వేసవిలో పెరిగిన విద్యుత్ వాడకం ప్రభుత్వాలకు సమస్యలు తీసుకొచ్చి పెడుతోంది. ఇప్పటి వరకు కోతలకు ఆంధ్రప్రదేశ్‌లోనే కనిపించాయి. ఇప్పుడు తెలంగాణలో కూడా మొదలవుతున్నట్టు తెలుస్తోంది. 


అయితే ఆంధ్రప్రదేశ్‌లో అన్ని వర్గాలపై కరెంట్‌ ఎఫెక్ట్ పడుతుండగా.. తెలంగాణలో మాత్రం ఓన్లీ రైతులపై మాత్రమే ప్రభావం చూపనుంది. 


తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు రైతులకు 24 గంటలపాటు ఉచిత విద్యుత్ ఇస్తూ వస్తోంది. ఇప్పుడు వేసవిలో పెరిగిన వాడకంతో విద్యుత్ భారీగా కొనుగోలు చేయాల్సి వస్తోంది. అందుకే వ్యవసాయానికి ఇచ్చే కరెంట్‌లో కోత పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించించింది. 


వ్యవసాయానికి ఇచ్చిన విద్యుత్‌ను 7 గంటలకే పరిమితం చేయాలని నిర్ణయించింది. ఈమేరకు TSNPDCL రాతపూర్వక ఆదేశాలు ఇచ్చింది. జిల్లాల వారీగా 7 గంటల త్రీఫేజ్ విద్యుత్ సరఫరా షెడ్యూల్‌ను పాటించాలని ఆదేశించింది. 


తెలంగాణలో చాలా రోజుల నుంచి భారీగా విద్యుత్ కొరత కనిపిస్తోంది. డిమాండ్‌ కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. అందుకే కోతలు తప్పడం లేదన్నది ప్రభుత్వాధికారుల వాదన. 


యాసంగి పంట కోత దశకు రావడంతో విద్యుత్ వాడకం పెద్దగా ఉండదని అందుకే ఏడు గంటలకు కుదించినట్టు పేర్కొంటున్నారు  అధికారులు. దీని వల్ల పంటలపై పెద్దగా ప్రభావం పడబోదంటున్నారు.  


ప్రభుత్వం మాత్రం దీన్ని కొట్టి పారేస్తోంది. ఏ సెక్టార్‌లోనూ విద్యుత్‌ కోతల్లేవని చెబుతోంది. వ్యవసాయానికి విద్యుత్ సరఫరా టైం కుదించలేదని ప్రకటించారు జెన్సో సీఎండీ ప్రభాకర్‌ రావు. ఎన్‌పీడీసీలో ఉన్న సమాచార లోపం కారణంగా ఈ సమస్య వచ్చిందన్నారు. దీని వల్లే సరఫరాకు అంతరాయం ఏర్పడిందని ప్రకటించారు. ఇకపై యథావిధిగా 24గంటలపాటు విద్యుత్ సరఫరా ఉంటుందని తెలిపారాయన.