Save Damagundam Forest Campaign | పూడూరు: వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలోని అనంతగిరి కొండల మధ్య ఉన్న దామగుండం అటవీ భూములను వెరీ లో ఫ్రీక్వెన్సీ రాడార్ స్టేషన్ కోసం భారత నావికాదళానికి కేటాయించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులు నిర్ణయించారు. ఈ నిర్ణయానికి నిరసనగా తెలంగాణలోని కొంతమంది ఎన్విరాన్మెంటల్ ఆక్షన్ కార్యకర్తలు ఆందోళనలు చేపడుతున్నారు.


ఈ రాడార్ స్టేషన్ ప్రాజెక్ట్ దాదాపు రూ. 2500 కోట్ల వ్యయంతో చేపడుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్టనానికి సంబంధిత తూర్పు నావికాదళ కమాండ్ ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం ఇచ్చేందుకు యోచిస్తున్నందున, ఈ ప్రాజెక్ట్ కు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి.


ఈ ప్రాజెక్ట్ ప్రారంభిస్తే, వికారాబాద్ అడవుల్లో సహజ వనరులు కోల్పోవడం, ఆహ్లాదకర వాతావరణం కోల్పోవడం, వన్యప్రాణుల మనుగడకు ముప్పు కలగడం వంటి సమస్యలు ఎదురవ్వచ్చు అని కొందరు పర్యావరణ పరిరక్షణ కార్యకర్తలు అభిప్రాయ పడుతున్నారు. అంతే కాకుండా కొన్ని వందల అరుదైన ఔషధ వృక్షాలు కూడా కోల్పోయే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. ఈ తరుణం లో #SaveDamagundamForest క్యాంపెయిన్ పేరిట సోషల్ మీడియాలో ఆందోళనలు ఊపందుకుంటున్నాయి.


2010 నుండి ప్రతిపాదన దశలో ఉన్న నావికాదళ రాడార్ ప్రాజెక్టు 2024లో పురోగతి సాధించనుంది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా దాదాపు 2900 ఎకరాల అటవీ భూములను అధికారులు స్వాధీనం చేసుకోబోతున్నారు, దీనిలో సుమారు 12 లక్షల చెట్లను నరికివేయాల్సి వస్తుంది.


వికారాబాద్ దామగుండం పరిసరాల్లోని 20 గ్రామాల్లో సుమారు 60,000 మంది ప్రజల జీవితం ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రభావితమవుతుందని అంచనా వేస్తున్నారు. అడవిపై ఆధారపడిన కూలీలు, రైతులు, పశువులను పెంచే కుటుంబాల జీవనోపాధి తీవ్రంగా దెబ్బతినవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


2020లో నమోదైన పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ (PIL) ద్వారా తెలిసింది ఏంటంటే గత ఐదేళ్లలో 12,12,753 చెట్లను నరికివేయడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతించిందని ఇది దేశంలోనే అత్యధిక అటవీ నిర్మూలన రేటుగా ఉందని వారు వాపోతున్నారు. గతంలో ఈ ప్రాజెక్టుకు తెలంగాణ హై కోర్టు నాలుగు సంవత్సరాల పాటు స్టే విధించింది, అయితే 2024 జనవరిలో ఈ ప్రాజెక్టు తిరిగి ముందుకు కదిలింది. ప్రభావిత ప్రాంతాల స్థానికులతో సరైన సంప్రదింపులు కూడా జరగలేదు అని చెబుతున్నారు. ఈ ప్రాజెక్ట్ మూసీ నది పై కూడా ప్రతికూల ప్రభావం చూపవచ్చని, రేడియేషన్ మరియు చెట్లు తొలగించడం ప్రజలు, వన్యప్రాణుల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాలు కలిగించే ప్రమాదం ఉందని ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్టులు హెచ్చరిస్తున్నారు.


Also Read: India Last Village : సర్పంచ్‌కు అరవై మంది భార్యలు - ఇండియాలో చిట్టచివరి గ్రామంలో వింతలుు, విశేషాలు ఇవిగో