Bandi Sanjay Letter To CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్ కు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ రాశారు. రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని వారిని తక్షణమే ఆదుకోవాలని తన లేఖలో కోరారు. రైతులను ఆదుకోవడంతో పాటు సమగ్ర పంటల బీమా పథకం రూపొందించాలని కోరుతూ తెలంగాణ సీఎం కేసీఆర్ కు బీజేపీ ఎంపీ బండి సంజయ్ లేఖ రాశారు. ఈ లేఖను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
బండి సంజయ్ లేఖలో పేర్కొన్న విషయాలివే..
అకాల వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 13 జిల్లాల్లో 5 లక్షల ఎకరాలకుపైగా పంట దెబ్బతిన్నట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. యాసంగిలో 73 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేశారు. ఇందులో వరి 55 లక్షల ఎకరాల్లో, మక్కలు 6.5 లక్షల ఎకరాల్లో, శనగ 3.65 లక్షల ఎకరాల్లో, పల్లి 2.50 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. కానీ అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. మిర్చి, మామిడి పంటల రైతుల నష్టాలు మరీ అధికంగా ఉన్నాయి. 40 వేల ఎకరాల్లో మామిడి పంట దెబ్బతిన్నది. మామిడి పంట నిర్వహణలో 65 శాతం వరకు కౌలు రైతులే ఉన్నారు, మిర్చి సాగు చేసిన రైతులు సైతం తీవ్రంగా నష్టపోయారు.
పంట నష్టం తేల్చే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. మంత్రుల టీమ్ కేవలం వికారాబాద్ జిల్లాలో పర్యటించడం రైతుల పట్ల మీ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తేలియజేస్తుంది. పలు జిల్లాల్లో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి. ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు రాష్ట్రంలో ఇప్పటివరకు సమగ్ర పంటల బీమా పథకాన్ని రూపొందించకపోవడం సిగ్గు చేటు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫసల్ భీమా పథకాన్ని తెలంగాణకు వర్తింపజేయకపోవడం వల్ల రాష్ట్ర రైతులకు తీరని నష్టం చేశారు. ప్రత్యామ్నాయ పంటల భీమా పథకాన్ని తీసుకువస్తామని చెప్పి 4 ఏళ్లు గడిచినా మీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రైతులు నష్టపోతూనే ఉన్నారు. బీజేపీకి పేరొస్తుందనే అక్కసుతో మీరు ఈ పథకాన్ని రాష్ట్రానికి వర్తింపజేయకపోవడంవల్ల ఏళ్ల తరబడి రైతులు నష్టపోతూనే ఉన్నారు.
గత ఏడాదితో పోల్చితే పంటల దిగుబడి తగ్గినట్లు తెలుస్తోంది. పెట్టుబడి వ్యయం పెరగడమే ఇందుకు కారణం. రైతుకు యూరియా సరఫరాలో వైఫల్యం, కౌలు రైతులకు ఆర్థిక భరోసా లేకపోవడంతో రైతులు నష్టపోతున్నారు. అకాల వర్షాలతో నష్టపోయిన పంటల విస్తీర్ణం రైతుల స్థితిగతులతో అంచనా వేసేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. సర్వేలు, నివేదికల పేరుతో కాలయాపన చేయకుండా అకాల వర్షాలవల్ల పంట నష్టపోయిన రైతులందరికీ యుద్ద ప్రాతిపదికన పరిహారం అందించాలి. మీ హామీల అమలుకు ఇదే ఆఖరి సంవత్సరం. రాబోయే వానాకాలం సీజన్ కు ముందే రైతులకు ఎరువులు, విత్తనాలు అందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.
విత్తనాల నుంచి రైతుకు పంట చేతికొచ్చి, మార్కెటింగ్ జరిగే వరకు పోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ పదే పదే చెబుతున్నారు. కేవలం రైతుబంధు ఇచ్చి చేతులు దులుపుకుంటే సరిపోదు. రైతు బంధు అందక భూమి సేద్యం చేస్తూ చితికిపోతున్న 14 లక్షల మంది కౌలు రౌతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. కనుక అకాల వర్షాలు, ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోతున్న రైతులను ఆదుకునేందుకు సమగ్ర పంటల భీమా పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ లేఖ రాశారు.