బిజెపి చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర రెండో విడత పాదయాత్రలో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో పర్యటిస్తున్న ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌... ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. ఏ గ్రామానికి వెళ్ళినా సాగునీటి సమస్యలు, వలసలు, ఉపాధి సమస్యలే కనిపిస్తున్నాయన్నారు. 


వెనుకబడిన పాలమూరు జిల్లాలో పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించి... సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకరావాలనే ఉద్దేశ్యంతో ప్రజా సంగ్రామ యాత్ర చేపడితే కేటీఆర్‌, టీఆర్‌ఎస్‌ నేతలు విషం కక్కుతున్నారన్నారు బండి సంజయ్‌. 2009లో మహబూబ్‌నగర్‌ పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించిన కేసీఆర్‌... జిల్లాను దత్తత తీసుకొన్నారని గుర్తు చేసుకున్నారు. సాగునీటి సమస్య లేకుండా సస్యశ్యామలం చేస్తానని జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి వలసలు లేని ప్రాంతంగా పాలమూరును తీర్చిదిద్దుతానని  చేసిన వాగ్ధానాలు అమలు కాలేదన్నారు. 


8ఏళ్ల కాలంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఏ సాగునీటి ప్రాజెక్టు పూర్తికాలేదన్నారు బండి సంజయ్. ప్రభుత్వాలు పూర్తిచేసిన సాగునీటి ప్రాజెక్టులను మీ ఖాతాలో వేసుకొని పాలమూరంతా సస్యశ్యామలం అయిందని అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. పాలమూరు జిల్లా నుంచి వలసలు ఆగలేదని చెప్పారు. పొట్టచేతబట్టుకొని వేల మంది బడుగు బలహీనవర్గాల వారు దేశం నలుమూలలకు వలసలు పోతున్నారన్నారు. బొంబాయి వెళ్లే ఆర్టీసీ బస్సు రద్దు చేసి పాలమూరులో వలసలు ఆగిపోయాయని నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. వ్యవసాయానికి యోగ్యమైన వేల ఎకరాల భూమి ఉన్నా సాగునీరు లేక పాలమూరు ప్రజలు పొట్టచేతపట్టుకుని ఇతర ప్రాంతాలకు వలసలు పోతున్నారన్నారు. 


హెలేంక్సీలో జరిగిన అంతర్జాతీయ జలసదస్సు నియమాల ప్రకారమైన, బచావత్‌ అవాద్‌ ఆదేశాల మేరకైన పరివామక ప్రాంత ప్రజల అవసరాలు తీర్చాకే ఇతర ప్రాంతాలకు జలవనరులు కేటాయించాలని గుర్తు చేశారు బండి సంజయ్‌. కానీ గత 150 ఏళ్లుగా కృష్ణా జలాలు బేసిన్‌ దాటి బయటికి పోతున్నా పాలకులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. 
పాలమూరు రంగారెడ్డి, కల్వకుర్తి ఎత్తిపోతల నిర్మాణం సత్వరమే పూర్తిచేసి పాలమూరు రైతులను సాగునీటి కష్టాల నుంచి ఒడ్డున పడివేయాలన్న శ్రద్ధ ప్రభుత్వంలో కనిపించడం లేదన్నారు. నారాయణపేట కొడంగల్‌ ఎత్తిపోతల పథకాన్ని ఇప్పటికే అటకెక్కించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజోలి బండ ద్వారా పాలమూరుకు చుక్కనీరు అందడం లేదని నెట్టెంపాడు, భీమ, కోయిల్‌ సాగర్‌ వంటి పథకాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకొని ప్రయత్నాలేవి కనిపించడం లేదని విమర్శించారు. 


కృష్ణా, గోదావరి  నదీ జలాల్లో తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన వాటా దక్కలేదన్న బండి సంజయ్‌...తెలంగాణ ఏర్పాటు కోసం జరిగిన పోరాటంలో నీళ్ల సమస్య కూడా ఒక ప్రధాన కారణమని గుర్తు చేశారు. 2014లో తెలంగాణ ఏర్పాటు అనంతరం అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ తెలంగాణ ప్రయోజనాలను కాపాడడంలో పూర్తిగా విఫలమైందన్నారు. 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత న్యాయంగా తెలంగాణకు దక్కాల్సిన జలాలను, ముఖ్యంగా కృష్ణా నదీ జలాలను కాపాడడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. 


రాజోలిబండ డైవర్షన్‌ స్కీమ్‌ ద్వారా ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలకు 15.9 టీఎంసీలు ఇవ్వాలి కానీ ఇప్పటి వరకు కనీసం 5 టీఎంసీల నీరు కూడా తెలంగాణ ప్రజలు వినియోగించడం లేదన్నారు బండి సంజయ్‌. ఈ విషయం పాలమూరు జిల్లాల్లో ఏ ఒక్కరిని అడిగినా చెబుతారన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఈ అంశాన్ని రాజకీయంగా ఉపయోగించేందుకు మాత్రమే మాట్లాడుతున్నారన్నారు. ఈ అంశంపై ప్రజల్లో సెంటిమెంట్‌ పెంచేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. 


ఎనిమిదేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో పాలమూరు రైతుల వినియోగానికి ఆర్డీఎస్‌ నుంచి 15.9 టీఎంసీల నీటిని అందజేయడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు బండి సంజయ్. ఆర్‌డీఎస్‌ జలాలు రాబట్టడంలో ఎందుకు విఫలమయ్యారో పాలమూరు ప్రజలకు జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. సాగునీటి ప్రాజెక్టుల కోసం ఖర్చు చేసిన దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్లాయో తెలపాలన్నారు. కాంట్రాక్టర్ల ద్వారా కేసీఆర్‌ కుటుంబానికి, కేసీఆర్‌ బంధువులకు, టీఆర్‌ఎస్‌ వారికి చేరిందని ఆరోపించారు. ఏపీ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపడంలో కేసీఆర్‌ విఫలం అయ్యారన్నారు. 


