TSRTC Chrages Hike : తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు మరోసారి షాక్ ఇచ్చింది. ఇప్పటికే డీజిల్ సెస్, సెఫ్టీ సెస్ పేరుతో ఛార్జీలు మోత మోగించింది టీఎస్ఆర్టీసీ. తాజాగా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ టికెట్‌ రిజర్వేషన్‌ ఛార్జీలు పెంచేందుకు సిద్ధమైంది. రిజర్వేషన్‌ ధరలను రూ.20 నుంచి 30 రూపాయలకు పెంచేందుకు సన్నద్ధమైంది. ఛార్జీల పెంపు నిర్ణయం తీసుకున్న ఆర్టీసీ యాజమాన్యం త్వరలో అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. 


రిజర్వేషన్ ఛార్జీలు పెంపు 


టీఎస్ఆర్టీసీ రిజర్వేషన్ ఛార్జీలపై రూ.10లు పెంచింది. దీంతో పాటు ఒక్కో రిజర్వేషన్ పై రూ.20 రూపాయల నుంచి 30 రూపాయలకు పెంచింది. గత నెలలో ఆర్టీసీ టోల్‌ సెస్, టిక్కెట్‌ ఛార్జీల సవరణ, ప్యాసింజర్‌ సెస్‌ ల పేరుతో సిటీ బస్సుల నుంచి గరుడ ప్లస్‌ బస్సుల వరకు ఆర్టీసీ ఛార్జీలు పెంచింది. తాజాగా రిజర్వేషన్ ఛార్జీలను పెంచి ప్రయాణికులపై మరింత భారం మోపింది. కొన్ని రోజుకల క్రితమే టికెట్ల ధరలు పెంచిన ఆర్టీసీ, పల్లెవెలుగు టికెట్ల ఛార్జీలు రౌండప్ చేసింది. చిల్లర సమస్య లేకుండా ధరలు రౌండప్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. అలాగే టోల్ ప్లాజా ధరలు కూడా టికెట్ పై రూపాయి చొప్పున పెంచింది. లగ్జరీ, ఎక్స్ ప్రెస్ బస్సులపై ఒక రూపాయి, సూపర్ లగ్జరీ, ఏసీ బస్సులపై రూ. 2 చొప్పున పెంచింది. 


డీజిల్ సెస్ పేరుతో ఛార్జీల పెంపు 


టీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు షాకిచ్చింది. మరోసారి ఆర్టీసీ ఛార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. డీజిల్ సెస్ పేరుతో ఇటీవల బస్సు ఛార్జీలను పెంచింది. డీజిల్ ధర పెంపు కారణంగా ఆర్టీసీ డీజిల్ సెస్ విధించింది. పల్లెవెలుగు, ఆర్డినరీ, సిటీ బస్సుల్లో టికెట్‌పై రూ. 2 చొప్పున అదనంగా సెస్ వసూలు చేస్తున్నారు. ఎక్స్ ప్రెస్, సూపర్ లగ్జరీ, డీలక్స్, సిటీ మెట్రో ఎక్స్ ప్రెస్, ఎయిర్ కండిషన్ బస్సుల్లో అదనంగా రూ. 5 వసూలు చేస్తున్నారు. డీజిల్ బల్క్ గా కొనుగోలు చేస్తే రూ. 118కు చేరిందని, ఒక్కో లీటర్‌పై రూ. 35 చొప్పున పెరగడం సంస్థపై భారం పడుతోందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా డీజిల్ ధరలు పెరుగుతుండడంతో డీజిల్ సెస్ తప్పడం లేదన్నారు. 


బస్సు పాస్ ఛార్జీలు పెంపు 


ఇటీవల అన్ని రకాల బస్‌ పాస్‌ ఛార్జీలను రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం పెంచింది. పెంచిన ధరలను ఏప్రిల్‌ ఒకటి నుంచి అమల్లోకి వచ్చాయి. ఆర్డినరీ పాస్‌ ఛార్జీని రూ.950 నుంచి రూ.1150కి పెంచింది. మెట్రో ఎక్స్‌ప్రెస్‌ రూ.1,070 నుంచి రూ.1,300కు, మెట్రో డీలక్స్‌ రూ.1,185 నుంచి రూ.1,450కు పెంచింది. మెట్రో లగ్జరీ రూ.2 వేల నుంచి రూ.2,400కు, పుష్పక్‌ పాస్‌ రూ.2,500 నుంచి రూ.3 వేలకు పెంచుతూ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఎన్‌జీవో బస్‌పాస్‌లకు ఆర్డినరీ పాస్‌ ఛార్జీ రూ.320 నుంచి రూ.400కు, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ రూ.450 నుంచి రూ.550కి, మెట్రో డీలక్స్‌ రూ.575 నుంచి రూ.700కు పెంచింది. ఎంఎంటీఎస్‌–ఆర్టీసీ కోంబో టికెట్‌ ఛార్జీ రూ.1,090 నుంచి రూ.1,350కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది.