Hoax Bomb Threats: విమానాలకు బాంబు బెదిరింపు ఆగడం లేదు. తాజాగా శంషాబాద్ విమానాశ్రయంలో మూడు విమానల్లో బాంబులు ఉన్నట్టు అధికారులకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు మూడు విమానాలను ఆపిన అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇందులో చెనై వెళ్లేందుకు రెండు ఇండిగో విమానాలు సిద్ధంగా ఉంటే... ఒకటి చెన్నై నుంచి వచ్చింది.
మహారాష్ట్రలో ఓ వ్యక్తి అరెస్టు
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఎయిర్‌లైన్స్, హోటళ్లు, బ్యాంకులు, ఇతర ప్రాంతాలకు బాంబు బెదిరింపు కాల్స్ చేసిన నిందితుడిని మంగళవారం అరెస్టు చేశారు పోలీసులు. చాలా రోజులుగా విమానయాన సంస్థలు, హోటళ్ళు, బ్యాంకులకు కాల్స్ చేసి బాంబులు పెట్టామంటూ బెదిరించే వాడని తేల్చారు. నిందితుడు 35 ఏళ్ల జగదీష్ అనే రచయితగా గుర్తించారు. వివిధ సంస్థలకు పంపిన వరుస ఇమెయిల్‌లు జగదీష్ నుంచి వచ్చినట్టు నిర్దారించారు. ఈ వ్యక్తి తీవ్రవాదంపై ఓ పుస్తకాన్ని రాశారు. ఇప్పటికే ో కేసులో 2021లో అరెస్టు కూడా అయ్యాడు.
ఢిల్లీలో ఒకరు అరెస్టు
మూడు రోజుల క్రితం ఇలాంటి బెదిరింపులకు దిగుతున్నాడనే 25 ఏళ్ల యువకుడిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు మహారాష్ట్రంలో మరో వ్యక్తిని అరెస్టు చేశారు. ఢిల్లీలో అరెస్టు అయిన వ్యక్తి నకిలీ బెదిరింపులకు పాల్పడినట్లు అంగీకరించాడని పోలీసులు తెలిపారు. ఆ వ్యక్తిని రాజపురికి చెందిన శుభం ఉపాధ్యాయ్‌గా గుర్తించినట్లు సమాచారం.
ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్‌లో 4 విమానాలను పేల్చివేస్తానని అక్టోబర్ 16న బెదిరించిన ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని బెదిరింపుల కారణంగా విమానాలు ఆలస్యంగా నడిచాయి. మరికొన్ని రద్దు అయ్యాయి.
గత కొన్ని నెలలుగా దేశవ్యాప్తంగా విమానాలు, పాఠశాలలు, మాల్స్, ఆసుపత్రులు, బ్యాంకులు, ఇతర బహిరంగ ప్రదేశాలకు బాంబు బెదిరింపులు వస్తున్నాయి. తాజాగా తిరుపతిలోని పలు హోటల్స్‌కి కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో అర్థరాత్రివేళ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ బెదిరింపులు బూటకమని తేలింది. ఎటువంటి స్పష్టమైన ఆధారాలు లేకుండా వివిధ సోర్స్ నుంచి బెదిరింపులు కాల్స్ వస్తున్నాయి. చాలా వరకు ఇవి బూటకం అని తెలిసినప్పటికీ అధికారులు రిస్క్ తీసుకోలేకపోతున్నారు. అందుకే బెదిరింపు కాల్స్ వచ్చినప్పటికీ లైట్ తీసుకోకుండా తనిఖీలు చేస్తున్నారు.
Also Read: విమానాలకు ఫేక్ బాంబు బెదిరింపు కాల్స్ - సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లకు కేంద్రం వార్నింగ్