తీసుకున్న లోన్(Loan) కట్టకుంటే రూపాయి బాకీ ఉన్నా ఫోన్లు(Phones) చేసి బెదిరిస్తుంటారు అధికారులు. చలానాలు పెండింగ్‌లో ఉంటే వెహికల్స్‌(Vehicles)ను సీజ్‌ చేస్తున్నారు.  అలాంటిది అధికారులు పని చేయకుంటే ఏం చేయాలి. అదే ఆలోచనతో ఓ రైతు తిరుగుబాటు ఇప్పుడు సంచలనంగా మారింది. 
 
మామూలుగా ఏ లోన్ కట్టకుంటేనో... లేకపోతే చట్టవ్యతిరేకమైన పనులకు పాల్పడితేనో వివిధ ప్రభుత్వ అధికారులు ఫ్లెక్సీల పనిష్మెంట్ వాడుతుంటారు. లోన్ ఎగ్గొట్టిన వారి వివరాలో, లేక గ్రామ పరిధిలో నేరం చేసేవాళ్ళ డీటెయిల్స్ సదరు ఫ్లెక్సీలలో పెడతారు. అదే పనిష్మెంట్‌ను అధికారులపై ప్రయోగించాడో రైతు 


తనకు అన్యాయం జరిగిందని ఏకంగా ప్రభుత్వ అధికారుల పేర్లు, ఫోన్ నంబర్లు ఫ్లెక్సీలపై రాసి బ్యానర్లు కట్టాడు. ఒకసారి ఫ్లెక్సీని చింపడంతో తిక్కరేగి ఈసారి బ్రిడ్జి చుట్టూ మరింత పెద్ద ఫ్లెక్సీలు కట్టి పారేశాడు.


రామడుగు(Ramadugu) మండల కేంద్రానికి సమీపంలో నిర్మిస్తున్న కొత్త బ్రిడ్జి నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. పనులు ప్రారంభించి మూడు సంవత్సరాలు గడుస్తున్నా పనులు ముందుకు సాగడం లేదు. మరోవైపు రేపోమాపో పాత బ్రిడ్జి కూలిపోయే దుస్థితి ఏర్పడింది. దీంతో స్థానికులు బిక్కుబిక్కుమంటూ ప్రయాణం చేయాల్సి వస్తోంది. 


నిర్మాణ సమయంలో భూమి కోల్పోయిన నిర్వాసితులకు కూడా ఇప్పటివరకు నష్ట పరిహారం చెల్లించలేదు సరికదా కొత్త బ్రిడ్జి ఎప్పుడు ఓపెన్ అవుతుందో తెలియని పరిస్థితి. దీంతో బాధితులైన రైతులు...అధికారులు కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వారి పేర్లు, హోదా, నంబర్లు వేసి మరీ ఫ్లెక్సీలు కట్టిపారేశారు.


ఎన్నిసార్లు అధికారులను అడిగినా ఇదిగో అదిగో అంటూ కాలయాపన చేస్తూ వచ్చారు. కానీ సమస్యకు మాత్రం పరిష్కారం చూపలేదు. దీంతో కోపం వచ్చిన రైతులు అధికారుల నిర్లక్ష్యాన్ని ఇలా బ్యానర్ కట్టి బ్యాండ్ వాయిస్తున్నారు. ఇప్పటికైనా మారాలని వేడుకుంటున్నారు.  


మొదట ఓ రైతుకు ఈ ఆలోచన వచ్చింది. అంతే రోడ్డుపై ఫ్లెక్సీలు పెట్టాడు. దాన్ని అధికారులు వచ్చి చించేశారు. ఇక ఊరంతా కూడబలుక్కొని కనిపించన చోటల్లా ఫ్లెక్సీలు కట్టేశారు. ఇప్పుడు ఏం చేయాలో అధికారులకు అర్థం కావడం లేదు. ఇందండీ రైతుల పవర్‌.


ఇది కాస్త సోషల్ మీడియాను ఆకర్షించింది. దీంతో రైతులు చేస్తున్న పోరాటానికి నెటిజన్లు కూడా మద్దతు తెలుపుతున్నారు. ఇది కాస్త వైరల్ కావడంతో అధికారులు, కాంట్రాక్టర్లు తలలు పట్టుకుంటున్నారు. దీన్ని ఎలా పరిష్కరించాలా అని ఆలోచిస్తున్నారు. రైతులను ఏదో శాంతిపజేసి ఫ్లేక్సీలు తీయించే ప్రయత్నం చేస్తున్నారు. అధికారుల చర్చలతో రైతులు శాంతిస్తారో లేదో చూడాలి.