్తున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. గ్రామ సభలలో దరఖాస్తులు తీసుకుని, సాగుకు యోగ్యంకాని భూమిని గుర్తించి ప్రజా ధనం వృధాను అరికట్టినట్లు చెప్పారు.


సన్న వడ్లకు రూ.500 బోనస్


సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇచ్చి రైతులను ఆదుకుంటున్నాం. రాష్ట్రంలో సన్న రకాల వరి సాగు పెరిగింది. గత ఖరీఫ్ తో పోల్చితే అదనంగా 15 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. గతంలో 25 లక్షల ఎకరాలు సాగు చేయగా, 40 లక్షల ఎకరాలకు పెరిగిందని భట్టి విక్రమార్క తెలిపారు. రైతులకు గిట్టుబాట ధర కల్పి్స్తున్నాం. సన్న వడ్లు పండించిన రైతులకు రూ.1206 కోట్లు బోనస్ చెల్లించాం. ఖరీఫ్ లో 8,332 కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేశాం. ధాన్యం తడవకుండా మార్కెట్ యార్డులలో రూ.181 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాం. 2024,25 ఖరీఫ్ సీజన్లో 10 లక్షల 35 వేల 484 మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి 12 వే 5 వందల 11 కోట్ల మొత్తాన్ని వారి ఖాతాల్లో జమ చేసినట్లు బడ్జెట్ ప్రసంగంలో భట్టి వెల్లడించారు.