శ్రీశైలం జలాశయం నుంచి రోజుకు ఆరు నుంచి ఎనిమిది టిఎంసిల నీటిని అదనంగా తీసుకునే లక్ష్యంతో రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌తోపాటు ఇతర పథకాలకు ఏపీ ప్రభుత్వం 5 మే 2020న జీవో నం. 203 జారీ చేసిందన్న బండి సంజయ్‌... దీంతో  తెలంగాణ నష్టపోనుందన్నారు. ఈ సమస్యను తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని... భారతీయ జనతా పార్టీ మాత్రం సహించలేదన్నారు. ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని 12 మే 2020న కేంద్ర జలవనరుల శాఖ మంత్రికి స్వయంగా లేఖ రాశానని గుర్తు చేశారు. ఆ లేఖతోే కేంద్రమంత్రి స్పందించారన్నారు. అపెక్స్‌ కౌన్సిల్‌ ఆమోదం పొందే వరకు ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను కొనసాగించడాన్ని నిలిపివేయాలని కృష్ణా బోర్డు ద్వారా ఆదేశాలు జారీ చేయించారన్నారు. 


తెలంగాణకు న్యాయంగా రావలసిన నీటి వాటాలను, చట్టబద్ధమైన ప్రయోజనాలను కేంద్రం కాపాడుతుందని ఈ విషయం ద్వారా తెలుస్తుందన్నారు బండి సంజయ్. తెలంగాణ ప్రయోజనాలకు నష్టం కలుగుతున్నా.. ఏపీ అక్రమ ప్రాజెక్టులు కడుతున్న విషయాన్ని కేంద్రం దృష్టికి టీఆర్‌ఎస్‌ తీసుకెళ్ల లేదని విమర్శించారు. కేంద్రానికి లేఖ కూడా రాయకపోవడం ఆశ్చర్యకలిగించిందన్నారు. 


ఏపీకి సహకారం అందించి నీటి వాటా దోచి పెట్టేందుకు ప్రయత్నించారని కేసీఆర్‌పై ఫైర్ అయ్యారు బండి సంజయ్. అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశాన్ని 20 ఆగస్టు 2020 తర్వాత వాయిదా వేయమని కేసీఆర్ కోరడంతో ఏపీకి లాభించిందన్నారు. ఏపీ సీఎంతో  కుమ్మక్కై, తద్వారా తెలంగాణ ప్రజల ప్రయోజనాలను ఫణంగా పెట్టారని చాలా స్పష్టంగా అర్థమవుతోందన్నారు. ఇప్పటికే రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీం 90శాతం పని పూర్తయింది. దీనికి పూర్తి బాధ్యత కేసీఆర్‌దే అన్నారు. కృష్ణా జలాలను ఏపీ దోచుకోవడం వల్ల తెలంగాణ శాశ్వతంగా నష్టపోవాల్సి వస్తోందన్నారు. 


2015 సంవత్సరానికి గానూ 2015 జూన్‌ 19న,  2016 జూన్‌ 21వ తేదీన దిల్లీలో జరిగిన మొదటి అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో 2016 సంవత్సరానికి.. 2017 నవంబర్‌ 4వ తేదీన జరిగిన 7వ కేఆర్‌ఎంబీ సమావేశంలో ఈ 2017 తర్వాతా అదే 299 టీఎంసీల నీటివాటాకు కేసీఆర్‌ అంగీకరించారన్నారు. ఇది  సరైనది కాదని అభిప్రాయపడ్డారు బండి సంజయ్‌. కృష్ణా పరీవాహక ప్రాంతంలో 68.5 తెలంగాణ పరిధిలో ఉంది.  దాని ప్రకారం తెలంగాణకు 555 టీఎంసీ (811 టీఎంసీలో 68.5%) రావాలి. కానీ కేవలం 299 టీఎంసీలకే అంగీకరించి 555 టీఎంసీల వాటాను దక్కించుకోకుండా రాష్ట్ర ప్రయోజనాలను కేసీఆర్‌ కాలరాశారని విమర్శించారు. 299 టీఎంసీలకు అంగీకరించి కృష్ణా నదీ జలాలపై తెలంగాణకు న్యాయమైన నీటి హక్కులను కాపాడడంలో విఫలమయ్యారన్నారు. 


ఏళ్ల తరబడి ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు పూర్తికాకపోవడంతో రైతులు వ్యవసాయానికి  బోర్లు, వర్షాలపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు బండి. ప్రాజెక్టుల రీడిజైనింగ్‌ పేరుతో కమీషన్లకు కక్కుర్తి పడి, పాలమూరు జిల్లాలో పెండిరగ్‌ ప్రాజెక్టులను పూర్తిచేయలేదని ఆరోపించారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యం, పాలమూరు ప్రజల పట్ల జరుగుతున్న వివక్షపై చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. 


పాలమూరు సాగునీటి ప్రాజెక్టులపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు బండి సంజయ్. దీనిపై చర్చించడానికి కేసీఆర్ సిద్ధమా? పాలమూరు జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను వెంటనే పూర్తిచేయాలన్నారు. వలసలు అరికట్టి ప్రజలకు ఉపాధి కల్పించే చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే పాలమూరు ప్రజల పట్ల తన వివక్షను, నిర్లక్ష్యాన్ని కొనసాగించేందుకే నిర్ణయించుకున్నట్లు భావించాల్సి వస్తోందన్నారు.