ABP  WhatsApp

Hyderabad News Today: హైదరాబాద్‌లో SNDP ప్రాజెక్టు ప్రభావం-కాలకూట విషంగా మారిన తాగునీరు

M Seshu Updated at: 22 Nov 2024 03:31 PM (IST)

Hyderabad News: వరద ముంపు నుండి లోోతట్టు ప్రాంత ప్రజలను రక్షించేందుకు చేపట్టిన SNDP ప్రాజెక్టు భూగర్భ జలాలను విషతుల్యంగా మార్చేసింది. భరించలేని దుర్వాసన,రోగాలు ప్రజలకు బోనస్ గా మారాయి.

హైదరబాద్ లో SNDP ప్రాజెక్టు ప్రభావం-కాలకూట విషంగా మారిన తాగునీరు

NEXT PREV

SNDP project Effect On Hyderabad News: హైదరాబాద్‌లోని బాచుపల్లి ఎస్‌కేకే కాలనీ వాసులు దుస్థితి మాటల్లో చెప్పలేనిది. ముల్లుతీయబోయి కాలే తొలిగించినట్లుగా తయారైంది వారి పరిస్తితి. ఎంత వర్షం వచ్చినా ఇకపై వరద భయం లేదంటూ గత ప్రభుత్వం చేపట్టిన ఎస్‌ఎన్‌డీపీ ప్రాజెక్ట్ నిర్మాణం అర్ధాంతరంగా ఆగిపోయింది. దీంతో ప్రాజెక్టు కోసం తవ్వి, నిర్మించిన భారీ కాలువలు ఇప్పుడు మురుగునీటి కూపాలుగా మారిపోయాయి. దీంతో కాలనీల్లోని స్వచ్చమైన భూగర్భ జలాలు కాస్తా ఇప్పుడు కాలకూట విషంలా మారాయి. కొబ్బరినీళ్లులా ఉండే తాగునీరు ఇప్పుడు మురికి కంపు కొడుతోంది అంతలా ఈ కాలనీలో భూగర్భ జలాలు కలుషితమైయ్యాయి. 



ఏడు సంవత్సారాలుగా మేము ఇక్కడే నివసిస్తున్నాం. ఎప్పుడూ ఇటువంటి కలుషత నీరు చూడలేదు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన ఎస్‌ఎన్‌డిపి ప్రాజెక్టు ఓ ప్రైవేటు వ్యక్తి భూమి వల్ల ఆగిపోయింది. దాదాపు నిర్మాణం పూర్తి అయ్యింది కానీ కేవలం నాలుగే నాలుగు కుంటలు భూమి ప్రైవేటు వ్యక్తిది కావడంతో ఆగిపోయింది. అతను భూమి ఇచ్చేందుకు నిరాకరించడంతో నిర్మాణం ఆపేశారు. దీంతో తవ్విన కాలువలు మురిగినీరు, వ్యర్థాలతో నిండిపోయాయి. భూగర్భ జలాలు పూర్తిగా కలుషితమయ్యాయి. ఆ నీరు తాగి వందల మంది ఆసుపత్రి పాలవుతున్నారు. చర్మవ్యాధులతోపాటు ముఖం ఎర్రగా మారిపోతోంది. డాక్టర్లు సైతం మీరు కలుషితమైన నీరు తాగుతున్నారంటూ నిర్ధారించడం జరిగింది. - శివ శంకర్ రెడ్డి, SKK కాలనీ, బాచుపల్లి


హైదరాబాద్‌లో నాలాలు సరిగా లేక ముంపునకు గురవుతున్న కాలనీలను రక్షించడమే గత ప్రభుత్వం ప్రతిస్టాత్మకంగా చేపట్టిన స్టాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రొగ్రామ్( SNDP) ప్రధాన ఉద్దేశం. ఎగువ నుంచి వస్తున్న ఆ మురుగునీటిని ప్రత్యేక కెనాల్‌ నిర్మాణం ద్వారా సమీపంలోని చెరువులకు తరలించడం లక్ష్యం. సంకల్పం మంచిదే కానీ ఓ చిన్న ఆటకం వల్ల ఏకంగా తాగే నీరు విషతుల్యంగా మారాయి. ముంపు అటుంచి ఇప్పుడు ప్రాణాలకే ముప్పు తెచ్చింది. 



