Telangana: తెలంగాణ వ్యాప్తంగా ఫ్యామిలీ డిజిటల్ కార్డు కోసం చేపట్టిన పైలెట్ ప్రాజెక్టు సర్వే కొనసాగుతోంది. ప్రతి నియోజకవర్గంలో ఒక వార్డు, రెండు గ్రామ పంచాయితీలను ఎంపిక చేసుకొని వివరాలు నమోదు చేస్తున్నారు. బృందాలుగా విడిపోయిన అధికారులు ప్రజలతో మాట్లాడి వారి వివరాలు రిజిస్టర్ చేస్తున్నారు.
అధికారులు ఏం అడుగుతున్నారు?
ఫ్యామిలీలో మహిళను యజమానిగా గుర్తిస్తూ సర్వే సాగుతోంది. కుటుంబంలో ఎవరెవరు ఉంటున్నారు. ఎన్ని ఇళ్లు ఉన్నాయి. ఎన్ని ఫ్యామిలీలు ఉంటున్నాయి. చదువుకుంటున్న వాళ్లు ఎంతమంది కుటుంబ పెద్ద ఏం పని చేస్తున్నారు. రేషన్ కార్డు ఉందా, ఆధార్ కార్డులో ఏమైనా తప్పులు ఉన్నాయా.. లేకుంటే సరిచేయాల్సినవి ఏమైనా ఉన్నాయా ఇలా అన్నింటిపై ఆరా తీస్తున్నారు. వీటితోపాటు పెళ్లి అయిన ఆడపిల్లలను ఉంటే రేషన్ కార్డు నుంచి తొలగించడం, కొత్తగా పెళ్లై ఉంటే కొత్త కార్డు ఇచ్చే ఏర్పాటు చేయడం లాంటివి కూడా చేస్తున్నారు.
ప్రతి విషయాన్ని అడిగి తెలుసుకుంటున్నారు. ఏ విషయాలు దాచొద్దని అలా చేస్తే భవిష్యత్‌లో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని అధికారులు సూచిస్తున్నారు. సర్వేలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం రూపొందించిన అప్లికేషన్‌లో ఉన్న ఫార్మాట్ ప్రకారం దఖాస్తు నింపుతున్నారు. ఫ్యామిలీ మెంబర్స్ ఫొటోలు తీస్తున్నారు.
ఈ నెల ఏడుతో ఈ పైలెట్ ప్రాజెక్టు పూర్తి చేయాలని అధికారులకు గడువు ఇచ్చారు. అందుకే బృందాలుగా విడిపోయి ఉన్నతాధికారుల పర్యవేక్షణలో సర్వే చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో రెండు గ్రామ పంచాయతీలు, వార్డుల్లో ప్రజల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. దాని ఆధారంగా డిజిటల్ కార్డు జారీ చేయనున్నారు.
పైలెట్ ప్రాజెక్టు ప్రారంభించిన రేవంత్ రెడ్డి
తెలంగాణలో ఇకపై అన్ని సంక్షేమ పథకాలు, అన్ని సదుపాయలు పాదర్శకంగా అందించేందుకు ఫ్యామిలీ డిజిటల్ కార్డు తీసుకొస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. సికింద్రాబాద్‌లో ఈ కార్డు సర్వే పైలెట్ ప్రాజెక్టు ప్రారంభించారు. భవిష్యత్‌లో డిజిటల్ కార్డు 30 రకాల సేవలు అందించేదుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఈ పైలెట్ ప్రాజెక్టు 119 నియోజకవర్గాల్లోని ప్రతి రెండు గ్రామ పంచాయతీల్లో ప్రారంభమవుతుందన్నారు రేవంత్ రెడ్డి. పదేళ్లుగా రేషన్ కార్డులు, ఆరోగ్య శ్రీ కార్డులు లేక జనాలు ఇబ్బందులు పడుతున్నారని కొత్త కార్డు జారీలో కూడా సమస్య ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. అందుకే దాదాపు 30 ప్రభుత్వ శాఖల వద్ద ఉన్న సమచారాన్ని ఒక చోట చేర్చే పనికి శ్రీకారం చుట్టామన్నారు. అందులో భాగంగా 239 ప్రాంతాల్లో పైలెట్ ప్రాజెక్టు చేపట్టినట్టు పేర్కొన్నారు.
కార్డు ద్వారా ఏ సేవలు అందుతాయంటే?
ఫ్యామిలీ డిజిటల్ కార్డు అమల్లోకి వస్తే మాత్రం అదే రేషన్ కార్డు, అదే ఆరోగ్య శ్రీ కార్డు, అదే ఉచిత బస్ పాస్, అదే రైతు బీమా కార్డు, అదే విద్యార్థులకు ఫీజు రియెంబర్స్‌మెంట్ కార్డు అవుతుందన్నారు రేవంత్. ఒక్క క్లిక్‌తో ఒక ఫ్యామిలీ సమస్త సమాచారం అధికారుల వద్ద ఉంటుందని అన్నారు. ఏ శాఖ ఏ అవసరం కోసమైనా ఈ సమాచారన్ని వాడుకునే వెసులుబాటు కలుగుతుందన్నారు.
Also Read: రైతులకు కేంద్రం శుభవార్త- రేపు పీఎం కిసాన్ యోజన డబ్బులు విడుదల- ఈ పని చేయకుంటే నిరాశ తప్పదు!