Five Youth Abused Two Girls In Hyderabad: తెలంగాణలో దారుణం జరిగింది. పునారావాస కేంద్రం నుంచి పారిపోయిన ఇద్దరు బాలికలపై ఐదుగురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఐఎస్ సదన్ డివిజన్ పరిధిలో బాలికల కోసం ఓ ప్రైవేట్ సంస్థ పునరావాస కేంద్రం నిర్వహిస్తోంది. జనగామ (Janagam) ప్రాంతానికి చెందిన బాలిక (14) మూడు నెలల నుంచి, మల్కాజిగిరికి చెందిన బాలిక (15) సెప్టెంబర్ 18 నుంచి అక్కడ ఆశ్రయం పొందుతున్నారు. ఇద్దరికీ తల్లిదండ్రులున్నా వేర్వేరు కారణాలతో అక్కడ చేర్పించారు. అయితే, కేంద్రంలో బాలికల మధ్య స్నేహం కుదిరి అక్కడి నుంచి వెళ్లిపోవాలని పథకం వేశారు. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 24న కిటికీ నుంచి దూకి పారిపోయారు. విషయం తెలుసుకున్న నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సైదాబాద్ పోలీసులు విచారణ చేపట్టారు.
ఇద్దరు బాలికలపై అత్యాచారం
ఇద్దరు బాలికలు గత నెల 24వ తేదీన రాత్రి 8 గంటలకు జనగామ చేరుకున్నారు. బాలికల్లో ఒకరు బస్టాండ్ సమీపంలో ఉన్న పాన్ షాప్ నిర్వాహకుడు సాయిదీప్ దగ్గర ఫోన్ తీసుకుని తనకు పరిచయమున్న నాగరాజుకు ఫోన్ చేసింది. అతను వచ్చి ఆశ్రయం కల్పిస్తానంటూ తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బస్టాండ్ దగ్గరే ఒంటరిగా ఉన్న మరో బాలికను గమనించిన సాయిదీప్.. ఆశ్రయం కల్పిస్తానని పక్కనే ఉన్న బేకరీకి తీసుకెళ్లాడు. అక్కడ సాయిదీప్, బేకరీ నిర్వాహకుడు రాజు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తాను తీసుకెళ్లిన బాలికను నాగరాజు 25వ తేదీన ఉదయం తీసుకొచ్చి బస్టాండ్ వద్దే వదిలేశాడు.
బాలికల విషయం తెలుసుకున్న సాయిదీప్, రాజుల స్నేహితులు అఖిల్, రోహిత్‌లు హైదరాబాద్ తీసుకెళ్తామంటూ.. కారులో వేర్వేరు ప్రాంతాల్లో తిప్పుతూ లైంగిక దాడికి పాల్పడి తిరిగి బస్టాండ్ దగ్గరే వదిలిపెట్టారు. పోలీసులకు ఈ బాలికలు కనిపించడంతో అదే రోజు సైదాబాద్ తీసుకొచ్చి పునరావాస కేంద్రంలో అప్పగించారు. వారు భరోసా కేంద్ర నిపుణులను పిలిపించి కౌన్సెలింగ్ ఇప్పించగా.. బాలికలు తమపై లైంగిక దాడి జరిగిందని తెలిపారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఐదుగురు యువకులపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
'మహిళలకు భద్రత కరువైంది'
ఈ ఘటనపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైందని.. బాలికలపై జరిగిన అత్యాచార ఘటన వార్త తనను తీవ్రంగా కలిచివేసిందని అన్నారు. భద్రత కల్పించాల్సిన ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహిస్తోందని మండిపడ్డారు. అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని హెచ్చరించినా నిర్లక్ష్యం వీడలేదని ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. '9 నెలల కాంగ్రెస్ పాలనలో 2 వేలకు పైగా అత్యాచారాలు జరిగాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సీఎం రేవంత్ రెడ్డి హోంమంత్రిత్వ శాఖను సైతం నిర్వహిస్తున్నప్పటికీ రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించడంలో పూర్తిగా విఫలమయ్యారు. గత ప్రభుత్వ హయాంలో షీ టీమ్స్, సఖి భరోసా కేంద్రాలు ఏర్పాటయ్యాయి. మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చాం.' అని పేర్కొన్నారు.
Also Read: Family Digital Card: తెలంగాణ ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వేలో ఏం అడుగుతున్నారు? మనం ఏం ఇవ్వాలి?