River Musi in Hyderabad: హైదరాబాద్‌లో మూసీ నదిని ప్రక్షాళన చేయాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉన్న సంగతి తెలిసిందే. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఈ దిశగా ప్రయత్నాలు చేపట్టినా ఆ ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మూసీ నది ప్రక్షాళన దిశగా ప్రయత్నాలు చేస్తోంది. అయితే, మూసీ నది ప్రక్షాళన విషయంలో భాగంగా ప్రస్తుతం దక్షిణ కొరియాలోని సియోల్‌ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి అక్కడ కీలక పరిశీలనలు చేస్తున్నట్లుగా తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. 


సియోల్‌లో రేవంత్ రెడ్డి తన టీమ్‌తో కలిసి చెయోంగ్గీచెయోన్ నదిని పరిశీలించారు. సోమవారం (ఆగస్టు 12) పోద్దుపోయాక ఆ నది తీరానికి వెళ్లిన రేవంత్ రెడ్డి.. చుట్టూ ఉద్యానవనాలను అభివృద్ధి చేసిన తీరును, ఆటవిడుపు కేంద్రాలను పరిశీలించారు. దాన్నుంచి స్ఫూర్తి పొంది.. హైదరాబాద్‌లోని మూసీ నది రివర్ ఫ్రంట్‌ కోసం అక్కడి ఆలోచనలను ఉపయోగిస్తామని తెలంగాణ సీఎంవో ట్వీట్ చేసింది. మూసీ నదిని వరల్డ్ క్లాస్ వాటర్ ఫ్రంట్ గా మార్చే యోచనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నట్లుగా పోస్ట్ లో పేర్కొన్నారు.


సియోల్ నడిబొడ్డున ఉన్న ఈ నది సుందరీకరణ జరిగిన తీరుతెన్నులను గమనించిన తర్వాత మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ పై అనేక ఆలోచనలకు అవకాశం ఇచ్చిందని ముఖ్యమంత్రి వెల్లడించారు.


దాదాపు 11 కిలోమీటర్ల ఈ నది విపరీతమైన కలుషితాలతో ఉండేది. ఈ నదిని 2005 నాటి నుంచి పునరుద్ధరణ పనులతో  ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రివర్ ఫ్రంట్‌గా తీర్చిదిద్దిన తర్వాత సియోల్ నగరవాసులే కాకుడా ప్రపంచం నలుమూలల నుంచి ఏటా దాదాపు 19 కోట్ల మంది పర్యాటకులు సందర్శిస్తున్నారు.






వరంగల్ టెక్స్‌టైల్ పార్కులో పెట్టుబడులపై కొరియ‌న్ కంపెనీల ఆస‌క్తి


వరంగల్ లోని కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కులో పెట్టుబడులు పెట్టేందుకు కొరియన్ కంపెనీలు ఆసక్తి వ్యక్తం చేశాయి. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర బృందం పలు ప్ర‌పంచ‌స్థాయి కంపెనీల అధినేతలు, వ్యాపార బృందాల‌తో చ‌ర్చ‌లు జరిపింది. ఈ క్ర‌మంలో కొరియా ఫెడరేషన్ ఆఫ్ టెక్స్‌టైల్ ఇండస్ట్రీ (KOFOTI) ఆధ్వర్యంలో బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వ‌హించారు. స‌మావేశంలో యాంగాన్ (Youngone) ఛైర్మ‌న్ కిహ‌క్ సుంగ్ , KOFOTI ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మ‌న్ సోయాంగ్ స‌హా 25 భారీ జౌళి కంపెనీల ప్ర‌తినిధులు పాల్గొన్నారు. స‌మావేశంలో టెక్స్‌టైల్ ప‌రిశ్ర‌మ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం చేప‌ట్టిన కార్యాచరణ, వ‌రంగ‌ల్ టెక్స్‌టైల్ పార్క్‌తో పాటు తెలంగాణ‌లో టెక్స్‌టైల్ ప‌రిశ్ర‌మ అభివృద్ధికి ఉన్న సానుకూల‌త‌ల‌ను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి వివ‌రించారు. రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెట్టాల‌ని పిలుపునిచ్చారు. ముఖ్య‌మంత్రి పిలుపున‌కు కొరియ‌న్ టెక్స్‌టైల్ కంపెనీల ప్ర‌తినిధులు సానుకూల‌త వ్య‌క్తం చేశారు.


ద‌క్షిణ కొరియాలో అతి పెద్ద పారిశ్రామిక సంస్థ అయిన ఎల్ఎస్ కంపెనీ ప్ర‌తినిధులు త్వ‌ర‌లో తెలంగాణ‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్ర‌తినిధి బృందం ఎల్ఎస్ గ్రూప్ ఛైర్మ‌న్ కు జా యున్ నేతృత్వంలోని ఆ కంపెనీ సీనియ‌ర్ల‌తో స‌మావేశ‌మైంది. స‌మావేశంలో తెలంగాణ‌లో ఎల‌క్ట్రిక్ కేబుళ్లు, గ్యాస్‌, విద్యుత్‌, బ్యాట‌రీల ఉత్ప‌త్తి, పెట్టుబ‌డుల‌పై చ‌ర్చ‌లు జ‌రిగాయి. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానం మేర‌కు ఎల్ఎస్ బృందం త్వ‌ర‌లోనే తెలంగాణ‌కు రానుంది. ఎల్ఎస్ కంపెనీ గ‌తంలో ఎల్‌జీ గ్రూప్‌లో భాగ‌స్వామిగా ఉండేది.