Actor Rajendra Prasad: సీనియర్ సినీ నటుడు రాజేంద్రప్రసాద్‌ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కుమార్తె గాయత్రి అకస్మాత్తుగా మృతి చెందారు. 38 ఏళ్ల కుమార్తె ఇలా సడెన్‌గా చనిపోవడంతో రాజేంద్రప్రసాద్ కుటుంబంలో షాక్‌కు గురైంది. చాతీలో నొప్పి ఉందని నిన్న ఏఐజీ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడే చికిత్స పొందుతూ ఆమె చనిపోయారు. రాజేంద్రప్రసాద్‌కు ఒక కుమారుడు కుమార్తె. 


రాజేంద్రప్రసాద్ కుమార్తె గాయత్రి అంత్యక్రియలు రేపు జరగనున్నాయి. గాయత్రి మరణ వార్త తెలుసుకన్న సినీ రాజకీయ ప్రముఖులు తమ సంతాపం తెలియజేశారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని దేవుణ్ని ప్రార్థించారు. రాజేంద్ర ప్రసాద్‌కు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. 


గాయత్రి మృతి దిగ్భ్రాంతి కలిగించింది: చంద్రబాబు
సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ కుమార్తె గాయత్రి గుండెపోటుతో మరణించారనే వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు సీఎం చంద్రబాబు. చిన్న వయసులోనే అకాల మరణానికి గురికావడం అత్యంత దురదృష్టకరమని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ విషాద సమయంలో ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. 




రాజేంద్రప్రసాద్‌కు దేవుడే ధైర్యం ఇవ్వాలి: పవన్ కల్యాణ్
రాజేంద్ర ప్రసాద్ కుమార్తె గాయత్రి హఠాన్మరణం దిగ్భ్రాంతి కలిగించిందన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. గాయత్రి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను అన్నారు. రాజేంద్ర ప్రసాద్, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. పుత్రిక వియోగాన్ని తట్టుకొనే మనో ధైర్యాన్ని రాజేంద్ర ప్రసాద్‌కి ఇవ్వాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. అని ఓ ప్రకటనలో తెలిపారు. 


అత్యంత ఆప్తులైన రాజేంద్ర ప్రసాద్ కుమార్తె గాయత్రి మరణం చాలా విషాదకరమన్నారు జూనియర్ ఎన్టీఆర్. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. రాజేంద్ర ప్రసాద్, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని ట్వీట్ చేశారు. 




సాయికుమార్, శివాజీ చాలా మంది ప్రముఖ సినీ నటులు గాయత్రి మృతదేహానికి నివాళి అర్పించారు. రాజేంద్రప్రసాద్‌కు ధైర్యం చెప్పారు. 


మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా రాజేంద్ర ప్రసాద్ కూతురు మరణం వార్తపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆ కుటుంబంతో ఉన్న సంబంధాన్ని గుర్తు చేసుకున్నారు. టీడీపీలో ఉన్నప్పటి నుంచి మంచి అనుబంధం ఉందని తెలిపారు.