ఈ ప్రాజెక్టు రాకముందు మేము రోజూ మా కాలనీవాళ్లంతా కలసి ఇక్కడ ఆలయంలో లలిత సహస్రనామం పారాయణంతోపాటు ప్రత్యేక పూజలు చేసేవాళ్లం. ఇప్పుడు ఆలయంలో కాసేపు కూర్చునే పరిస్థితి లేదు. భరించ లేని దుర్వాసనతో పూజలే మానేస్తున్నాం. దోమల వల్ల మా పిల్లలకు డెంగీలాంటి విష జ్వరాలు వ్యాపిస్తున్నాయి.  - సుజాత,బాచుపల్లి


అనారోగ్య సమస్యలు, అంటు వ్యాధులు, దుర్వాసన మాత్రమేకాదు. ఈ ప్రాజెక్ట్ పుణ్యమా అని ఏకంగా సాప్ట్‌వేరు ఇంజినీర్‌లు తమ ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి వచ్చింది. వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలంటే ఇంట్లో కూల్చోలేని దుస్థితి నెలకొంది..



మేము రోజూ వర్కఫ్రమ్ హోమ్ చేస్తుంటాం. ఇంట్లో ఉండి కాసేపు మీటింగ్ అటెండ్ అవ్వాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది. దోమలు కుడుతున్నాయి. ఆ దుర్వాసన భరించలేకపోతున్నాం. ఇంటికి వచ్చే బంధువులు సైతం ఈ దుర్వాసన, కాలుష్యం భరించలేక వెళ్లిపోతున్నారు. సరిగా పని చేయలేక ఉద్యోగం పోయే పరిస్థితులు వచ్చేశాయి. - ఝాన్సీ, సాప్ట్ వేర్ ఉద్యోగి, బాచుపల్లి


ఎస్‌ఎన్‌డీపీలో భాగంగా 150 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన అతిపెద్ద మురుగునీటి కాలువ నిర్మించారు. ఇది బాచుపల్లిలోని రెడ్డి ల్యాబ్ నుంచి SKK కాలనీ మీదుగా 10కిలోమీటర్లు ప్రయాణించి అమీన్ పూర్ చెరువులో కలుస్తుంది. దాదాపు 95శాతం కాలువ నిర్మాణం పూర్తైంది. కేవలం 5శాతం పూర్తైతే ఈ కాలనీ వాసుల కష్టాలు దూరమవుతాయి. భూగర్భ జలాలు తిరిగి మంచినీరుగా మారుతాయి. కానీ గత రెండేళ్లుగా కాలువ నిర్మాణం పూర్తి కాలేదు. కాళ్లరిగేలా తిరిగినా అధికారులు పట్టించుకోవడంలేదు. ఇంట్లో ఉంటే పాములు, బయటికొస్తే దుర్వాసన ఎలా బతుకుతామని ప్రశ్నిస్తున్నారు.



కాలనీలోకి వస్తున్న పాములను చూసి, భయపడి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం ఓ మహిళకు గాయాలయ్యాయి. ఓ 200 అడుగుల నీరు ముందుకు వెళ్లేలా ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తే పదకొండు కిలోమీటర్ల నుంచి వస్తున్న మురుగునీరు అమీన్‌పూర్ చెరువులో కలసిపోతుంది. మా సమస్య తీరుతుంది. అలా అని ఇది కోట్ల విలువైన ప్రాజెక్టు కాదు. - దిలీప్, బాచుపల్లి


కానీ ఏళ్లు గడుస్తున్నా అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఎవరూ పట్టించుకోవడంలేదు అంటున్నారు స్థానికులు. ఈ ప్రభుత్వమైనా ఈ దుస్థితి నుంచి బయటపడేయాలని కోరుతున్నారు. 


Also Read: హైదరాబాద్​ టూ ఊటీ, కూనూర్.. రౌండ్ ట్రిప్ బడ్జెట్ 8k, డిటైల్స్ ఇవే

Published at: 22 Nov 2024 03:31 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.